కంగనా రనౌత్ హృదయం ఇప్పుడు హాయిగా ఉన్నట్టుంది… ఓ ప్రొఫెషనల్‌గా, బాలీవుడ్ పాపులర్ హీరోయిన్‌గా నిజానికి అలా ఫీల్ కాకూడదు… బాధపడాలి… ఆందోళన పడాలి… కానీ, అలా పడితే ఆమె కంగనా ఎందుకు అవుతుంది..? అప్పట్లో, మే నెలలో ఆమె సినిమా ధాకడ్ రిలీజైంది… ఉత్త రొటీన్ ఫైటింగుల పిచ్చి సినిమా అది… 2100 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తే రెండు రోజుల్లోనే 300 స్క్రీన్లలో ఎత్తిపారేశారు… మరీ కొన్ని షోలకు 10 నుంచి 15 మంది మాత్రమే…
ఎనిమిదోరోజు కేవలం 20 టికెట్లు అమ్ముడుబోయి, నాలుగు వేల చిల్లర రూపాయల కలెక్షనే వచ్చినట్టు వార్తలు చదివాం… బిగ్గెస్ట్ డిజాస్టర్… 80 కోట్లు ఖర్చు పెడితే 3 కోట్లు కూడా రాలేదు… బాలీవుడ్ చరిత్రలోనే రాసిపెట్టదగిన ఘోరమైన ఫ్లాప్… ఐనాసరే, లాల్‌సింగ్ ఘోరపరాజయ వార్తలు చదువుతూ తన ధాకడ్ కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటుంది బహుశా…
అదేకాదు, అక్షయ్ 300 కోట్లు పెట్టిన పృథ్వీరాజ్ ఇంకో ఫ్లాప్… 50, 60 కోట్లు వచ్చాయి… రన్‌వే 34 మరో ఫ్లాప్… హీరో ఎవరైతేనేం, హిందీ సినిమాలన్నీ తన్నేస్తున్నయ్… తెలుగు సినిమాలు కాస్త నయం… ఈమధ్య మేజర్, సీతారామం, బింబిసార… అంతకుముందు ఆర్ఆర్ఆర్, పుష్ప మంచి వసూళ్లు సాధించాయి… కన్నడ కేజీఎఫ్-2 అయితే ఎక్కడికో వెళ్లిపోయింది… ఆ వసూళ్లు నమ్మశక్యం కాని రీతిలో వెల్లువెత్తాయి… తమిళ విక్రమ్ కూడా సూపర్ హిట్… మరో కన్నడ సినిమా చార్లి777 అనూహ్యంగా హిట్… ఈ స్థితిలో ఆమీర్ ఖాన్ తీసిన లాల్‌సింగ్‌చద్దా మళ్లీ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుందని బాలీవుడ్ ఆశపడింది…
Ads
నో… హీరో ఎవరైనా సరే, ప్రేక్షకుడు థియేటర్ వైపు అస్సలు రావడం లేదు… ఈ సినిమా 11న రిలీజ్ చేయగా, 12 నాటికే… అంటే ఒకేరోజుకు 1300 షోస్ ఎత్తిపారేశారు… వీకెండ్ మీద ఆశలు కూడా ఆరిపోయాయి నిర్మాతకు… మరీ కొన్నిచోట్ల 10-15 మంది కూడా ప్రేక్షకులు లేరు…
ఇదే స్థితి అక్షయ్ తీసిన రక్షాబంధన్ సినిమాది కూడా… సరే, అక్షయ్ నెలకు ఓ సినిమా చొప్పున ఫటాఫట్ ఉత్పత్తి చేస్తూనే ఉంటాడు… పృథ్విరాజ్ పక్కనపెడితే మిగతావన్నీ కాస్త తక్కువ బడ్జెట్‌లే… కానీ ఆమీర్ సినిమా ఫ్లాప్ పెద్ద దెబ్బే…
ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా కాస్త ధైర్యంగా థియేటర్ల వైపు చూస్తోంది… కానీ బాలీవుడ్ నిర్మాతలు నిలువెత్తు నిరాశలో కూరుకుపోయారు… వాళ్లకు అర్థం కానిదల్లా సౌత్ నుంచి హిందీలోకి డబ్బయిన సినిమాలు సూపర్ హిట్లు… కానీ ఒరిజినల్ హిందీ సినిమాలు ఫ్లాప్… ఎందుకలా..?
కేజీఎఫ్-2, విక్రమ్, ఆర్ఆర్ఆర్ మామూలు విజయాలు కావు… కమల్‌హాసన్‌ను మినహాయిస్తే… యశ్, ఎన్టీయార్, రాంచరణ్, బన్నీ, రక్షిత్ తదితరులెవరూ హిందీలో ఎస్టాబ్లిష్డ్ కాదు, పాపులర్ కాదు అంతకుముందు… ఐతేనేం, కుమ్మేశారు…
ఇప్పుడు లాల్‌సింగ్, రక్షాబంధన్ కలిపి మొదటిరోజు 20 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయాయి… ఆమీర్‌ఖాన్‌కు గత 13 ఏళ్లలో ఇంత దారుణమైన ఫ్లాప్ మరొకటి లేదు… ‘‘చద్దా, రక్షాబంధన్ కలిపి 10 వేల షోలు మొదటిరోజు… కొన్ని థియేటర్లలో మరీ పదీపన్నెండు మంది… షో ఎత్తిపారేస్తే ఖర్చు మిగులుతుంది కదా..’’ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు..!!
Share this Article