టాయిలెట్… పేరు వినగానే ఓమాదిరిగా అనిపిస్తుంది కదా… సహజం… ఇప్పుడంటే బాత్‌రూమ్స్ అంటే అవి కూడా కొందరికి లగ్జరీ రూమ్స్… పుస్తకాలు చదువుతూ, పేపర్లు తిరగేస్తూ, గంటల తరబడీ టబ్బులో పడుకుండిపోయి… సిగరెట్లు తాగుతూ, కొందరు మందు కూడా తాగుతూ… ఫోన్లు మాట్లాడుతూ, చాట్స్ చేస్తూ… సీక్రెట్స్ స్వీట్ నథింగ్స్ షేర్ చేసుకుంటూ…. అబ్బో… బాత్‌రూమ్స్‌లలో అత్యంత ప్రైవసీని ఎంజాయ్ చేస్తుంటారు కొందరు… అఫ్‌కోర్స్, ఆ వాతావరణమున్న డీలక్స్, కస్టమైజ్డ్ బాత్‌రూమ్స్ అయితేనే సుమా…
ఐనాసరే టాయిలెట్ సోప్ అనగానే… ఎహె, ఇదేం సోప్ అనిపిస్తుంది… టాయిలెట్ సబ్బుతో ఏం కడుక్కుంటారబ్బా అని సందేహమేస్తుంది… కానీ ఒకప్పుడు లక్స్ యాడ్స్‌లో కూడా కొట్టొచ్చినట్టు పెద్ద అక్షరాల్లో టాయిలెట్ సోప్ అని రాసేవాళ్లు… తెలుసు కదా… ప్రతి సినిమా నటిని లక్స్ యాడ్స్‌లో చూపించేవాళ్లు అప్పట్లో… ఎంత పెద్ద తార అయినా సరే, లక్స్ యాడ్ అంటే సరే అనాల్సిందే…
ఛీ, మరీ లక్స్ టాయిలెట్ సోప్ ఏమిటీ, మరీ హార్పిక్ సోప్ అన్నట్టుగా… అని మొహమంతా వెగటుగా పెట్టేయకండి… 1925లో… అంటే 97 ఏళ్ల క్రితం… యూనీలీవర్ లక్స్‌ను ప్రవేశపెట్టింది… ఇండియాలోకి ఏ సంవత్సరం తీసుకొచ్చిందో తెలియదు గానీ 1941 నాటి ఈ ఇండియన్ యాడ్ చూడండి… అప్పటి పాపులర్ బాలీవుడ్ నటి లీలా చిట్నీస్…
Ads
దిగువన టాయిలెట్ సోప్ అని క్లారిటీ… నిజానికి లక్స్ అంటే అప్పట్లో సినిమా తారలు, పెద్ద ధనికులు, అధికార్లు వాడే సబ్బు… మరి కాస్మెటిక్ సోప్ లేదా బ్యూటీ సోప్ అని పేర్లు పెట్టకుండా మరీ టాయిలెట్ సోప్ అని రాసుకోవడం ఏమిటి అనిపిస్తున్నదా..? నిజానికి లక్స్ అనేది అప్పట్లో టాయిలెట్ సోపే… ఇది అర్థం కావాలంటే ఈ స్నానపు సబ్బుల రకాలు తెలియాలి…
సాధారణంగా గతంలో మనం వాడిన మంచి మంచి బ్రాండెడ్ స్నానపు సబ్బులన్నీ టాయిలెట్ సోప్సే… వీటిల్లో కొవ్వు పదార్థ శాతం ఎక్కువ… అంటే టీఎఫ్ఎం… టోటల్ ఫ్యాటీ మ్యాటర్… ఇది ఎక్కువగా ఉంటే క్లీనింగ్, మాయిశ్చరైజింగ్ కెపాసిటీ ఎక్కువ… ఎటొచ్చీ టాయిలెట్ సోప్ అనే వర్గీకరణే ఇబ్బందికరం… రెండోరకం సబ్బులను బాతింగ్ బార్స్… లేదా బాతింగ్ సోప్స్… లేదా బ్యూటీ సోప్స్ అంటాం… నిజానికి వీటిల్లో టీఎఫ్ఎం తక్కువ… డెట్టాల్ ఉంది, నీమ్ ఆయిల్ ఉంది, ఇంకా ఏదేదో ఉంది అని చెప్పుకుని ఎక్కువ రేట్లతో అంటగడుతుంటారు…
వాస్తవానికి స్నానానికి ఎక్కువ టీఎఫ్ఎం ఉండే టాయిలెట్ సోప్సే కరెక్టు… అయితే డెట్టాల్, డోవ్, సావ్లాన్, సంతూర్, సింథాల్ ఫయమా, పార్క్ అవెన్యూ, పియర్స్, లిరిల్, మెడిమిక్స్, నివియా, హిమాలయ, లైఫ్‌బాయ్, గోద్రెజ్, పాండ్స్, పతంజలి, హమామ్… ఇవన్నీ ఇప్పుడు బాతింగ్ బార్సే… అంటే టాయిలెట్ సోప్స్ అన్నీ బ్యూటీ సోప్స్ అయిపోయాయి… ఇందులోనూ టీఎఫ్ఎం శాతాన్ని బట్టి గ్రేడ్- 1, 2, 3 ఉంటాయి…
అంతేకాదండోయ్… మెడిసినల్ సోప్స్, డిస్‌ఇన్‌ఫెక్టాంట్ సోప్స్, హెర్బల్ సోప్స్, ఆయుర్వేద సోప్స్, ఆర్గానిక్ సోప్స్ (అంటే నో కెమికల్స్), అలోవీరా సోప్స్, శాండల్ వుడ్ సోప్స్, టర్మరిక్ సోప్స్, గ్లిజరిన్ సోప్స్, హ్యాండ్ మేడ్ సోప్స్, అరోమా సోప్స్… చివరకు పెప్పర్‌మెంట్ సోప్స్… బొచ్చెడు రకాలు వచ్చేసినయ్ మార్కెట్‌లోకి…! ఎంత ధర ఎక్కువుంటే అంత నాణ్యత అని మనం భ్రమపడి కొనుక్కోవడమే… కానీ ఒక్కమాట… టీఎఫ్ఎం శాతం కనీసం 70- 75 శాతం ఉంటే అది హైగ్రేడ్ క్వాలిటీ… అర్థమైంది కదా..!! అలాంటివి ఏమున్నయ్ అంటారా..? ఎందుకు లేవు..? ఉదాహరణకు… మైసూర్ శాండ్ గోల్డ్‌లో 80 శాతం ఉంటుంది… సింథాల్ 79 శాతం… లక్స్ జస్ట్ 70 శాతం… ఇవన్నీ చదువుతుంటే సున్నిపిండి, ముల్లాన్ ముట్టి నయం అనిపిస్తోందా..? మీరు సూపర్…!!
Share this Article