చాలా వార్తలు కనిపిస్తున్నయ్ కానీ… వాటిల్లో ఒక్క పాయింట్ మాత్రం భలే అనిపించింది… నవ్వొచ్చింది… అది చెప్పుకోవడానికి ముందు అసలు పూర్వ కథ ఏమిటో కాస్త చెప్పుకోవాలి కదా… తృణమూల్ కాంగ్రెస్… దమ్మున్న ఈ పార్టీ దగ్గూదమ్ముతో ఇప్పుడు ఊపిరాడక సతమతమవుతోంది… నంబర్ వన్ మమత, నంబర్ టూ అభిషేక్… నంబర్ త్రీ పార్థ ఛటర్జీ… ఇప్పుడాయన ఈడీకి చిక్కాడు… ఈడీ తవ్వేకొద్దీ చాలా అక్రమాల వేళ్లు తగులుతున్నయ్… టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్ మాత్రమే కాదు, ఇంకా చాలా కథలున్నాయట…
ఇక్కడ సమస్య ఏమిటంటే..? పార్థ ఛటర్జీ కథలన్నీ తెలిసీ మమత ఎందుకు ఇగ్నోర్ చేస్తూ వచ్చింది..? పార్టీ ఖర్చులన్నీ సరిచూసే అభిషేక్‌కూ పార్థ ఛటర్జీకి ఎక్కడైనా బెడిసికొట్టిందా..? అందుకే ఈడీ రంగప్రవేశం చేసిందా..? కాగల కార్యం బీజేపీ చేసిందిలే అంటూ టీఎంసీ పార్థను గాలికి వదిలేసిందా..? రకరకాల వార్తల నడుమ మీడియాను బలంగా ఆకర్షించింది అర్పిత ముఖర్జీ అనే నటి… ఆమె ఇంట్లోనే మొన్న 21 కోట్ల నగదు దొరికింది…
‘‘అవును, నా ఇంటిని మినీ బ్యాంకులా వాడుకునేవాడు మంత్రి… ఓ గదిలో డబ్బు దాచేవాళ్లు… పది రోజులకోసారి మంత్రి, మరో మహిళ వచ్చి లెక్కలు చూసుకునేవాళ్లు… పార్థ స్వయంగా డబ్బు తెచ్చేవాడు కాదు, తన అసిస్టెంట్లే తెచ్చేవాళ్లు… అందులో ఎంత డబ్బు ఉండేదో, నాకు ఆ గదిలోకి ప్రవేశం లేదు… నిజానికి పార్థను నాకు మరో బెంగాలీ నటి పరిచయం చేసింది… అని ఈడీ వర్గాలకు వెల్లడించిందట… ఇప్పుడు మీడియా ఎదుట మళ్లీ సందేహాలు… ఆల్‌రెడీ అయ్యవారికి బాగా సంబంధమున్న మోనాలిస దాస్ అనే ప్రొఫెసర్ కథ ఈడీకి తెలుసు… మీడియాకు తెలుసు… 12 ఫ్లాట్లు, ఆ కథ వేరే ఉంది… వాటి సెర్చింగు జరగలేదు…
Ads
ఇప్పుడు తాజాగా అర్పిత ఈడీకి చెబుతున్న మాటల ప్రకారం… అర్పితకు పార్థను లింక్ చేసిన సదరు బెంగాలీ నటి ఎవరు..? ఆమెకూ పార్థకూ నడుమ ఉన్న లింక్స్ ఎలాంటివి..? తనతోపాటు అర్పిత ఇంటికి తరచూ వచ్చే మహిళ ఎవరు..? ఈడీ తేల్చాల్సింది ఇదే… లేకపోతే మీడియా ఏదో ఒకటి తేల్చిపడేసేట్టు ఉంది… పార్థ సారు గురించి తవ్వేకొద్దీ ఇంకా ఎందరు మహిళల అడుగుజాడలు బయటపడతాయో చూడాలి… చూడబోతే అయ్యవారు మాంచి గ్రంథసాంగుడిలాగే ఉన్నాడు…
అసలు ఇది కాదు… హిందుస్థాన్ టైమ్స్ వార్తలో కొన్ని వాక్యాలు ఇంట్రస్టింగుగా అనిపించాయి… ఈ అర్పితకు కూడా మోనాలిసాకు ఉన్నట్టే చాలా ఫ్లాట్లు కొని ఇచ్చినట్టున్నాడు అయ్యవారు… (అదేదో మహేశ్ బాబు సినిమాలో ‘‘టైల్స్ వేస్తున్నారటగా’’ అనే డైలాగ్ గుర్తొచ్చిందా..?) బెల్గారియాలో ఆమెకు ఓ ఫ్లాట్ ఉంది… ఇప్పుడు దాన్ని సెర్చ్ చేయాలి… దాందేముంది..? చేసేస్తే సరి అంటారా..? దాని తాళాల్లేవు… ఓ లాక్ స్మిత్ కోసం… అనగా తాళాలు తీయగల వ్యక్తి కోసం ఈడీ టీమ్ అన్వేషిస్తోందట ఆ పరిసరాల్లో… ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో తాళాలబ్బాయ్ కోసం వేచి ఉందట టీమ్… మరో టీమ్ కస్బాలో ఉన్న మరో ఫ్లాటులో ఆల్‌రెడీ సెర్చింగ్ స్టార్ట్ చేసిందట… (తాజా సమాచారం మేరకు కౌంటింగ్ మెషిన్లు తెచ్చారట ఇప్పుడు, 3 కిలోల బంగారం, మరో 20 కోట్లు దొరికాయట… ఈ అప్ డేట్ రాసే సమయానికి, 27.07.2022 రాత్రి పదకొండు గంటల వరకూ ఇంకా లెక్కిస్తూనే ఉన్నారు…)
ఇదంతా సరే… అయ్యవారికి ఎందరు మహిళలున్నారు, ఏయే స్కాములున్నాయి, పార్టీకి ఎంత ఇచ్చేవాడు, అభిషేక్‌తో ఎక్కడ బెడిసింది, పీకే టీమ్‌తో గోక్కున్నాడా వంటి ప్రశ్నలు ఎలా ఉన్నా…. ఇళ్లల్లో సెర్చింగులకు వెళ్తూ అసలు ఓ తాళాల సెట్ తీసుకుపోకపోతే ఎలా..? ఇది చాలాసేపటి నుంచి వేధిస్తున్న ప్రశ్న… రకరకాల తాళాలను చిటికెలో తీయగల ఓ సెట్ ఎప్పుడూ సెర్చింగు టీమ్ వెంట ఉండాలి కదా… ఛ ఛ, వీసమెత్తు ప్రొఫెషనలిజం లేదు… ఎలాగండీ మోడీజీ… ఇంకాస్త పదును పెట్టాలి…!! కనీసం పాత తెలుగు డిటెక్టివ్ నవలలు చదివించండి…!!
Share this Article