రోగం తగ్గాలంటే… ముందు ఆ రోగానికి మూలం ఏమిటో తెలియాలి… చికిత్సకు సరైన మందు పడాలి… అప్పుడే రోగం నుంచి విముక్తి… అలాగే మోకాళ్లకు తలనొప్పి మందు రాస్తానంటే కుదరదు… డెంగ్యూకు మలేరియా ఇంజక్షన్లు ఇస్తానంటే వికటిస్తాయి… సో, ఎక్కడ మందు పూయాలో అక్కడే పూయబడాలి… మందు వేయబడాలి… లేకపోతే రోగం మరింత ముదిరి, ప్రాణాలమీదికొస్తుంది… ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి అదే… వచ్చిన సినిమాలు వచ్చినట్టు తంతున్నయ్… పురుగు కూడా థియేటర్ల వైపు పోవడం లేదు…
అఫ్కోర్స్, ఈ ట్రెండ్ దేశమంతా ఉంది… కానీ తెలుగు ఇండస్ట్రీ పెద్ద బుర్రలన్నీ కలిసి కూర్చుని, మథనం చేసి, మంతనాలు ఆడి… అసలు ఈ రోగానికి అసలు కారణం ఓటీటీలే అని తేల్చేశారు… అదొక దిక్కుమాలిన రోగనిర్ధారణ… 6 కోట్ల లోపు బడ్జెట్ ఉన్న సినిమాలైతే 4 వారాల తరువాత, ఆపైన బడ్జెట్ ఉన్న సినిమాలైతే 10 వారాల గ్యాప్ తరువాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేయాలని తీర్మానించేశారట… దీన్నే దిక్కుమాలిన వైద్యం అంటారు…
అసలు పెద్ద సినిమా, చిన్న సినిమా అనేవి బడ్జెట్ను బట్టి ఉండవురా బాబులూ… ఉదాహరణకు 6 కోట్ల లోపు సినిమా బాగా హిట్టయిపోయి, మంచి వసూళ్లను సాధిస్తే… అదేసమయంలో భారీ బడ్జెట్తో తీసిన సినిమాకు వసూళ్లు లేకపోతే… అప్పుడు ఏది పెద్ద సినిమా… ఏది చిన్న సినిమా… అసలు బడ్జెట్ అనేది దేనికి ప్రామాణికం… మరీ సినిమాటోగ్రఫీ ప్రభుత్వ విభాగాల్లో ఉన్న తలకాయల్లాగే ఉన్నాయి ఈ నెత్తిమాశిన ప్రాతిపదికలు…
Ads
ఇక్కడే మరో చిక్కు ఉంది… 6 కోట్లపైబడిన సినిమా గనుక థియేటర్లలో కుక్కలు కూడా చూడకపోతే, ఏ ఓటీటీ వాడు కూడా సరైన ధర పెట్టకపోతే… అప్పుడు రెండు వైపులా… కాదు, కాదు, శాటిలైట్ రేట్లు కూడా తంతాయి కదా… మూడు వైపులా దెబ్బ ఖాయం… ఆచార్యకు జరిగింది అదే కదా… సో, ఇండస్ట్రీ ఆలోచనలు అపసవ్యరీతిలో పోతున్నాయి… మన సినిమాల్లో నాణ్యతలాగా…
అసలు రోగం ఏమిటి..? ఓటీటీలు కాదు… వాటి రీచ్ ఇప్పటికీ తక్కువ… థియేటర్లనే జనం ఇష్టపడతారు… కానీ అవి ప్రేక్షకుడిని రానిస్తే కదా… అడ్డగోలు టికెట్ రేట్లు, క్యాంటీన్ రేట్లు, పార్కింగ్ రేట్లు, వచ్చీపోవడానికి టైం, డబ్బు, పొల్యూషన్… జేబుకు చిల్లు పడుతోంది… తీరా వెళ్తే… అవే దిక్కుమాలిన వ్యక్తిపూజ… సుప్రీం హీరోయిజం… అవే యాక్షన్ సీన్లు, అవే రొమాన్స్, అవే చెత్తా కథలు, ఫోజులు ఎదవ బిల్డప్పులు… ఇంకా ఎంతకాలం చూస్తారు ఈ డొల్ల బుర్రల ఫార్ములా ఇమేజీ కథనాల్ని…
ఒక్కడికీ క్రియేటివ్ ఐడియాల్లేవు… ప్రయోగాలు లేవు… వైవిధ్యం లేదు… అభిరుచి లేదు… ఆ ఆర్ఆర్ఆర్ చూడండి… తెలుగు సినిమా చరిత్రలోనే ఇంత ఘోరంగా జననేతల చరిత్రలను వక్రీకరించిన నీచమైన సినిమా మరొకటి లేదు, రాదు… కానీ టేకింగులో రాజమౌళి అదరగొట్టాడు… సినిమా నిలబడింది… చాలా చిన్న సినిమాలైనా సరే డీజే టిల్లు, మేజర్ నిలబడ్డాయి… లాభాల్ని తెచ్చిపెట్టాయి… సినిమాల్లో నాణ్యత ఉంటే ప్రేక్షకుడు థియేటర్లకు వస్తాడు… నిలువు దోపిడీ ఇవ్వడానికి కాదు కదా…
రోగం ఇదైతే… మేం ఓటీటీలకు చాలా లేటుగా ఇస్తాం అంటున్నాయి పెద్ద తలకాయలు… నిజానికి ప్రతి నిర్మాతను ఇప్పుడు ఆదుకుంటున్నవి ఓటీటీలే… ఆ సంస్థలు ఇచ్చే డబ్బులతోనే ఫ్లాప్ నిర్మాతలు బచాయించిపోతున్నారు… ఇక ఓటీటీలు కూడా సినిమా లేటయ్యేకొద్దీ ధరలు తగ్గిస్తే… అప్పుడు ఉంటుంది అసలు తమాషా… ఇలాంటి నిర్ణయాల్నే కొరివితో తలగోక్కోవడం అంటుంటారు…!!
Share this Article