కుక్క పని కుక్క చేయాలి… గాడిద పని గాడిద చేయాలి… ఇక్కడ కుక్క ఎవరు, గాడిద ఎవరు అనేది కాదు సమస్య… తమది కాని పని చేయడమే అసలు ఇష్యూ…….. ఈ మాట గట్టిగా అన్నామనుకొండి, సోషల్ మీడియాలో వెంటనే ఉల్టా దాడి మొదలవుతుంది… కుక్కకు పనిచేతకానప్పుడు గాడిద ఆ పనిచేస్తే తప్పేమిటట అంటారు… కోకిల రాగం శృతి తప్పుతోందని గమనించినా సరే, కాకి ఆ పాట అందుకోకూడదు కదా… సేమ్, ఈ వార్త చదివితే అదే అనిపించింది… ఆ వార్త ఏమిటో మీరూ ఓసారి చదవండి…
చలిగా ఉందని పెగ్గు వేయకండ్రా బాబూ, కర్సయిపోతారూ అనేది వార్త… ఎవరు చెప్పింది..? వాతావరణం గురించి శోధించి, అధ్యయనం చేసి, ఓ బాధ్యతగా జనాన్ని అలర్ట్ చేసే ఓ యంత్రాంగం… అనగా భారత వాతావరణ విభాగం… వర్షం పడుతుందా, తుపాన్ వస్తుందా, ఉష్ణోగ్రతల పరిస్థితి ఏమిటి అని చెప్పి, ఊరుకోకుండా… ఏకంగా మందు కొట్టాలా, లేదా అనే హితవచనాల దాకా వెళ్లిపోయింది ఈ విభాగం… రెండు పెగ్గులు ఎక్కువైనట్టున్నయ్ బహుశా….
Ads
ఆఫ్టరాల్ రెండు డిగ్రీల టెంపరేచర్ పడిపోతే ఇక మందు మానేయాలా..? మందు కొడితే దైహిక ఉష్ణోగ్రతలు దెబ్బతింటాయా…? నువ్వెవరు, నీకున్న అర్హత ఏమిటి అని మనం అడగొద్దు… వాడికి వాన రాకడ చెప్పడం ఎలాగూ చేతకాదు… చేతకాని విషయంలో అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇంకేదో చెబుతాడు..?
అసలు చలి పెరిగిందంటేనే మందు కావాలని కదా లోక సాధారణం… అంతటి సియాచిన్‌లో కూడా మన జవాన్లను కాపాడుతున్నది ఏమిటి..? సరిహద్దుల్లో చలి నుంచి వాళ్లను కాపాడుతున్నది మాంచి మిలిటరీ రమ్మే కదా… వీడెమిటి ఇలా చెబుతున్నాడు అని కోపగించుకోవద్దు సుమీ… మరి తన అసలు పని చేతకానప్పుడు ఇంకేదో చెప్పి డైవర్ట్ చేయాలని ఈ డర్టీ పొలిటిషయన్లే కదా చెబుతున్నది…
పైగా ఇది కొత్త సంవత్సరం వేడుకలకు మాత్రమే వర్తిస్తుందట,.. ఓహో, తరువాత మీ ఇష్టం, మీ బ్రాండ్, మీ మందు, మీ మోతాదు అని చెబుతున్నట్టేనా..? లేక కొత్త సంవత్సరం వేడుకల్ని నిరుత్సాహపరచడమా..? ‘‘మందు పడితే మనసు కాస్త నెమ్మదిస్తది’’ అనే పాటలు వద్దనే కదా అర్థం..?
మాంచి మాంసాహారం, ఆపై నాలుగు దిట్టమైన పెగ్గులే శ్రీరామరక్ష అనుకునే విశ్వాసులకు ఎంత కష్టం..? ఎంత కష్టం..? ఛిఛీ… మోడీ భయ్యా, వీళ్లను ఓ చూపు చూడు ఓసారి… రాష్ట్రాల మందు ఆదాయాన్ని గండికొట్టడానికే కదా ఈ కుట్ర..? ఈ వాతావరణ విభాగంలో ఎవరో యాంటీ మోడీ శక్తులు చేరినట్టున్నయ్… థూ, దుర్మార్గం కదా…
ఈ చలికాలంలో ఈ వాతావరణ విభాగం వాళ్లెవరూ మందు కొట్టకుండా ఓ చర్య తీసుకో… దెబ్బకు దిగొస్తారు… తెల్లారే మందు కొడితేనే ఈ చలి నుంచి ప్రొటెక్షన్ అని కొత్త ప్రెస్‌నోట్ ఇస్తారేమో…! మందు కొట్టనిదే వార్త రాయని జర్నలిస్టులకు కూడా ఓ పరీక్ష పెడదాం,.. ఈసారి ఎలా రాస్తారోె చూద్దాం… ఏమంటావు..? వీళ్ల మొహాల్లో చీప్ లిక్కర్ కొట్ట… మరీ ఇంత దుర్మార్గమా..?!
Share this Article