48 గంటల్లో ఇల్లు కట్టి చూపిస్తా!
————————
యంత్రం మాయలో పడిన తరువాత మనిషి కూడా యంత్రంలా మారిపోతాడని వందేళ్ల క్రితమే- మోడరన్ టైమ్స్ సినిమాలో చార్లీ చాప్లిన్ నిరూపించాడు. మనిషి నోట్లో అన్నం పెట్టి, మూతి తుడిచే మిషన్ను చాప్లిన్ ఎగతాళిగా ఆనాడే ఆవిష్కరించాడు. యంత్రభూతాల పళ్ల చక్రాల మధ్య చిక్కుకుని మనిషి కూడా జీవంలేని నట్టులో నట్టుగా, బోల్టులో బోల్టుగా మీట నొక్కితే కదిలి, మళ్లీ మీట నొక్కగానే ఆగిపోయే మరబొమ్మగా ఎలా మారిపోయాడో అప్పటికే చాప్లిన్ కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. భవిష్యత్తు ఎలా యంత్రమయం కాబోతోందో స్పష్టంగా ఊహించి చెప్పాడు. కేకు ముక్క నోట్లో పెట్టి, ఆపై నోటిని స్పాంజ్ తో శుభ్రం చేసే యంత్రం స్పీడ్ పెంచి మనిషి పళ్లను ఊడగొట్టి, మొహం పగలగొడుతుంది. యంత్రాలన్నీ చివరికి మన మొహం పగలగొట్టి, నోటి పళ్లు చేతిలో పెడతాయన్నది మూగ సినిమాలో చాప్లిన్ చెప్పకనే చెప్పిన విషయం.
చాప్లిన్ చెప్పినట్లు-ఇప్పుడు అది ఇది ఏమని? అన్నిట్లో యంత్రాలే. యంత్రాల్లేని ప్రపంచం అంతా శూన్యంగా తోస్తుంది. మనిషినయినా పక్కన పెట్టవచ్చు కానీ- యంత్రాలను పక్కన పెట్టడానికి వీల్లేదు.
Ads
ఇళ్లు కట్టడం ఎన్నో యుగాలుగా మనుషులు చేసే పని. సిమెంటు, ఇసుక, ఇటుకలు, కాంక్రీటు కలిపే మోసే యంత్రాలు వచ్చాయి కానీ- పిల్లర్ నిలబెట్టాల్సింది, గోడ కట్టాల్సింది, ప్లాస్టరింగ్ చేయాల్సింది, క్యూరింగ్ నీటిని చల్లాల్సింది మాత్రం మనుషులే.
ఇల్లు కట్టి చూడు- అని ఒక పెద్ద జీవితకాల పనిగా చెప్పుకుంటున్నాం. స్థలం కొని, చదును చేసి, ముగ్గుపోసి పునాదులు తవ్వి, స్తంభాలు పోసి, స్లాబులు వేసి, క్యూరింగ్ చేసి చేసి, నెమ్మదిగా ఇటుక ఇటుక పేర్చి గోడలు లేపి, ద్వారాలు నిలిపి, తలుపులు బిగించి, ప్లాస్టరింగ్ చేసి, లప్పం పూసి, సున్నాలు కొట్టేసరికి… ఇల్లు కట్టకపోయి ఉంటే ప్రాణానికి హాయిగా ఉండేది కదా అని ఎవరికయినా అనిపిస్తుంది. అనిపించాలి కూడా.
తాపీ మేస్త్రి వచ్చినరోజు ఇటుకలు అందించే కూలీ శ్రీకాకుళంలో పెళ్లికి వెళ్లాల్సి ఉంటుంది. ఇటుకలు అందించడానికి కూలీ వస్తే- తాపీ మేస్త్రి మహబుబాబ్ నగర్ లో రైతు బంధు డబ్బు తీసుకోవడానికి వెళ్లాల్సి ఉంటుంది. క్యూరింగ్ కూలి వచ్చిన రోజు నీళ్ల ట్యాంకరు వాడి లారీ టైర్ పంక్చర్ అయి కదల్లేని పరిస్థితి. ఇలా ఇల్లు కట్టడం దానికదిగా ఒక మహా యజ్ఞం. ఒక మహా యుద్ధం. అవుతున్నట్లే ఉంటుంది- ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. వచ్చే శ్రావణ మాసం పంచమి శుక్రవారం తెల్లవారుజామున గృహప్రవేశానికి ముహూర్తం అని అనుకుంటాం. ఆ ముహూర్తం మూడు నాలుగేళ్లు అటు ఇటుగా ఎప్పుడయినా రావచ్చు. లేదా ఇంకా ఆలస్యమై చివరికి విధిలేని పరిస్థితుల్లో అత్యవసరంగా అయిష్టంగా శూన్యమాసం ఆదివారం అమావాస్య అర్ధరాత్రి గృహప్రవేశం చేయాల్సి రావచ్చు.
ఇకపై ఇల్లు కట్టడంలో ఇలాంటి కష్టాలు ఉండబోవు. ఆటోమేటిక్ త్రీడి మేస్త్రి టెక్నాలజీ వచ్చేసింది. ఆ యంత్రానికి డిజైన్ ఫీడ్ చేసి, యంత్రంలో సున్నం, కంకర, సిమెంటు, ఇసుక, నీళ్లు, మన్ను మశానం అన్నీ పోసి పక్కకొచ్చి నిలుచుని బటన్ ఆన్ చేస్తే చాలు. నలభై ఎనిమిది గంటల్లో ఇల్లు కట్టి ఇచ్చేస్తుంది. పునాది అదే తీస్తుంది. గోడలు అదే కడుతుంది. స్లాబులు అదే వేస్తుంది. చివరికి అంతా అయ్యాక మనల్ను ఇంట్లోకి అదే తోసేసి…ఇంకో ఇల్లు కట్టడానికి వెళ్లిపోతుంది.
పల్లె కన్నీరు పెడుతుందో! పాటలో టాటా ట్రాక్టరు టక్కరిస్తే ఎడ్ల బండి ఎగిరిపడింది అని గోరటి వెంకన్న బాధపడ్డాడు. ఇళ్లు కట్టే యంత్రమొచ్చి- ఎగిరి వీధిన పడే తాపీ మేస్త్రీలు, ఇంటి నిర్మాణాన్ని నమ్ముకున్న కోట్ల మంది కార్మికులు ఏమవుతారో? అని ఈమధ్యే ఎంఎల్సి అయిన గోరటి వెంకన్న రాస్తే ఏమి రాస్తాడో? రాసి ఎలా పాడతాడో?
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article