మనకు తెలిసిందే కదా…. యునాని, ఆయుర్వేద, హోమియో, నేచురో డాక్టర్లు కూడా తమ ప్రాక్టీసులో భాగంగా అల్లోపతి, అనగా ఇంగ్లిష్ మందులు, అనగా మోడరన్ మెడిసన్ కాగితాలపై రాసేస్తుంటారు… ప్రాథమిక వైద్యం వరకూ వోకే, కానీ ఎడాపెడా రెండు చేతులతో అసలు సిసలు ఆల్లోపతి డాక్టర్లకన్నా ఎక్కువగా ప్రిస్క్రిప్షన్లు గీకేస్తుంటారు… దీనికి సంబంధించిన వార్త ఇది…
విషయం ఏమిటంటే..? సెంథిల్ కుమార్ అని తమిళనాడు, సేలంలోని ఓ హోమియోపతి ప్రాక్టీషనర్ పనమరత్తుపట్టిలో ఓ క్లినిక్ నడిపిస్తుంటాడు… బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఒకాయన రెయిడ్ చేశాడు, ఆ ప్రిస్క్రిప్షన్లు చూశాడు… హోమియో డాక్టర్‌వు కదా, నువ్వు మోడరన్ మెడిసిన్స్ ఎందుకు రాసిస్తున్నావు అనడిగాడు… సదరు సెంథిల్ నా పేషెంట్ రోగం తగ్గడానికి నేను ఏ మందైనా ప్రిక్క్రైబ్ చేస్తాను అన్నాడు… సదరు ఆఫీసర్ కుదరదు అన్నాడు… చట్టం అంగీకరించదు అన్నాడు…
కేసు పెట్టాడు… ఆయన అలా అన్నాడో లేదో పోలీసులు చకచకా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956, ఐపీసీ 420 ఎట్సెట్రా సెక్షన్లతో కేసు బనాయించి, నడువ్ లోపలకు అన్నారు… పోలీసులు కదా… ఫాఫం, వాళ్ల లాఠీలు, కోర్టు కాగితాలు మాత్రమే పనిచేస్తుంటాయి కదా ఎప్పుడూ… ఒక వైద్యవిధానంలో శాస్త్రం చదివి, వేరే వైద్యవిధానంలో ఏమైనా మందు రాస్తే నేరం అట దేశంలో… దేశవ్యాప్తంగా లక్షల మంది భారతీయ వైద్యవిధానంలో డాక్టర్లు ప్రాక్టీస్ పరంగా అల్లోపతినే ఆశ్రయిస్తున్నారు, అది వేరే సంగతి…
Ads
ఇలా ఒక వైద్యవిధానం నేర్చుకుని, ఇంకో వైద్య విధానంలో మందులు రాసిస్తే దాన్ని క్రాస్‌పతి అంటారట… సింపుల్‌గా చెప్పాలంటే… మీరు ఓ హోమియో డాక్టర్ దగ్గరకు వెళ్లారనుకొండి… జ్వరానికి డోలో వేసుకొండి, తలనొప్పి తగ్గడానికి జిందాతిలిస్మాత్ రాసుకొండి అని చెబితే… అది క్రాస్‌పతి… అది నేరమట… కొన్నాళ్లు తిప్పతీగ కషాయం తాగండి, ప్రాణాయామం చేయండి అన్నా సరే అదీ క్రాస్‌పతీయే… రోగుల్ని నిలువు దోపిడీ చేయాలంటే మేం చేయాలి, మీరెవర్రా అని ఏదో విధానంలోని డాక్టర్లు అడుగుతున్నట్టు అనిపిస్తుందా…? నో..,
ఆ కేసు మద్రాస్ హైకోర్టు దాకా వచ్చింది… మన దేశంలో హైకోర్టుల సంగతి తెలుసు కదా… మొన్నటి జూలై 22న ఓ తీర్పు వెలువరించింది… ఆయుర్వదం, యునాని, సిద్ధ, హోమియో వైద్యులు అల్లోపతి మందులు రాస్తే తప్పేమీ లేదు అంటూ పోలీసులు పెట్టిన కేసును కొట్టేసింది… పాపం, కోర్టు తప్పు కూడా ఏమీ లేదు… అప్పట్లో, అనగా 2010లో ఇదే తమిళనాడు ప్రభుత్వం ఓ ఆర్డర్ పాస్ చేసింది… దానిప్రకారం ఆయుర్వేద, యునాని, హోమియో, సిద్ధ విధానాల్లో సంస్థాగత శిక్షణ పొందిన డాక్టర్లు అల్లోపతిని కూడా ఉపయోగించవచ్చు… సో, కోర్టు అదే పేర్కొంది…
కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తమిళనాడు బ్రాండ్ అధ్యక్షుడు పళనిసామి అస్సలు ఒప్పుకోవడం లేదు… అవును, ఆ జీవో నిజమే, కానీ దానిపై స్టే తెచ్చాం, ఒక వైద్యవిధానంలో చికిత్స చేస్తూ, ఇంకో వైద్యవిధానంలోని మందులు వాడితే, దుష్పరిణామాలు వస్తే ఎవరు బాధ్యులు..? హైకోర్టు తీర్పుతో మేం బాగా అసంతృప్తి చెందాం… మేం మా శిక్షణలో డ్రగ్స్ (మెడికల్) రకాలు, ఉపయోగాలు, వాడకం మీద ఫార్మకాలజీ చదువుతాం… కానీ అల్లోపతీయేతర వైద్యులకు అవన్నీ ఏం తెలుసు..? అంటున్నాడు ఆయన…
నిజానికి మన డాక్టర్ చదువుల మీద ఓ దిశ, ఓ దశ దిక్కులేని కేంద్ర ప్రభుత్వం… సంస్కరణలు చేతకాని ప్రభుత్వం… ప్రజలకు చేరువగా శాస్త్రీయ వైద్యం అంటే ఏమిటో తెలియని కేంద్ర ప్రభుత్వం…. ఓ దిక్కుమాలిన ఆలోచన చేస్తోంది… మూడేళ్లుగా ఏ డాక్టరైనా సరే, ఏ మందులైనా రాయొచ్చు, ఏ ప్రాక్టీస్ అయినా చేయొచ్చు అంటోంది… అంతేతప్ప… అల్లోపతి, మోడరన్ మెడిసిన్ విద్యాసౌకర్యాలను, బహుముఖంగా ఇబ్బడిముబ్బడిగా పెంచాలనే ప్రజాసోయి లేదు ఈ ప్రభుత్వానికి… (అంటే మిగతా విషయాల్లో ఉందని కాదు…)
‘‘ఆయుష్ మంచిదైతే మీరు అవే మందులు రాయండి, ఎవరూ కాదనరు, కానీ అల్లోపతి జోలికి ఎందుకొస్తారు..?’’ అంటారు ఈ వైద్యులు… అరె, అల్లోపతి ఫార్మకాలజీ అనే సబ్జెక్టు మాకూ ఉంటుంది, మాకు ఏమీ తెలియదని బదనాం ఎందుకు చేస్తున్నారు అంటారు భారతీయ వైద్యవిధానాల డాక్టర్లు… కేంద్రానికి బుద్ధిలేనిది ఎందులోనయ్యా అంటే… వైద్యవిద్యను సరళీకృతం చేయలేకపోవడంలో…! అదీ అసలు రోగం… దానికి అల్లోపతి మందు లేదు… ఆయుష్ మందు లేదు…! ఢిల్లీ బ్యూరోక్రసీలోని డొల్ల బుర్రలు కనీసం వాటినైనా ఉపయోగిస్తే కదా…!!
Share this Article