ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే ముందుగా 1100 పైచిలుకు కక్కాల్సిందే… సరిగ్గా 45 రూపాయల్ని మనకు సబ్సిడీ ముష్టిని బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది… ఇదంతా బాగోతం దేనికి..? ఆ ముష్టి ఏదో లెక్కచూసి, గ్యాస్ కంపెనీలకే ఇస్తే సరిపోతుంది కదా… జనం దగ్గర వసూలు చేయడం దేనికి..? జనం ఖాతాల్లో సబ్సిడీ వేయడం దేనికి..? పోనీ, ఆ 45 కూడా రద్దు చేసేస్తే సరిపోయేది కదా..? ఈ ప్రశ్నకు ఎవరి దగ్గరా జవాబు ఉండదు… డీబీటీ… అనగా నేరుగా ప్రజలకే లబ్ధి… నగదు బదిలీ…
ఇది రాబోయే కాలంలో చాలా విపరిణామాలకు దారితీయబోతోంది… అది కుర్చీపై ఉన్నవాడికి అర్థం కాదు… అసలు ఇలాంటి అర్థం చేసుకోవాల్సిన ప్రాధాన్య అంశాలు కానేకావు వాళ్లకు… ఎవరో ఆర్థికనిపుణుడో, ఐఏఎస్సో, ప్రణాళికవేత్తో రచిస్తాడు… వీళ్లు గుడ్డిగా అమలు చేస్తారు… రాను రాను రేషన్ బియ్యానికి, సరుకులకు… రైతుల ఎరువులకు… కరెంటు బిల్లులకు… అన్నింటికీ ఇదే కథ… గ్యాస్ ధరల అనుభవాలు, ఫలితాలు చూస్తుంటే ఈ పద్ధతి సంక్షేమానికి పూర్తి విరుద్ధమైన దిశలో ఉండనుందా..? ఇది చాలా డీప్ సబ్జెక్టు… పార్టీలు, పాత్రికేయం కాదు, ఈ రంగంలో కాస్త నాలెడ్జ్ ఉన్నవాళ్లు మాట్లాడితే బాగుండు…
నవతెలంగాణ ఓ చిన్న పత్రిక… మార్క్సిస్టు పత్రిక… దాని రీచ్ చాలా పరిమితం… ఐనాసరే, ఓ మంచివార్తను పట్టుకుంది… ఆ వార్త ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంది… సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు చెప్పిన వివరాలనే ఆధారం చేసుకుంది… ఓ బ్యానర్ స్టోరీ కొట్టింది… నచ్చింది… ఇంకాస్త పంచ్ ఉండేలా రాయవచ్చు, కానీ ఎట్‌లీస్ట్ సమస్యను గుర్తించి, ఆ ప్రయారిటీ ఇచ్చిన ప్రొఫెషనల్ జడ్జిమెంట్ కరెక్టు…
Ads
మోడీ ప్రభుత్వం సంక్షేమం ఎలా ఉంటుందంటే… గతంలో వృద్ధులకు రైళ్లలో ఇచ్చే సబ్సిడీని తీసిపారేసింది… ప్రజల్లో బాగా విమర్శలొచ్చేసరికి 70 ఏళ్లు దాటినవారికే సబ్సిడీ అని మాటమార్చింది… అంటే పేరుకు సబ్సిడీ కొనసాగుతూ ఉంటుంది… కానీ ఎంతమందికి అనే ప్రశ్న ఎవరూ వేయకూడదు… సేమ్, గ్యాస్ రీఫిల్ ధరలపై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది… కానీ ఉజ్వల్ యోజన కింద తీసుకునే రీఫిళ్లకు మాత్రమే వందో, రెండొందలో ధరలో తగ్గుదల అని ప్రకటించింది…
వాటి సంఖ్య చాలా చాలా పరిమితం… అంతేకాదు, ఉజ్జల్ కింద తీసుకున్నవాళ్లు అసలు ఈమాత్రం రీఫిల్ ధరే భరించే స్థితిలో లేరు… ఆ దురవస్థ ఢిల్లీ పాలకుడికి అర్థం కాదు… రామేశ్వర్ తేలి మనకు పెట్రోల్, గ్యాస్ సహాయమంత్రి… తను చెప్పిన లెక్క ప్రకారమే 2022 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల మంది అసలు ఒక్క రీఫిల్ కూడా కొనలేదు… అంతెందుకు..? 2021-22 సంవత్సరంలో కోటిన్నర మంది ఉజ్వల వినియోగదారులు ఒకే ఒక రీఫిల్ చొప్పున తీసుకున్నారు… అంటే ఏడాది మొత్తానికీ ఒకే రీఫిల్…
ఈ అంకెల్ని వదిలేస్తే… అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్యాస్ కనెక్షన్ల స్కీమ్ ఉద్దేశం ఏమిటి..? గ్రామీణ మహిళలు కట్టెలతో, ఇతర ఇంధనాలతో అవస్థలు పడకూడదని… ఊపిరితిత్తుల వ్యాధులకు గురికావొద్దని…. తీరా ఆచరణ, అమలు తీరు చూస్తే ఇదీ అసలు చిత్రం… పెరిగిన రీఫిల్ ధరలతో మళ్లీ అవే కట్టెలు, అవే పిడకలు, అదే ఊక… అదే ఖళ్ ఖళ్ దగ్గు…! పాలకుడికి మస్తు మెదడుంది… మంచిదే… కానీ కాసింత గుండెతడి కూడా అవసరం…!! ((పెద్ద పెద్ద పేపర్లు, వాటి పే-ద్ద బుర్రల బాధ్యులూ… ఇలాంటివి మీకెందుకు కనిపించవు… పిచ్చి పిచ్చి రాజకీయ రాద్ధాంతాలు, దాడులు, సమర్థనలు…))
Share this Article