అన్నీ బాగుండి, అనుకున్నవన్నీ చెలాయించుకుంటుంటే… స్వేచ్ఛ విలువ తెలియదు…! ఈ వాక్యాన్ని ఎవరు దేనికి వర్తింపజేసుకుని, మథనపడినా పర్లేదు… కానీ పాకిస్థానీ అధికారులు ఓ పాపులర్ టీవీ చానెల్‌ను మూసిపారేశారనే వార్త చదివాక ఆ వాక్యమే గుర్తొచ్చింది… మనకు తెలుసు కదా… పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం అనేది ఓ మేడిపండు… అది మిలిటరీ స్వామ్యం… మిలిటరీ కోసం, మిలిటరీ చేత, మిలిటరీ యొక్క అధికార చట్రం అది…
మంగళవారం అరై న్యూస్ చానెల్‌లో ప్రతిపక్ష నేత ఎవరో మిలిటరీ మీద ఏవేవో వ్యాఖ్యలు చేశాడు… మిలిటరీ అధికారులకు ఎక్కడో మండింది, చర్రుమంది… దాంతో దేశద్రోహం ఆరోపణలతో సదరు చానెల్‌ను మూసిపారేశారు, ఆ ప్రతిపక్ష నేతను కటకటాల్లోకి తోసేశారు… మన దేశంలో మిలిటరీ ప్రాణాలను నష్టపోతున్నా సరే, నీచమైన వ్యాఖ్యలతో డిమోరల్ చేయడానికి పదే పదే ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి… ఇక్కడ ఉదాహరణలు అవసరం లేదు… కానీ అలాంటోళ్లకు పెద్దగా ఏ నష్టమూ జరగదు… బయటి దేశాల నుంచి ఆర్థికసాయాలు, నైతిక మద్దతులు కూడా దొరుకుతూ ఉంటాయి…
పాకిస్థాన్‌లో ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ఉంది… అది మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేయడం, వెంటనే ప్రసారాలు ఆగిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి… ‘‘మీ చానెల్‌లోని ద్వేషపూరిత, దేశద్రోహ, హానికరమైన కంటెంట్ మీ దుర్మార్గపు ఉద్దేశాల్ని బయటపెడుతున్నాయి’’ ఇదీ ఆ నోటీస్ సారాంశం… ఇంతకీ అరెస్టయిన ప్రతిపక్ష నేత ఎవరయ్యా అంటే..? ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహరీక్ ఇ ఇన్సాప్ పార్టీ నాయకుడు షాబాజ్ గిల్…
Ads
పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అనబడే అధికార పార్టీ దిగువ, మధ్య స్థాయి ఆర్మీ శ్రేణుల్ని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మీద తిరగబడేట్లు రెచ్చగొడుతోందని గిల్ సదరు చానెల్‌లో మాట్లాడుతూ ఆరోపించినట్లుగా డాన్ పత్రిక కథనం… అరై న్యూస్ చానెల్ చేసిన నేరమేమిటయ్యా అంటే గిల్ మాటల్ని ప్రసారం చేయడం మాత్రమే… దాంతో అరై డిజిటల్ నెట్‌వర్క్ ప్రెసిడెంట్, సీఈవో సల్మాన్ ఇగ్బాల్, ఇద్దరు న్యూస్ యాంకర్ల మీద దేశద్రోహం ఆరోపణలతో కరాచీలో ఓ నివేదిక ప్రిపేరైపోయింది… చానెల్ న్యూస్ హెడ్ అమ్మద్ యూసఫ్‌ను కూడా అరెస్టు చేసినట్టు చెబుతున్నారు… మంగళవారమే చానెల్ ‘‘అవి కేవలం గిల్ అభిప్రాయాలు మాత్రమే, తన వ్యాఖ్యలతో మా చానెల్‌కు సంబంధం లేదు’’ అని పదే పదే ప్రకటన జారీ చేసినా అధికారగణం పట్టించుకోలేదు…
నిజానికి గిల్ మాట్లాడుతున్నప్పుడు పీఎంఎల్ (ఎన్) పార్టీ నుంచి ఎవరూ ఆ డిబేట్లోకి రాలేదు… ఆల్‌రెడీ ఆ పార్టీ ఈ నెట్‌వర్క్‌ను బహిష్కరించింది కాబట్టి… దాంతో వన్ సైడ్ వెర్షనే జనంలోకి వెళ్లిపోయింది… మా తప్పేమీ లేకపోయినా మమ్మల్ని పాకిస్థాన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్టు చానెల్ విమర్శిస్తోంది… పాకిస్థాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ప్రభుత్వ చర్యను తప్పుపట్టింది…
ఇమ్రాన్ ఖాన్ అనుకూల నేత గిల్‌ను కూడా ఇస్లామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు… తన మీద దేశద్రోహం కేసు మాత్రమే కాదు, రాజ్యం మీద తిరుగుబాటు, దాడులకు రెచ్చగొట్టడం, అల్లర్లకు పురికొల్పడం వంటి ఇతరత్రా కేసుల్ని కూడా మోపారు… ‘‘ఇదా ప్రజాస్వామ్యం..? రాజకీయ కార్యకర్తల్ని శత్రువులుగా పరిగణించడం ఏమిటి..? విదేశీ శక్తుల మద్దతున్న మోసగాళ్ల ప్రభుత్వాన్ని ఆమోదించే దిశలో మా మీద ప్రయోగిస్తున్న నిర్బంధమే ఇది’’ అని ఇమ్రాన్ ఖాన్ ఓ ట్వీట్‌లో ఆరోపించాడు..!!
Share this Article