రెండు మూడు నెలల్లో తేల్చిపారేయాలి… మునుగోడు ఉపఎన్నిక ద్వారా మళ్లీ కేసీయార్‌ను పరుగులు పెట్టించాలి… అని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట… అందుకే రాజగోపాలరెడ్డిపై ఒత్తిడి తెచ్చి అర్జెంటుగా రాజీనామా చేయించిందట… పలు వార్తావిశ్లేషణల్లో కనిపిస్తున్న అంశమిది… మరోవైపు అంతే అర్జెంటుగా కాంగ్రెస్ ఈ ఉపఎన్నిక కోసం ఓ కమిటీని వేసింది… పోరుకు రెడీ అయిపోతోంది… ఆల్‌రెడీ కొన్ని పెండింగ్ ఇష్యూస్ క్లియర్ చేయడం ద్వారా టీఆర్ఎస్ కూడా రెడీ అయిపోతున్నట్టుంది… అయితే…
హుజూరాబాద్‌లో బలహీన అభ్యర్థిని పెట్టడం రేవంత్ తప్పు అనే విమర్శలు సొంత పార్టీ నుంచే బోలెడు వచ్చాయి… డబ్బు ఆరోపణలు కూడా చేశారు… కేసీయార్‌ను నేలమీదకు దింపడానికి ఈటలకు పరోక్షంగా సాయపడితే మంచిదే అనే రేవంత్ ప్రణాళిక, ఆలోచన ఎదురుతన్నింది… ఈసారి ఇక హైకమాండ్ అర్జెంటుగా ఓ కమిటీని వేసి, రేవంత్ తన స్వీయ విచక్షణతో ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అడ్డుకుందని భావించాలా..?
కాంగ్రెస్ సరే, బీజేపీ నిజంగానే ఉపఎన్నికకు సిద్ధంగా ఉందా..? అదే పెద్ద ప్రశ్న… ఉపఎన్నిక వస్తే బీజేపీకి నష్టమేమీ లేదు… రాజగోపాలరెడ్డి మళ్లీ గెలిస్తే ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ చేదు అనుభవాలతో ఉన్న కేసీయార్‌ను ఇంకాస్త డిమోరల్ చేయడానికి వీలుంటుంది… బీజేపీ ఆత్మస్థయిర్యం పెరుగుతుంది… దక్షిణ తెలంగాణలో పాగా వేస్తుంది… ఒకవేళ ఓడిపోయినా తనకు నష్టమేమీ లేదు… రాజగోపాలరెడ్డికి వ్యక్తిగతంగా నష్టమే తప్ప… ఒక పార్టీగా బీజేపీకి పోయేదేమీ లేదు…
Ads
దక్షిణ తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి పెద్ద బలమేమీ లేదు… అక్కడక్కడా ఉనికి తప్ప… ఉపఎన్నికలో ఓడిపోయినా సరే రాష్ట్రమంతా మళ్లీ కేసీయార్ పాలనను చర్చకు తీసుకొస్తుంది… కేసీయార్‌ను పరుగులు పెట్టిస్తుంది… హుజూరాబాద్‌లో కేసీయార్ వేసినన్ని ఆసనాలు ఏ ఎన్నికలోనూ వేయలేదు… ఆ ఉపఎన్నిక పెట్టిన విషమపరీక్షలో అంతిమంగా బోల్తాకొట్టాడు… సేమ్, మునుగోడులోనూ అదే ప్రయాస, అదే ఖర్చు, అదే పరుగు… టీఆర్ఎస్ ఓడిపోతే చాలా నష్టం… ఒకవైపు ముందస్తు వైపు కన్నేసిన స్థితిలో ఇది ఓడిపోతే కేడర్ నైతిక స్థయిర్యాన్ని దెబ్బకొడుతుంది…
సో, బీజేపీ, కాంగ్రెస్ ఎంత తొందరపడినా కేసీయార్ తొందరపడాల్సిన పనిలేదు… హుజూరాబాద్ తాలూకు పథకాలు, పన్నాగాలు, ప్రలోభాలు, అత్యంత భారీ ఖర్చులు, వోట్ల కొనుగోళ్లు అవసరం లేదు… నిజంగా కేసీయార్ పనితీరు పట్ల జనంలో విశ్వాసం, ప్రేమ ఉండి ఉంటే… ఇంత ఖర్చు పెట్టీ, ఇంత చెమటలు కక్కీ ఎందుకు ఓడిపోయాడు అనే నిందను ఇప్పటికే భరిస్తున్నాడు… మళ్లీ మునుగోడు పరీక్ష అవసరం లేదు… ఒకవేళ గెలిచే చాన్సున్నా సరే… బీజేపీ ట్రాప్‌లోకి వెళ్లి పడాల్సిన స్థితీ అవసరం లేదు…
సింపుల్… రాజగోపాలరెడ్డి రాజీనామా చేశాడు… కాంగ్రెస్ పార్టీకి చేశాడు… అది ఆ పార్టీ అంతర్గతం… బీజేపీలో చేరతాడు… అది తనిష్టం… తనకూ కొన్ని లెక్కలుంటాయి కదా… కానీ అసెంబ్లీ స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదిస్తేనే కదా ఉపఎన్నిక వచ్చేది… బీజేపీ ఎంత ఉరుకులాడినా స్పీకర్ గనుక రాజీనామా పత్రాన్ని క్లియర్ చేయకుండా ఉంటే… ఎవరూ చేయగలిగేది ఏమీ లేదు… సో, నిర్ణయం మళ్లీ కేసీయార్ చేతుల్లోనే ఉంది… బీజేపీ ట్రాప్‌లో పడతాడా..? సైలెంట్‌గా ఉండిపోతాడా..? సైలెంటుగా ఉండిపోతే ఇక్కడ ఓ విమర్శ తప్పదు… పోటీకి వెనకాడుతున్నాడు, హుజూరాబాద్‌లో ఎందుకు రాజీనామా, రాజీనామా అంటూ ఈటల వెంటపడ్డారు, మునుగోడులో మౌనం దేనికి అనే ప్రశ్న ఎదురవుతుంది…
చివరగా :: ఒకవేళ కేసీయార్ బీజేపీ సవాల్‌కు సమాధానం చెప్పాలని భావిస్తే… ఉపఎన్నికకు సై అని తొడగొడితే… ఎప్పటిలాగే హరీష్‌రావుకు గాకుండా ఈసారి కేటీయార్‌కు బాధ్యతలు అప్పగించడం బెటర్… హరీష్ దుబ్బాకలో ఫెయిల్… హుజూరాబాద్‌లో ఫెయిల్… సో, కాబోయే ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్‌కు కాబోయే అధినేతగా కేటీయార్ ఈ మునుగోడులో తన ఎన్నికల నిర్వహణ సామర్థ్యాన్ని, రాజకీయ వ్యూహరచన నైపుణ్యాన్ని, లాభనష్టాలు-బేరసారాలు- సంప్రదింపుల చాణక్యాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది…!!
Share this Article