ఇస్రో గూఢచర్యం కేసు గుర్తుంది కదా… ఈమధ్య హీరో మాధవన్ సదరు బాధిత సైంటిస్టు నంబి నారాయణన్ బయోపిక్ సినిమా కూడా తీశాడు… దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది… మళ్లీ ఆ కథలోకి ఇప్పుడు వెళ్లాల్సిన పనేమీ లేదు… కానీ ఆయన ఇంకా పోరాడుతూనే ఉన్నాడు… తనకు పరిహారం, పౌరపురస్కారం, నిర్దోషిగా ప్రకటన దక్కాయి… కానీ తన వెనుక కుట్ర పన్నిందెవరు..? ఎందుకోసం ..? వీటిని తేల్చాలని కోరుతున్నాడు… నిజమే, తేలాలి కదా… ఆ కుట్రకు బాధ్యులు ఎవరు..? నంబి నారాయణన్ కోసం కాదు, దేశానికి ఆ కేసు ఛేదన, కుట్ర బహిర్గతం కావడం అవసరం…
ఆమధ్య సుప్రీంకోర్టు ఓ రిటైర్డ్ జడ్జి డీకే జైన్ నేతృత్వంలో ముగ్గురితో ఓ కమిటీ వేసింది… ఈ కేసులో పోలీసుల పాత్రను విచారించాలని కోరింది… ఆ కమిటీ రిపోర్టు సమర్పించింది… సుప్రీం దాన్ని పరిశీలించి మొత్తం 18 మంది పోలీసులపై ఎఫ్ఐఆర్ పెట్టి, సీబీఐ పెద్దలే స్వయంగా శ్రద్ధ తీసుకుని దర్యాప్తు చేయాలని ఆదేశించింది… అఫ్‌కోర్స్, అది ఎటూ కదలడం లేదు… ఎవరు అడ్డుపడుతున్నారనేది అనూహ్యం… దేశం, భక్తి, జాతీయత, సమగ్రత, రక్షణ వంటి పదాల్ని పదే పదే వల్లెవేసే మోడీ మహాశయుడు సీబీఐని ఎందుకు అదిలించడం లేదు..?
సరే, ఆ 18 మందిలో కేరళకు చెందిన టాప్ పోలీస్ మాజీ అధికారులు కూడా ఉన్నారు… వాళ్లతోపాటు కేవీ థామస్ అనే పోలీసాయన కూడా ఉన్నాడు… ఆయనపై ఆల్‌రెడీ లుకవుట్ నోటీస్ జారీ చేశారు పోలీసులు… నంబి నారాయణన్ మీద కేసు బనాయించినప్పుడు థామస్ మల్లప్పురం జిల్లాలో ఉండేవాడు… నలభై ఏళ్ల సర్వీసు తరువాత ఐబీలో అసిస్టెంట్ డైరెక్టర్ రేంజ్ అధికారిగా రిటైరయ్యాడు… ఇప్పుడు వార్తల్లోకి వచ్చాడు… ఎందుకంటే..? పెళ్లాంతో కలిసి లండన్ చెక్కేయబోతుంటే అధికారులు అడ్డుకున్నారు… నథింగ్ డూయింగ్ అని పాస్‌పోర్టు తీసేసుకున్నారు…
Ads
అసలు ఆ నోటీసు సంగతే నాకు తెలియదు, 3 లక్షలు పెట్టి టికెట్లు కొన్నాను, నా బిడ్డ లండన్‌లో ఉంటుంది, చూడటానికి వెళ్తున్నా, ఇది హక్కుల ఉల్లంఘన, చట్టవ్యతిరేకం, అక్రమం అని థామస్ లబోదిబో అంటున్నాడు… మాజీ పోలీస్ అధికారి కూడా హక్కులు, చట్టవ్యతిరేకం, అక్రమం అని కేకలు వేస్తుంటే కాస్త విశేషంగానే ఉంది…
….(KVThomas)
ఇంకో పెద్ద కేరక్టర్ ఉంది… తనది కూడా కేరళే… పేరు శ్రీకుమార్… మాజీ ఐపీఎస్ అధికారి, నంబి మీద కేసు పెట్టినప్పుడు ఐబీలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉండేవాడు… తరువాత గుజరాత్ అల్లర్లకు సంబంధించి తప్పుడు నివేదికలకు పాల్పడ్డాడు… తవ్వితే చాలా కథలున్నాయి… ఈమధ్య ఏదో కేసు పెట్టి సెతల్వాద్‌తోపాటు ఈయన్ని కూడా అరెస్టు చేశారు… నంబి నారాయణన్ మీద కుట్ర కేసులో ఈ శ్రీకుమార్ ప్రమేయం ఎక్కువట… 75 ఏళ్ల వయస్సులో ఇప్పుడు తనను జైలులో పారేస్తే నంబి నారాయణన్ సంతోషం వ్యక్తం చేశాడు… ‘‘మంచి పనే… నన్ను మానసికంగా, శారీరకంగా బాగా హింసించాడు శ్రీకుమార్..’’ అని స్పందించాడు…
అవునూ, ఇంతకీ నంబి నారాయణన్ మీద కుట్ర చేసిందెవరు..? సహకరించిన మన పోలీస్ అధికారులు ఎవరెవరు..? కేంద్రంలో ఎవరి ఆదేశాల మేరకు..? సీఐఏ కుట్ర పన్నిందా..? ఇప్పుడు అవన్నీ బయటపడితే, అమెరికాతో సంబంధాలు దెబ్బతింటాయని భయపడుతున్నాడా మోడీ భాయ్..? లేక చైనా ప్రభుత్వం ఏమైనా ప్లాన్ చేసిందా..? పోనీ, అదే నిజమైతే అది బయటపెట్టడానికి ఏం భయం, ఏం సంకోచం..? మొత్తానికి ఈ మిస్టరీ విడిపోతుందా..? లేక నేతాజీ, లాల్ బహదూర్ శాస్త్రి మరణం కేసుల్లాగే ‘‘ఎప్పుడూ తేలని మిస్టరీ’’గా మిగిలిపోతుందా..?!
Share this Article