Nagaraju Munnuru…………….. ఈ విషయం చెప్పడానికి ఇది సరిఅయిన సందర్భమో కాదో తెలియదు కానీ చెబితే నలుగురికి ఉపయోగపడుతుందని చెబుతున్నా… పెళ్ళిళ్ళలో సాధారణంగా బంధుమిత్రులు కట్నాలు చదివించడం చూస్తుంటాం.. తెలంగాణలో ఇలాంటి దృశ్యం సాధారణం… పట్టణాల్లో, హైటెక్ పెళ్ళిళ్ళలో గిఫ్టులు స్టేజి మీదే వధూవరులకు అందజేస్తున్నారు, కానీ పల్లెల్లో ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు కులపెద్దలు ఒక నోటు బుక్కు పెట్టుకుని బంధుమిత్రులు ఇచ్చే నగదును వారి ఇంటి పేర్లతో సహా రాసి, ఆ కుటుంబ సభ్యులకు అందజేస్తారు… ఇందులో మగ పెళ్లి వారు, ఆడ పెళ్లి వారు వేర్వేరుగా కట్నకానుకలు తీసుకుంటారు.. ఇలా నగదు ఇవ్వడం పెళ్లి కుటుంబానికి ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది…
సరిగ్గా అలాంటి దృశ్యం ఈరోజు మా మిత్రుడు తండ్రి చనిపోయిన చోట చూశాను.. మృతుడి కులస్థులు ప్రతి ఇంటి వారు కనీసం వంద రూపాయలు అంత్యక్రియ ఖర్చుల కోసం వారి పేర్లతో సహా రాయించి డబ్బులు ఇవ్వడం జరిగింది… స్థోమత ఉన్నవారు వంద రూపాయల కన్నా ఎక్కువ కూడా ఇవ్వవచ్చు.. కేవలం కులస్తులే కాకుండా ఎవ్వరైనా ఇవ్వవచ్చు…
Ads
ఇలాంటి దుఖ సమయంలో ఖర్చుల కోసం డబ్బులు జమచేసి ఇవ్వాలనే ఆలోచన ఒక గొప్ప సాంఘిక సంస్కరణగా భావిస్తున్నాను… సంతోషంలో ఉన్నప్పటి కన్నా బాధలో ఉన్నప్పుడు ఒకరిని ఒకరు ఆదు కోవడం ముఖ్యం. ఇలా చేయడం అంటే మానవుడి సాంఘిక జీవనంలో ఒకరికి ఒకరు అండగా నిలబడి సమాజంలో మనం ఒంటరివారం కాము అని చాటి చెప్పినట్లే…
ఇంట్లో మనిషి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేకుండా ఇబ్బందులు పడిన కుటుంబాలను చూశాను.. డబ్బులు, ఆస్తులు ఉన్నవారిని మినహాయిస్తే పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు అంత్యక్రియలు కూడా భారంగా మారిన పరిస్థితుల్లో ఇలాంటి ఆచరణీయమైన వాటిని ఇతరులు కూడా అమలు చేయవచ్చు.. ఎవరి పరిస్థితి ఏమిటో తెలియని పరిస్థితుల్లో అడగకుండానే మనకు తోచిన రీతిలో సహాయం చేయడం సాంఘిక జీవనానికి ముఖ్యం అని భావిస్తున్నాను..
Share this Article