అబ్బే, అంతా కన్నడ మొహాలు… మన తెలుగువాళ్లు మెచ్చుతారా అని ఈసడించాడు ఓ మిత్రుడు విక్రాంత్ రోణ సినిమా గురించి… కానీ తప్పు… అదే కన్నడం హీరో యశ్ కేజీఎఫ్‌కన్నా ముందు ఎవరికి తెలుసు..? సినిమా రెండు పార్టుల్లోనూ టెక్నిషియన్స్, యాక్టర్స్ కూడా కన్నడిగులే కదా… తెలుగు ప్రేక్షకుడు ఆమోదించలేదా..? మొన్నటికిమొన్న చార్లి 777 హీరో రక్షిత్‌ను కూడా ఆదరించారు కదా…
అంతెందుకు..? తమిళ, మలయాళ వాసనలు ఎంత గుప్పుముంటున్నా సరే… ఆ సినిమాలను, ఆ హీరోలను మన హీరోలుగానే ఆరాధిస్తున్నాం కదా… పైగా రోణ సినిమాలో హీరో సుదీప… మనకు పరిచయమే… రాజమౌళి ఈగ సినిమాలో విలన్… కాదు, ప్రధాన పాత్ర తనదే… హీరో, విలన్ రెండూ తనే… సైరా, బాహుబలిలో కూడా చిన్న పాత్ర ఏదో చేసినట్టున్నాడు… నిజానికి కిచ్చా సుదీప అంటే అంతే… నాకు ఇలాంటి పాత్రే కావాలనే పట్టు ఏమీ ఉండదు…
నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, టీవీ ప్రజెంటర్, గాయకుడు… వాట్ నాట్..? బహుముఖ ప్రజ్ఞ తనది… మంచి పాత్ర పడాలే గానీ ఎలా విజృంభిస్తాడో ఈగలో చూశాం కదా… కన్నడంలో పాపులరే… అయితే రోణను డిఫరెంటుగా చూడాలి… ఈమధ్య అందరూ వివిధ భాషల్లో డబ్ చేసి, పాన్ ఇండియా ముద్ర వేసి, కథలు పడుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు… మనం ఎందుకు చేయకూడదు అనే ఆలోచన నుంచి పుట్టిన సినిమా ఇది…
Ads
ఫుల్ టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్, అందరికీ ఎక్కే కథ అయితే సరి అనుకున్నట్టున్నారు… ఓ చందమామ కథను తీసుకుని, దానికి కాస్త హారర్, కాస్త సస్పెన్స్, కాస్త క్రైమ్, కాస్త థ్రిల్, కాస్త మసాలా గట్రా కలిపేసి, రుబ్బేసి, వండేసి వదిలారు… ఏ ప్రాంతం వాళ్లకైనా ఈ ఎలిమెంట్స్ ఒకేలా కనెక్ట్ అవుతాయి కదా… కథను బట్టి గ్రాఫిక్స్ వాడారు… త్రీడీలో తీశారు… నిజానికి పాన్ ఇండియా అంటే సినిమా ఇలా ఉండాలనే ఫార్ములా ఏమీ ఉండదు… ఇన్ని హంగులు అవసరం లేదు…
హీరోకు వంకపెట్టేదేమీ ఉండదు… మంచి విగ్రహం, నటనలో మెరిట్… కానీ అదొక్కటీ చాలా..? పలుచోట్ల సినిమా చూస్తుంటే… జస్ట్, కోటిన్నర ఖర్చుతో 2015లో రంగి తరంగ అనే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అనూప్ భండారీ తీసిని సినిమాయేనా ఇది అనిపిస్తుంది… బేసిక్ కథ వోకే, టెక్నికల్‌గా వోకే… కానీ గ్రిప్పింగ్ కథనం లేదు… ఉదాహరణకు ఓ స్మగ్లింగ్ వ్యవహారం, ఊరిపెద్ద కొడుకు లవ్ ట్రాక్ ప్రేక్షకుడిని కావాలనే కన్‌ప్యూజ్ చేయడానికి అన్నట్టున్నాయి… కానీ బ్రీఫ్‌గా ఉంటే సరిపోయేది, లెంత్ ఎక్కువై బోరింగ్ అయిపోయాయి…
బ్రహ్మరాక్షసుడు, పాడుబడిన బావి, శవాలు గట్రా ప్రేక్షకుడికి కథ మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేయడానికే కానీ అంతగా ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేదు అవి… అయితే ఎక్కువ షాట్లు ఇన్‌డోర్‌లో తీసినవే అంటే నమ్మడం కష్టం… బాగా తీశారు కొన్ని సీన్లు… పాత రోజుల్లోకి తీసుకుపోయినప్పుడు నటీనటుల డ్రెస్సులు గట్రా ఆ కాలానికి తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి కదా… అదీ చూసుకోలేకపోయారు… ప్చ్…
అలాగే క్లైమాక్స్ కూడా సగటు ప్రేక్షకుడికి నచ్చకపోవచ్చు… కేవలం సుదీప, జాక్వెలిన్ మసాలా సాంగ్ మాత్రమే సినిమాను ఆదుకోవు కదా… మేం ఏ సినిమా ఫీల్డుకన్నా తక్కువ కాదు అని చెప్పేలా కన్నడ ఇండస్ట్రీ బాగా పుంజుకుంది… గతంలో మరీ నాసిరకం సినిమాలు వచ్చేవి… డబ్బింగ్ సినిమాలకు చాన్స్ ఇచ్చేవాళ్లు కాదు… చుట్టూ గిరిగీసుకుని బతికిన ఇండస్ట్రీ… ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్‌లోకి వచ్చి, మిగతా లాంగ్వేజీ ఇండస్ట్రీలకు సవాళ్లు విసురుతోంది… ఈ సినిమా కూడా టెక్నికల్‌గా అంతే… అయితే కొన్ని లోపాలు ముందే చూసుకుని, దిద్దుకుని, కాస్త గ్రిప్పింగ్‌గా కథనం మార్చుకుని ఉంటే సినిమా మరో రేంజులో ఉండేది..!!
Share this Article