నిజంగా మోడీ పాలన విధానాలపై ఉద్యమించాలని అనుకుంటే… నిజమైన ఇష్యూస్ లేవా..? సామాన్యుడు అవస్థలు పడుతున్న ధరలు సహా బోలెడు అంశాలున్నయ్… బీజేపీ కొత్తగా ప్రవేశపెట్టాలని అనుకుంటున్న బిల్లులున్నయ్… కానీ వాటిపై రాజకీయ పోరాటం చేతకాదు… ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇదుగో, ఇలా ఎప్పుడూ ఈవీఎంలు దొరుకుతయ్… మళ్లీ వీటిపై ఉమ్మడిపోరు చేస్తాయట విపక్షాలు… టీఆర్ఎస్ సహా 11 విపక్షాలు నిర్ణయించాయట…
ఈనాడు మొదటి పేజీలో వచ్చిన వార్త ఇది… కాస్త ఆలోచనజ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా సరే, ఇలా రాజకీయ నిర్ణయాలు చదివి నవ్వుకుంటారనే సోయి కూడా లేదు… ప్రత్యేకించి టీఆర్ఎస్… పోయిన ఎన్నికల దాకా బీజేపీ అంటే రహస్య స్నేహం.., వ్యవసాయ చట్టాలు, విద్యుత్తు సంస్కరణలు వంటివి ఏది తీసుకొచ్చినా ముద్దుగానే కనిపించింది బీజేపీ జెండా… అప్పట్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ మద్దతు… ఎప్పుడైతే బీజేపీ బలపడుతూ తమ కుర్చీ కిందకు నీళ్లొస్తున్నాయో ఇక బీజేపీ గొంగళిపురుగుగా కనిపిస్తోంది… పోనీ, బీజేపీ మీద చేసే విమర్శల్లోనైనా హేతువు ఉంటుందా అంటే అదీ ఉండదు… నోటికొచ్చిన పరుషపదాలు, సంస్కారరాహిత్యం…
Ads
ఇప్పుడు ఇతర విపక్షాలతో కూడి ఈవీఎంల మీద పోరాటం చేస్తారట… ఎందుకు..? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేస్తోందట… మెషిన్, మనీ, మీడియాలను బీజేపీ వాడుకుంటోందట… ఇది ప్రజాస్వామ్యానికే తీవ్ర సవాలు అట… అని ఎవరంటున్నారో తెలుసా..? కాంగ్రెస్, సీపీఎం, ఎస్పీ, బీఎస్పీ, సీపీఐ, ఎన్సీపీ, టీఆర్ఎస్, ఆర్జేడీ, ఆర్‌ఎల్‌డీ, వెల్ఫేర్ పార్టీ, స్వరాజ్ ఇండియా… యాంటీ బీజేపీ క్యాంపులో చురుకుగా కనిపించే జేఎంఎం, డీఎంకే, టీఎంసీలకు ఇందులోని దిక్కుమాలినతనం అర్థమైనట్టుంది… అందుకే దూరంగా ఉండిపోయినట్టున్నయ్…
నిజంగా బీజేపీకి అంత చేతనైతే కేరళలో లెఫ్ట్ కూటమి మళ్లీ ఎలా గెలిచింది..? అన్ని పార్టీలకన్నా లెఫ్ట్ పార్టీలనే బీజేపీ అమితంగా ద్వేషిస్తుంది కదా… ఈవీఎంలు బీజేపీ చెప్పినట్టల్లా ఆడితే పినరై విజయన్ మళ్లీ సీఎం ఎలా అయ్యాడు..? టీఆర్ఎస్‌కు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో అంత మెజారిటీ ఎలా వచ్చింది..? నిజానికి తెలంగాణలో మనీ, మీడియా కోణాల్లో ఇప్పుడు ఎవరు బలంగా ఉన్నారు..? ఎవరు దుర్వినియోగం చేస్తున్నారు..? మొన్నటి హుజూరాబాద్ ఎన్నిక ఏం చెప్పింది..?
కేంద్ర ఎన్నికల సంఘం పదే పదే సవాళ్లు విసిరింది… ఈవీఎంలను దుర్వినియోగం చేయవచ్చునని నిరూపించాలని ప్రతి పార్టీని అడిగింది… ఏమైంది..? ఏమీ జరగలేదు… అప్పట్లో చంద్రబాబు అనే మరో పోరాటవీరుడు ఉండేవాడు… మోడీ అంతుచూస్తానంటూ వీథుల్లో కత్తులు, కరవాలాలు జోరుగా ఝలిపించాడు… కంప్యూటర్లను, మొబైళ్లను తానే కనిపెట్టాననే ఈ యుగపురుషుడు కూడా అప్పట్లో ఈవీఎంల మీద ఏడ్చినవాడే… ఇప్పుడు నోరిప్పితే ఒట్టు…
ఈ 11 విపక్షాలు ఏలోకంలో ఉన్నాయో… ప్రతి ఓటరు తాము వోటు వేశాయో లేదో ధ్రువీకరించేందుకు చాన్స్ ఉండాలట… వీవీప్యాట్ ఉన్నది అందుకే కదా… పైగా మళ్లీ వాళ్లే తమ తీర్మానంలో వీవీప్యాట్ల లెక్కింపు ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఉండటం లేదని మరో తిక్క వాదన… డిజిటల్ పద్ధతిలో ఏ తీర్పు కనిపిస్తుందో, వోట్ల అంకెలు ఎలా కనిపిస్తాయో, వీవీప్యాట్లను భౌతికంగా లెక్కించినా అదే ఫలితం కనిపిస్తుంది కదా… యాంటీ-మోడీ నడక తప్పుకాదు, రాజకీయాల్లో అధికారపక్షం మీద పోరాడకపోతేనే తప్పు… కానీ మరీ ఇలాంటి నెత్తిమాశిన అంశాలపై కాదు…!!
అన్నట్టు… మనీ, మెషిన్, మీడియా పదాలతోపాటు మజిల్ అనే పదం రాసేస్తే ‘ఎం’ల సంఖ్య పెరిగి, పంచ్ కనిపించేది కదా…!! పొలిటికల్ ఫైట్ ధీరోదాత్తంగా ఉండాలి… అయ్యో, ఎదుటోడి రథం చమ్కాయిస్తోంది, రథం మీద జెండా పెద్దగుంది, రెండు గుర్రాలు ఎక్కువ కట్టారు, రువ్వడిగా బాణాలేస్తున్నారు, అవి కొశ్శెగ ఉన్నయ్, ఆ ధనుస్సు సైజు పెద్దగున్నట్టుంది… గీ శోకాలెందుకు, గీ సాకులెందుకు తండ్రీ..!!
Share this Article