పార్ధసారధి పోట్లూరి ………. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పేలోసీ [Nancy Pelosi ] ఆగస్ట్ 2 వ తేదీ మంగళవారం రాత్రి 10.45 నిముషాలకి తైవాన్ రాజధాని తైపే విమానాశ్రయంలో సురక్షితంగా లాండ్ అయ్యింది. 24 గంటలు కూడా గడవక ముందే ఈ రోజు సాయంత్రం 5.45 నిముషాలకి తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది!
గత రెండు వారాల నుండి అంతర్జాతీయ మీడియా తెగ హడావిడి చేస్తూ వచ్చింది. అదిగో చైనా నాన్సీ పేలోసీ విమానాన్ని కూల్చివేస్తుంది. దాంతో మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది అనే ఊహాగానాలకి అయితే కొదువ లేదు. అణు యుద్ధం రాదు కానీ చైనా తైవాన్ మీద దాడి చేస్తుంది, దానికి బదులుగా తైవాన్ కి మద్దతుగా జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలు రక్షణగా నిలుస్తాయి, దాంతో ఏ క్షణం అయినా మూడవ ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి అంటూ తెగ వూదరగొట్టాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు. కానీ అలాటిది ఏదీ జరగలేదు…
అమెరికాలో అధ్యక్షుడి తరవాత అతి పెద్ద హోదా కలిగిన చట్టసభల స్పీకర్ గా నాన్సీ పేలోసీ కి ప్రాధాన్యత ఉన్నది… ఇంటాబయట అయితే అలాంటి నాన్సీ పేలోసీ వివాదాస్పద పర్యటన విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు ఒక్క చైనా, రష్యాలకి తప్ప… అమెరికా గతంలో వన్ చైనా పాలసీకి మద్దతు తెలిపింది [చైనాతో పాటు తైవాన్ ని కూడా చైనాలో భాగంగా గుర్తించడం] అలాగే ఆ డిక్లరేషన్ మీద సంతకం కూడా పెట్టింది, కానీ అనధికారకంగా తైవాన్ తో నేరుగా సంబంధాలని కొనసాగిస్తున్నది. అలాంటిది తైవాన్ పర్యటన విషయంలో చైనాతో సంప్రదింపులు జరపకుండా నేరుగా తైవాన్ పర్యటనకి రావడమే చైనా కోపానికి కారణం…
Ads
గత 25 సంవత్సరాల కాలంలో అమెరికాకి చెందిన అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి తైవాన్ పర్యటనకి రావడం ఇదే మొదటిసారి. అయితే నాన్సీ పేలోసీ మాత్రం తైవాన్ చట్టసభ సభ్యులతో మాట్లాడుతూ తైవాన్ లో ప్రజాస్వామ్యం నెలకొల్పే విషయంలో అమెరికా తన వంతు మద్దతుని ఇస్తుంది అని వాగ్దానం చేసింది. అంటే కమ్యూనిస్ట్ చైనాకి వ్యతిరేకంగా తైవాన్ స్వతంత్రంగా ఉండడానికి కావాల్సిన సహాయం చేస్తుంది. ఇది ప్రత్యక్షంగా తమ సార్వభౌమత్వాన్ని సవాలు చేయడమేనని చైనా భావిస్తున్నది. యుద్ధ వాతావరణం నెలకొన్న మాట వాస్తవమే కానీ అది నేరుగా అమెరికాతో కాదు. అందుకే నాన్సీ పేలోసీ ప్రయాణిస్తున్న విమానం, దానికి రక్షణగా ఉన్న 5 ఫైటర్ జెట్ విమానాలని ఏమీ చేయలేదు చైనా… చేయదు…
ముందస్తు ఒప్పందం ?
నాన్సీ పేలోసీ ఎటూ మలేషియా రాజధానికి కౌలాలంపూర్ నుండి నేరుగా తైవాన్ రాజధానికి తైపీకి వెళ్తుంది అని చైనాకి తెలుసు. ఈ విషయం మీద ముందుగానే పెంటగాన్ తో రహస్య ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఒప్పందం ప్రకారం నాన్సీ పేలోసీ కౌలాలంపూర్ నుండి సాధారణ మార్గంలో కాకుండా, అంటే తైవాన్ జలసంధి ద్వారా కాకుండా చుట్టూ తిరిగి తైవాన్ ప్రాదేశిక జలాల మీదుగా తైపీ చేరుకోవాలని… కాకపోతే ఒక రోజు అంతా హైడ్రామా నడిపించారు. ఒప్పందం ప్రకారం నాన్సీ పేలోసీ ప్రయాణించిన విమానంతో పాటు రక్షణగా ఉన్న 5 జెట్ ఫైటర్స్ కూడా సౌత్ చైనా సముద్రం మీదుగా కాకుండా, అలాగే తైవాన్ జల సంధి మీదుగా కాకుండా, చుట్టూ తిరిగి తైపేలో దిగింది. ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏమిటంటే చైనాకి అమెరికా భయపడినట్లుగా బయటి ప్రపంచానికి తెలియాలి, అదే సమయంలో చైనా బెదిరించినా అమెరికా భయపడకుండా తైవాన్ పర్యటనని విజయవంతంగా పూర్తి చేసింది. ఇక్కడ ఎవరిదీ పై చేయి కాలేదు. కానీ డ్రామాని రక్తి కట్టించారు…
తైవాన్ దిగ్బంధనం !
ఈ రోజు సాయంత్రం నాన్సీ పేలోసీ తైవాన్ నుండి వెళ్లిపోగానే చైనా తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ వివరించింది. రేపు అనగా గురువారం రోజున తైవాన్ ద్వీపం చుట్టూ తన నౌకా దళాన్ని మోహరించి లైవ్ ఫైరింగ్ డ్రిల్ల్స్ నిర్వహించబోతున్నది చైనా! లైవ్ ఫైరింగ్ డ్రిల్ అంటే నిజమయిన మందుగుండు ఉపయోగిస్తూ, అంటే మిసైల్స్, రాకెట్స్, బుల్లెట్స్, బాంబులు లాంటి వాటితో డ్రిల్ నిర్వహిస్తానని చైనా ప్రకటించింది ! అంటే తైవాన్ నుండి ఇతర దేశాలకి ప్రయాణించే పౌర విమానాలకి ఈ డ్రిల్ ఆటంకం కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. చైనా ప్రకటనతో వెంటనే తైవాన్ అధికారులు తమ ప్రయాణీకుల విమానాలని దారి మళ్లించి నడపడానికి గాను జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నది.
మరోవైపు నాన్సీ పేలోసీ వెళ్ళిపోయిన గంట తరువాత అంటే ఈ రోజు సాయంత్రం 6.20 నిముషాలకి చైనాకి చెందిన 6 యుద్ధ విమానాలు తైవాన్ ఎయిర్ స్పేస్ లో చొరబడి కాసేపు చక్కర్లు కొట్టి వెళ్లిపోయాయి. అంటే తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ని పరీక్షించడం కోసమా ? లేక తైవాన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లని జామ్ చేసి వెళ్లాయా ? ఏ సంగతి ఇంకా తెలియరాలేదు.
తైవాన్ మీద చైనా ఆంక్షలు !
1. తైవాన్ మీద చైనా ఆంక్షలు విధించింది. తైవాన్ లో నిర్మాణ రంగానికి అవసరం అయిన ఇసుకకి తీవ్ర కొరత ఉంది. అయితే ఇన్నాళ్ళూ చైనా నుండి ఇసుకని దిగుమతి చేసుకుంటూ వచ్చింది తైవాన్… కానీ ఈ రోజు నుండి తైవాన్ కి ఇసుక ఎగుమతుల మీద నిషేధం విధించింది చైనా…
2. చైనా తైవాన్ నుండి నారింజ పండ్లు, దాని రసాలతో పాటు మరికొన్ని పండ్ల ఉత్పత్తులని దిగుమతి చేసుకుంటున్నది. కానీ ఇక వాటిని దిగుమతి చేసుకోకుండా నిషేధం విధించింది చైనా. తైవాన్ నుండి చేపలు దిగుమతి మీద కూడా నిషేధం విధించింది. తైవాన్ నుండి చైనా దిగుమతి చేసుకునే వాటిలో సీ ఫుడ్, కాఫీ, పాల ఉత్పత్తులు, బెవరేజెస్, వెనిగర్ ఉన్నాయి. వీటి మీద కూడా నిషేధం విధించింది చైనా.
3. తైవాన్ లో ప్రజాస్వామ్యం నెలకొల్పే పేరిట రెండు సంస్థలు చురుకుగా పనిచేస్తున్నాయి. [Taiwan Foundation for Democracy and Taiwan Foreign Ministry’s International Cooperation and Development Fund] తైవాన్ ఫౌండేషన్ ఫర్ డెమొక్రసీ అండ్ తైవాన్ ఫారిన్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఫండ్ మీద ఆంక్షలు విధించింది చైనా. ఈ సంస్థలకి సంబంధించి మెయిన్ లాండ్ చైనాలో ఉన్న అనుబంధ సంస్థలు, వ్యక్తుల మీద కూడా ఆంక్షలు విధించి బాంక్ ఖాతాలని ఫ్రీజ్ చేసింది.
వీటన్నిటితో పాటు తూర్పు మిలటరీ థియేటర్ కమాండ్ తన సైన్యాన్ని సౌత్ చైనా సముద్ర తీరానికి తరలించడం ఇప్పటికే మొదలుపెట్టిది చైనా. యాంఫిబియస్ నౌకలతో [సముద్ర తీరానికి సైనికులని తరలించే నౌకలు] యుద్ధ సామాగ్రిని తైవాన్ తీరానికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కొన్ని ఫోటోల ద్వారా బహిర్గతం అయ్యింది ఇప్పటికే.
తైవాన్ మీద దాడి చేసి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగానే చైనా ఇదంతా చేస్తున్నది. అయితే మన దేశ సరిహద్దుల దగ్గర చేసినట్లే చేస్తుందా లేక నిజంగా తైవాన్ మీద దాడి చేస్తుందా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఇంతకీ లదాఖ్ దగ్గర ఉన్న సైన్యాన్ని కూడా తైవాన్ వైపు తీసుకెళ్తుందా లేక అక్కడ ఉన్న సైన్యాన్ని అలానే ఉంచి మిగతా చోట్ల నుండి తైవాన్ తీరానికి తరలిస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిందే !
Share this Article