నిజంగా ఓ ఆసక్తికరమైన కథ… సాంతం చదివాక కొంతసేపు ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు చుట్టుముట్టేస్తాయి… సరే, ముందుగా కథ చెప్పుకుందాం… అది ముంబై… 2013… అంటే తొమ్మిదేళ్ల క్రితం… అంథేరిలో బడికి వెళ్లిన ఓ అమ్మాయి మళ్లీ ఇంటికి రాలేదు… డిసౌజా అనేవాడు ఆమెను కిడ్నాప్ చేశాడు… ఎందుకంటే..? వాడికి పిల్లల్లేరు… భార్య పేరు సోనీ… అమ్మాయి పేరు పూజ…
కిడ్నాప్ అయితే చేశాడు గానీ తెల్లవారే వాడికి గుబులు పట్టుకుంది… మీడియాలో పూజ కిడ్నాప్ వార్త ప్రముఖంగా వచ్చింది… ఫోటో వేశారు… పూజ తల్లిదండ్రులు డీఎన్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు… భయంతో ఆ అమ్మాయిని కర్నాటకలోని రాయచూరులోని ఓ హాస్టల్‌కు పంపించాడు డిసౌజా… అది తన స్వస్థలం… ఇక ఏమీ కాదులే, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు… కానీ తనకు తెలియని విషయం ఒకటుంది… కథ ఇక్కడే స్టార్టయిందని…
ఆ పోలీస్ స్టేషన్‌లో రాజేంద్ర ధొండు భోస్లే అని ఓ అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉన్నాడు… తన దగ్గరకు పిల్లల కిడ్నాప్ కేసు గనుక వస్తే తను వదిలిపెట్టడు… వెంటపడతాడు… 2008 నుంచి 2015 వరకు… అంటే తను రిటైరయ్యేవరకు తను వెతికిపట్టుకున్న పిల్లల సంఖ్య 165… ఈ ఒక్క అమ్మాయి కేసు తప్ప తన స్టేషన్‌లో నమోదైన ప్రతి కేసునూ పరిష్కరించాడు… పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పగించింది ఆయన టీం…
Ads
ఈ గరల్ నంబర్ 166 మాత్రం అంతుచిక్కడం లేదు… ఈలోపు రిటైరయ్యాడు… ముంబైలో పిల్లల కిడ్నాపులంటేనే హడల్… ఎవరు చివరకు ఎక్కడ తేలతారో ఎవరికీ తెలియదు… కానీ ఈ పూజ కిడ్నాప్ కేసును సాల్వ్ చేయలేకపోయానే అనే బాధ తనలో ఉంది… అందుకే రిటైరైనా సరే తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు… తరచూ పూజ సొంతింటికి వెళ్లి ‘‘తప్పకుండా ఆమెను వెతికిపట్టుకుంటా, మీకు అప్పగిస్తాను’’ అని ధైర్యం చెప్పేవాడు… నిజానికి వాళ్లు ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నారు…
….(The Sunday Express report in 2015 on the policeman’s search for the girl)…
అప్పట్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం ఇది… గరల్ నంబర్ 166 అనే హెడింగ్ పెట్టి, పోలీసులు చేసిన కృషిని కూడా రాసింది… పోలీసులు పూజ ఫోటోతో పోస్టర్లు అతికించారు… పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు… 2013లో ఈ కిడ్నాప్ జరిగితే, ఆమెను పిల్లల్లేక కిడ్నాప్ చేసిన డిసౌజాకు 2016లో సొంతంగా ఓ బిడ్డ పుట్టింది… రాయచూరు నుంచి పూజను కూడా వాపస్ తీసుకొచ్చారు… కానీ ఇద్దరు పిల్లలను పోషించడం వాళ్లకు కష్టమైపోయింది…
దాంతో ఇల్లు మార్చారు… ఈ పూజను జుహూలోని ఓ సొసైటీలో బేబీసిట్టర్‌గా చేర్చారు… అప్పటికే కొద్దిగా ఎదిగినందున ఆ పిల్లను ఎవరూ గుర్తుపట్టేవారు కాదు… పైగా వాళ్లు ఇల్లు కదలనిచ్చేవాళ్లు కాదు ఆమెను… డిసౌజా భార్య సోనీ కూడా ఈ పూజను ఎప్పుడూ కొడుతుండేది… డిసౌజా ఓరోజు బాగా తాగొచ్చి, నిన్ను 2013లో ఎత్తుకొచ్చామనీ, నువ్వు మా సొంత బిడ్డవు కాదు అని నోరుజారాడు… పూజకు తన బతుకేందో అర్థమైంది… కానీ భయం… ఎలా తప్పించుకోవాలి..? తప్పించుకుంటే ఎటు వెళ్లాలి..? బయట జనారణ్యం, క్రూరమృగాల సంఖ్య కూడా చాలా ఎక్కువ…
నిజానికి పూజ ఒరిజినల్ తల్లిదండ్రులు ఎక్కడైతే బతుకుతున్నారో, ఆ గిల్‌బర్ట్ ఏరియాకు జస్ట్, 500 మీటర్ల దూరంలోనే పూజను ఎత్తుకుపోయిన నేరస్థులు బతుకుతున్నారు… కానీ ఆమెను గుర్తుపట్టినవాళ్లు లేరు… అప్పటికి ఆమె ఫోటోలతో వేసిన పోస్టర్లు చిరిగిపోయాయి… కిడ్నాప్ సంగతే అందరూ మరిచిపోయారు… ఐనా అది మహానగరం… పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోనంత పరుగుల జీవితం కదా అందరిదీ…
కథ ఇక్కడ మలుపు తిరిగింది… పూజ బేబీ సిట్టర్‌గా పనిచేస్తుంది కదా… అలా ఆమెతో పనిచేయించుకునే ఒకావిడ పేరు ప్రమీల… ఆమెకు ఏదో డౌటొచ్చి, పూజ వివరాలు కనుక్కుంది… పూజ పేరుతో గూగుల్ సెర్చ్ ప్రారంభించింది… గడ్డివామిలో సూదిని వెతికే ప్రయాస… ఆ పేరుతో కొన్ని వేల మంది ఉంటారు… ఐనా ప్రయత్నం మానలేదు ఆమె… కాస్త క్వాలిటేటివ్ సెర్చింగ్ చేసింది… కిడ్నాప్ అని అనుమానించలేదు గానీ మిస్సింగ్ పేరుతో వెతకసాగింది…
లక్కీగా అప్పట్లో పోలీసులు వేసిన పోస్టర్లు, వాటి ఆధారంగా పత్రికల్లో వచ్చిన కొన్ని క్లిప్పింగులు కనిపించాయి ఆమెకు… విషయం కాస్త అర్థమైంది… కానీ కన్‌ఫమ్ కావడం ఎలా..? సెర్చింగులో దొరికిన ఫోటోలను పూజకు చూపించింది… ఆమె అందరినీ గుర్తుపట్టింది… ఏడవసాగింది… అప్పటి పోస్టర్లలో అయిదు కంటాక్టు నంబర్లు ఇచ్చారు పోలీసులు… కానీ అందులో నాలుగు ఫోన్లు పనిచేయడం లేదు… ఇన్నేళ్లలో నంబర్లు మారిపోయి ఉంటాయి కదా…
అయిదో నంబర్ పనిచేస్తోంది… ఆ నంబర్ ఓనర్ పేరు రఫీక్… పూజ ఇంటిపక్కనే ఉండేవాడు… ఫోన్ చేస్తే నమ్మలేదు… ఇలాంటి ఫోన్లు చాలా వచ్చేవి తనకు… చాలావరకూ ఫేక్ కాల్స్… దాంతో వాటికి ఆన్సర్ చేయడం మానేశాడు… నిజంగా పూజను గనుక మీరు చూసినట్టయితే ఫోటో తీసి పంపండి అన్నాడు…
పూజ వివరాల్ని గూగుల్ ద్వారా కనుక్కున్న ఆ గృహిణి రఫీక్‌కు వీడియో కాల్ చేసింది… అమ్మాయి ఫోటోల్ని తీసి చూపించింది… అప్పుడు రఫీక్ నిజమేనని నమ్మాడు… పూజ తల్లికి చెప్పాడు… రిటైరైనా సరే ఇంకా ఆ అమ్మాయి ఆచూకీ కోసం అన్వేషిస్తున్న భోస్లేకు కూడా చెప్పాడు… అప్పటికే పిల్ల తండ్రి చనిపోయాడు… తల్లి, మామ ఇద్దరే ఉంటున్నారు… అమ్మాయి ఫోటో చూసి ఏడ్చేశారు…
…. (The girl with her mother at a police station in Mumbai on Friday….)
భోస్లే మళ్లీ రంగంలోకి దిగాడు… ఆ అమ్మాయి పనిచేసే జుహూ సొసైటీలో మరిన్ని వివరాలు తీసుకుని, డీఎన్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చాడు… ఓ పోలీస్ టీం పూజ ఇప్పుడు బతుకుతున్న ఆ ఇంటికి పూజ తల్లితోసహా వెళ్లింది… తల్లీబిడ్డ తొమ్మిదేళ్ల తరువాత కలిశారు… కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు…
పోలీసులు డిసౌజాను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు… డిసౌజా భార్య సోనిని ఇంకా అరెస్టు చేయలేదు… వాళ్ల ఆరేళ్ల బిడ్డను చూసుకునేవాళ్లు ఎవరూ లేరు కాబట్టి లేట్ చేస్తున్నారు… దొరికిన పూజకు వైద్యపరీక్షలు చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగిస్తున్నారు… ఓ పోలీస్ టీం రాయచూరు కూడా వెళ్లింది… కొన్నాళ్లు అక్కడ ఉంచారు కదా ఆ అమ్మాయిని… ఇప్పుడు భోస్లే ఫుల్ హేపీ… గరల్ నంబర్ 166 కేసు కూడా సాల్వ్ అయిపోయింది… రిటైరైన ఏడేళ్ల తరువాత…!!
Share this Article