Article by పార్ధసారధి పోట్లూరి ………. విద్యుత్ సంస్కరణల [అమెండ్మెంట్ ] సవరణ చట్టం- 2022 సమీక్ష! Electricity (Amendment) Bill 2022… ఆగస్ట్ 8 న లోకసభలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి RK సింగ్ విద్యుత్ సంస్కరణల సవరణ చట్టం- 2022 ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లు మీద విపక్షాలు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీ దళ్ తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ [All India Power Engineers Federation (AIPEF) ఒక రోజు సమ్మె కూడా చేసింది. ఈ బిల్లులోని ప్రధాన అంశాలు ఏమిటో, అలాగే వాటి మీద ప్రతిపక్షాల అభ్యంతరాలు లేదా ఆరోపణల సారాంశం ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం !
విద్యుత్ సంస్కరణల సవరణ చట్టం బిల్లు ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉంది కాబట్టి ఇంకా చట్ట రూపం ధరించలేదని గ్రహించండి ! ఈ బిల్లులోని ప్రధాన అంశాలని స్పృశించే ముందు గతంలో మనం చెప్పుకున్న అంశాలు మరోసారి ఇక్కడ ప్రస్తావించి, బిల్లులోని అంశాలు ఏమిటో తెలుసుకుందాం ! దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థలు ప్రస్తుతం నిధుల లేమితో కష్టాలలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో విద్యుత్ బకాయిలు సదరు విద్యుత్ ఉత్పత్తిదారులకి చెల్లించకపోవడం ఒక కారణం అయితే మితిమీరిన విద్యుత్ సబ్సిడీలు మరో కారణం…
1. ప్రస్తుతం జెన్కోలు (ఉత్పత్తి సంస్థలు) కానీ డిస్కంలు (పంపిణీ సంస్థలు) కానీ నష్టాలలో ఉన్నాయి. మరోవైపు హై టెక్నికల్ నష్టాలు… బకాయిల రికవరీకి ఎకో సిస్టమ్ లేకపోవడం వలన ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి బకాయిలు సకాలంలో వసూలు చేసుకోలేక పోతున్నాయి…
Ads
2. బొగ్గు సరఫరాలో విపరీత జాప్యం జరుగుతున్నది కానీ కోల్ ఇండియాకి బకాయిల చెల్లింపులు సకాలంలో జరగకపోవడం వలన దాని ఫలితం బొగ్గు ఉత్పత్తి మీద పడుతున్నది…
3. జెన్కోలకి డిస్కంలు ఒక లక్ష కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి… బకాయిలు వసూలు చేసుకోవడానికి ఇప్పటివరకు సరయిన సిస్టమ్ లేదు. కోల్ ఇండియా తనకి రావలసిన బకాయిలను వసూలు చేసుకోవడంలో విఫలం అవడం వలన బొగ్గు సరఫరా మీద ఆ ఒత్తిడి పడుతున్నది.
4. జెన్కోల డిమాండ్ మేరకు కోల్ ఇండియా తన ఉత్పత్తిని పెంచడం లేదు నిధుల కొరత వలన… ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం మీద ఆధారపడి నడుస్తున్నది. రాష్ట్రాలు డిస్కంలకు ఇవ్వవు, డిస్కంలు జెన్కోలకు ఇవ్వవు, జెన్కోలు కోల్ ఇండియాకు ఇవ్వవు…
5. ఇక ఇలాంటివి ముందు ముందు జరగకుండా ఉండాలి అంటే పేమెంట్ విషయంలో ఒక ఫ్రేమ్ వర్క్ అవసరం ఉంది. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ల పని తీరు కూడా సవ్యంగా ఉండడం లేదు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ల పనితీరు మెరుగుపరచడంతో పాటు ఈ రంగంలో పోటీ తత్వం పెంచేందుకు కొత్త విద్యుత్ సవరణ చట్టం అవసరం ఏర్పడ్డది.
6. విద్యుత్ చట్టం సవరణ బిల్లులో గ్రీన్ ఎనర్జీ మీద పలు సూచనలు, సలహాలు, నిబంధనలని పొందుపరిచారు… అదే సమయంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ల పనితీరు మీద కూడా కొన్ని సవరణలు ప్రతిపాదించింది కేంద్రం…
7. ఇప్పటికే భారత్ పలు అంతర్జాతీయ వేదికల మీద రెన్యూవబుల్ ఎనర్జీ విషయం మీద పలు సవరణలు తెచ్చి, గ్రీన్ ఎనర్జీ విద్యుత్ ఉత్పాదన చేస్తామని హామీలు ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉంది. కొత్త సవరణ చట్టంలో గ్రీన్ ఎనర్జీకి ప్రాముఖ్యత ఇస్తూనే, విద్యుత్ నష్టాలని తగ్గించడానికి, విద్యుత్ బకాయిలని సకాలంలో వసూలు చేయడానికి పలు ప్రతిపాదనలని చేసింది…
విద్యుత్ చట్టం సవరణ బిల్లులోని ముఖ్యాంశాలు :
1. ఒక ప్రాంతంలో ఒకరి కంటే ఎక్కువ విద్యుత్ పంపిణీ సంస్థలు ఉండవచ్చు. ఒకరు మరొకరి విద్యుత్ పంపిణీ వ్యవస్థ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకోవచ్చు లేదా ఆపరేట్ చేయవచ్చు…
2. ఒకే ప్రాంతంలో ఇద్దరు పవర్ డిస్ట్రిబ్యూటర్లు ఆపరేట్ చేయడం వలన పోటీతత్వం పెరుగుతుంది. (టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలాగా)… వినియోగదారులకి ఎక్కువలో ఎక్కువ విద్యుత్ పంపిణీ యొక్క ప్రయోజనాలు అందుతాయి పోటీ తత్వం వలన… రెగ్యులేటర్లు కనీస చార్జీల మీద నియంత్రణని [minimum tariff ceiling] విధిస్తారు. దీనివల్ల అనారోగ్యకరమయిన చార్జీల తగ్గింపు వలన కలిగే నష్టాలని నివారించవచ్చు. ఇద్దరు డిస్ట్రిబ్యూటర్ల మధ్య ధరల యుద్ధం జరగకుండా మాగ్జిమమ్ ధర ఎంత ఉండాలో కూడా రెగ్యులేటర్స్ నియంత్రణ విధిస్తారు కాబట్టి ఇది పరోక్షంగా వినియోగదారులకే లాభం కలిగిస్తుంది…
3. ఎవరయినా విద్యుత్ పంపిణీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తే దానిని కనీసం 90 రోజులలోపు విచారించి, లైసెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది… అలా చేయకపోతే 90 రోజుల తరువాత ఆ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఆటోమాటిక్ గా లైసెన్స్ ఇచ్చినట్లుగా అంగీకరించాల్సి ఉంటుంది… ఇది రాజకీయ జోక్యం వలన కలిగే జాప్యాన్ని నివారిస్తుంది. ప్రస్తుతం ఈ రూల్ లేకపోవడం వలన సంవత్సరాల తరబడి జాప్యం చేస్తున్నారు. లేదా ఇవ్వడమే లేదు…
4. విద్యుత్ రెగ్యులేటరీ సంస్థలకి సివిల్ కోర్ట్ మేజిస్ట్రేట్ అధికారాలని ఇస్తున్నది కొత్త విద్యుత్ సవరణ చట్టం. అంటే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్న నిర్ణయం ఒక సివిల్ మేజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయంతో సమానం అన్నమాట. ..ఒక సివిల్ మేజిస్ట్రేట్ ఎలా అయితే డిక్రీ జారీ చేస్తాడో అదేవిధంగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కూడా డిక్రీ జారీ చేయవచ్చు…
5. ఇక రెగ్యులేటరే కమిషన్ లో సభ్యుల ఎంపిక మరియు అర్హతలని కూడా కొత్త సవరణ చట్టంలో పొందుపరిచారు. సభ్యుల కాలపరిమితి మీద కూడా విధి విధానాలని సూచించింది కొత్త చట్టం…
6. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుల నియామకంలో రాజకీయ కారణాల వలన జాప్యం జరిగి, ఆయా కమిషన్లలో సభ్యుల నియామకం నిర్ణీత కాలంలో జరపకపోతే ఆ కమిషన్ పనితీరు మీద ప్రభావం పడుతుంది… అటువంటి సందర్భాలలో కేంద్రం ఆయా రాష్ట్రాలను సంప్రదించి పక్క రాష్ట్ర కమిషన్ కి ఆ రాష్ట్ర బాధ్యతలని అప్పగిస్తుంది… లేదా సభ్యుల కొరత ఉన్న రాష్ట్ర కమిషన్ తో పూర్తిగా సభ్యులున్న పక్క రాష్ట్ర కమిషన్ తో కలిసి పనిచేసేలా కొత్త సవరణ చట్టం వీలు కల్పిస్తున్నది. అంటే కొత్త విద్యుత్ సవరణ చట్టం వలన ఏవో కుంటి సాకులు చెప్తూ పూర్తిగా కమిషన్ సభ్యులని నియమించకుండా జాప్యం చేయడానికి కుదరదు…
7. కొత్త విద్యుత్ సవరణ చట్టంలో కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించే రెగ్యులేటరీ కమిషన్ సభ్యులని వాళ్ళ పదవుల నుండి తొలగించే అధికారాన్ని కేంద్రానికి ఇస్తున్నది.
8. కొత్త విద్యుత్ సవరణ చట్టం రెన్యువబుల్ ఎనర్జీని ఆయా రాష్ట్రాలు ఎంత శాతం కొనాలో నిబంధనలని పొందుపరిచింది. చట్టంలో నిర్దేశించిన రెన్యువబుల్ ఎనర్జీ కొనుగోలు శాతాల్ని అమలు చేయాల్సిందే ఖచ్చితంగా… రెన్యువబుల్ ఎనర్జీని కొని, దానిని సప్లై చేసే విధి విధానాలని కేంద్రం నిర్దేశిస్తుంది.
9.కొత్త విద్యుత్ సవరణ చట్టంలో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ [National Load Despatch Centre] ని శక్తివంతంగా ఉంచేందుకు కావాల్సిన అన్ని ప్రమాణాలని నిర్దేశిస్తున్నది. దీనివలన నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ మీద ఒత్తిడి పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో విధివిధానాలని నిర్దేశిస్తున్నది కొత్త చట్టం. దీనివల్ల డిస్కంలు తమ వద్ద తగినంత నిధులని రిజర్వ్ లో ఉంచుకోవాలి… లేకపోతే కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా డిస్కంలకి ఇచ్చే విద్యుత్ సరఫరాని ఆపివేసే అధికారాన్ని కొత్త చట్టం ఇస్తున్నది… కేంద్రం డిస్కంలు ఎంత శాతం నిధులని రిజర్వ్ లో ఉంచాలో నిర్దేశిస్తుంది…
కొత్త విద్యుత్ సవరణ చట్టం మీద వ్యతిరేకత ఎందుకు ?
ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్, కాంగ్రెస్ పార్టీలు కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కొత్త విద్యుత్ సవరణ చట్టం ఫెడరల్ వ్యవస్థకి అనుకూలంగా లేదని, పూర్తిగా విద్యుత్ రంగం కేంద్రం చేతిలోకి వెళ్లిపోతున్నది అని ఆరోపిస్తున్నాయి. కొత్త విద్యుత్ సవరణ చట్టం వలన పోటీ పెరుగుతుంది, కానీ లాభం వచ్చే ప్రాంతాల మీద అన్ని సంస్థలు దృష్టిపెడతాయి, కానీ లాభాలు రాని గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టవు అని ఆరోపణ… అలాగే రైతులకి ఇచ్చే సబ్సిడీ విద్యుత్ మీద కొత్త చట్టం ప్రభావం చూపిస్తుంది అని ఆరోపణ.
కొన్ని విద్యుత్ సంస్థల ఉద్యోగ సంఘాల ఆరోపణ ఏమిటంటే… మెల్లగా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసే ఆలోచనగా ఉంది కొత్త విద్యుత్ సవరణ చట్టం అని… కొత్త చట్టం ప్రకారం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ల మీద కేంద్రం పెత్తనం పెరిగిపోయి, రాష్ట్రాల పాత్ర తగ్గిపోతుంది అని… కానీ ఇన్నేళ్లుగా ఆయా విధ్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు రాష్ట్రాల చేతుల్లోనే ఉన్నాయి, కానీ వాటి నిర్వహణ తీరు సంతృప్తి కరంగా ఉన్నాయా ? లేవు… రాజకీయ లబ్ధి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు నడుచుకుంటున్నాయి తప్పితే నిష్పక్షపాతంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ఇక రెగ్యులేటరీ కమిషన్ లో సభ్యుల నియామకం కూడా రాజకీయమే !
ఇక రెన్యువబుల్ ఎనర్జీ ఎంత శాతం కొనాలో కేంద్రమే నిర్ణయిస్తున్నది… కాబట్టి వివిధ సంస్థల నుండి కరెంటు కొనుగోళ్లలో వచ్చే కమీషన్లలో కోత పడుతుంది. ఇదీ కొందరికి నచ్చని విషయం. అదే పూర్తిగా రాష్ట్రాల ఇష్టాయిష్టాల మీద విధానాలుంటే తమకి కమీషన్లు ఇచ్చే సంస్థలకి మేలు చేకూర్చే విధంగా వ్యవహరించవచ్చు… కానీ తక్కువ ధరలో దొరికే రెన్యూవబుల్ విద్యుత్ కొనకుండా ఆపవచ్చు.
కేంద్రం వాదన ఏమిటి ?
రాష్ట్రాల అధికారాల మీద ఎలాంటి ప్రభావం పడదు. మీరు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సభ్యులని నియమించుకోవచ్చు ఇదివరకటి లాగానే… కానీ నియామకాలలో జాప్యం జరిగితే మాత్రం కేంద్రం జోక్యం చేసుకొని, వెంటనే ఆయా కమిషన్ల పని తీరుని పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యుత్ ఒప్పందాలని సమీక్షించి, పాత వాటిని రద్దు చేయడం పరిపాటిగా మారింది. దీనిని కంట్రోల్ చేయడమే కొత్త విద్యుత్ సవరణ చట్టం చేసే పని…
మరీ ధరలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తే ధరలు తగ్గించమని కోరవచ్చు కానీ ఏకంగా ఒప్పందాలని రద్దు చేయడం కుదరదు ఇక మీదట… మీరు రాజకీయ లబ్ధి కోసం ఉచిత పధకాలని ప్రవేశపెట్టి, ఎన్నికలలో గెలిచి ఆపై విద్యుత్ రంగానికి ఇవ్వాల్సిన నిధులని దారి మళ్లించి, వాటికి బకాయి పెట్టి, పరోక్షంగా కోల్ ఇండియాకి చెల్లింపుల సమస్యని కానుకగా ఇవ్వడం ఇక మీదట కుదరదు… విద్యుత్ ఉత్పాదన కోసం బొగ్గుని ముందుగానే డబ్బు చెల్లించి, బుక్ చేసుకోవాలి లేదా నిర్ణీత గడువులోగా కోల్ ఇండియాకి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాలి లేకపోతే విద్యుత్ సరఫరాని ఆపేస్తారు. ఏది ఏమయినా పార్లమెంటరీ కమిటీ ముందు కొత్త విద్యుత్ సవరణ చట్టం చర్చకి పెట్టారు. ఏవన్నా ఇబ్బందులు లేదా సవరణలు ఉంటే వాటిని ఆమోదించాక చట్టరూపం ధరిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానాలకి తావు లేదు…
Share this Article