ఖచ్చితంగా టీవీ ప్రేక్షకులంటే ఈటీవీ, మల్లెమాల సంస్థలకు చిన్నచూపు… వెక్కిరింపు… టీవీ సీరియళ్లు, సినిమాలు తీసే వాళ్లలో ఉండే ఓ రకమైన తేలికభావన… తాజాగా ఉదాహరణ చెప్పుకోవాలంటే… అదే జబర్దస్త్ షో… ఈమధ్య రేటింగులు తగ్గి, కమెడియన్లందరూ బూతులు తిడుతూ వెళ్లిపోతున్నారు కదా… ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఏం చేస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు…
అన్నీ బాగున్నప్పుడు… జబర్దస్త్ షోలో కాస్త పేరున్న, మెరిట్ ఉన్న కమెడియన్లు కనిపించేవాళ్లు… అక్కడ ముష్టి పెత్తనాలు, బాండెడ్ లేబర్… (బాండ్స్ రాసిచ్చి మరీ పనిచేయాలి, లేదంటే పది లక్షల జరిమానా అనే ఓ అడ్డమైన పద్ధతి ప్రపంచంలో బహుశా ఏ క్రియేటివ్ వర్క్ సంస్థలోనూ లేదేమో…) దాన్ని భరించలేక చాలామంది వెళ్లిపోయారు… ఇన్నాళ్లూ వచ్చేవాళ్లు వస్తున్నారు, పోతేపోనీలే అనుకుంది మల్లెమాల… జబర్దస్త్‌కు తోడు ఎక్సట్రా జబర్దస్త్ అని స్టార్ట్ చేసింది… శ్రీదేవి డ్రామా కంపెనీ మొదలుపెట్టింది… ఈటీవీ2లో జాతిరత్నాలు అని స్టాండప్ కామెడీ స్టార్ట్ చేసింది…
Ads
రష్మి, అనసూయ… జడ్జిలుగా నాగబాబు, రోజా… క్రమేపీ నాగబాబు పెత్తనం పెరిగింది… వెళ్లగొట్టారు… రోజా చేతుల్లోకి వచ్చింది… ఆమే వెళ్లిపోవాల్సి వచ్చింది… ఈలోపు చమ్మక్ చంద్ర, అదిరె అభి వంటి కమెడియన్లతోపాటు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా మానుకున్నారు… వాళ్ల నడుమ పోటీ మల్లెమాలకు డబ్బు కురిపించేది… చివరకు ఇప్పుడక్కడ ఎడారి కనిపిస్తోంది… ఈ ఫ్రస్ట్రేషన్‌కుతోడు బయటికి వెళ్లిన వాళ్లు లెఫ్ట్ రైట్ ఎక్కి దిగుతున్నారు…
క్రియేటివ్ డైరెక్టర్లు వెళ్లిపోయారు… ఈ సమయంలోనే కాస్త సంయమనం అవసరం… కానీ అదే కోల్పోయారు… స్థిరమైన జడ్జిలు లేరు… ఎవరొస్తున్నారో ఎవరు పోతున్నారో ఎవరికీ అంతుపట్టదు… అనసూయ కూడా జంప్… ఈ స్థితిలో కొత్త యాంకర్ అంటూ పల్లకీలో తీసుకొచ్చినట్టు ఓ ఎదవ సీన్ క్రియేట్ చేశారు… తీరా చూస్తే ఆమె రష్మి… ఆల్‌రెడీ అక్కడ జబర్దస్త్‌కు, డ్రామాకంపెనీకి పనిచేస్తున్న రష్మిని ఏదో కొత్త మొహం అన్నట్టుగా సీన్ క్రియేట్ చేయడం ప్రేక్షకుల్ని నిజంగా పిచ్చోళ్లను చేయడం… ఆమె కూడా నేను టెంపరరీయే, కొత్త మొహం వచ్చేవరకు జస్ట్, అడ్జస్ట్‌మెంట్ మాత్రమే అని ఉదారంగా ఓ ప్రకటన చేయడం మరో వెక్కిరింపు… అడ్జస్ట్‌మెంట్‌కు కూడా ఇంత బిల్డప్పా..?!
అక్కడ మిగిలిన కమెడియన్ల మెరిట్ ఫాఫం, ఎంత దయనీయం అంటే… ఆమధ్య అనసూయకు వీడ్కోలు చెప్పడానికి ఓ స్కిట్ చేశారు… ఆహా ఓహో అని కీర్తించాలనుకున్నారు… జబర్దస్త్‌కు, యావత్ తెలుగు టీవీ కళా ప్రపంచానికి ఆమె సేవల్ని గుర్తుచేసుకోవాలని అనుకున్నారు… తీరా చూస్తే ఆ వేషం వేసింది తాగుబోతు రమేష్… వాయిఖ్… ఇక వీడ్కోలు తీసుకునే అనసూయ మూతిని అష్టవంకర్లు తిప్పుతూ, మొహంలో తనకు అలవాటైన రీతిలో వీసమెత్తు ఎమోషన్ లేకుండా కూర్చుంది… ఫాఫం, ఈ స్కిట్ డైరెక్టర్ ఎవరోగానీ తన కెరీర్‌లో ఇక మరిచిపోలేడేమో…
పోనీ, వెళ్లిపోయినవాళ్లేమైనా సుఖంగా ఉన్నారా..? లేరు..! సినిమాల్లో ఒకటీఅరా చాన్సులున్నవాళ్లు మినహా మిగతావాళ్లకు ఓ స్థిరమైన షో లేదు… నాగబాబును నమ్ముకుంటే కష్టం… జీతెలుగులో అదిరింది షో పోయింది… స్టార్‌మాటీవీలో కామెడీ స్టార్స్ మళ్లీ ఎప్పుడు స్టార్టో తెలియదు… దాని నిర్మాత ఓంకార్‌కు దానిపై ఇంట్రస్టు లేదు… ఆహా ఓటీటీకి భారీ ఎత్తున కంటెంట్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు… కాస్త మెరిట్ ఉండి, అక్కడ చేరిన కమెడియన్లు ఏం చేయాలి..?
ఏతావాతా అర్థమవుతున్నది ఏమిటంటే..? ఈటీవీ, మల్లెమాల వదిలేసిన మెరిట్‌ను కూడా ప్రత్యర్థులు వాడుకోలేని దురవస్థ… అవును, వాళ్ల నాన్-ఫిక్షన్ కంటెంట్ వైఫల్యమే మల్లెమాలకు బలం… ఎక్కడా ఏ దిక్కూలేకపోతే ప్రేక్షకులైనా ఏం చేస్తారు… కనిపించే దరిద్రాన్నే భరిస్తారు… జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగులు మళ్లీ పెరుగుతుండటమే దానికి తార్కాణం… ఈ స్థితిలో కాస్త కుదురుగా నిలబడి, కంటెంట్ క్రియేట్ చేయొచ్చు కదా… ఈ ఫ్రస్ట్రేషన్ దేనికి..? కొత్త యాంకర్ ఇదుగో … వంటి దరిద్రపు సస్పెన్స్, ప్రాంక్ సీన్లు దేనికి…!!
Share this Article