ఎర్ర పార్టీలు, ఎర్ర నాయకులు సొక్కమేమీ కాదు… బయటికి మస్తు నీతులు చెబుతారు… వినకపోతే నాలుగు కొట్టి మరీ బోధిస్తారు… చూడండి, మా చొక్కాలు ఏ మరకలూ లేని ఎరుపు తెలుసా అంటారు..? కానీ బోలెడంత బురద… కక్కుర్తి యవ్వారాలు, అసలు మెరిట్‌ను తొక్కేయడాలు, కొలువులు చక్కబెట్టుకోవడాలు గట్రా గుట్టుచప్పుడు గాకుండా కానిచ్చేస్తుంటారు… అదేమంటే, ఆధారాలు చూపిస్తే మళ్లీ నోట కూత పెగలదు…
కేరళలో ఓ కేసు గుర్తుంది కదా… స్వప్నా సురేష్ అనే ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఏకంగా సీఎం ఆఫీసులో శివశంకర్ అనే ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో ‘సంబంధాలు’ పెట్టుకుని ఆమె చెప్పిన పనల్లా చేసిపెట్టేవాడు… దుబయ్ నుంచి వచ్చే విదేశాంగశాఖ పార్శిళ్లలోనే బంగారాన్ని స్మగుల్ చేసేది ఆమె… నిజానికి కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన వ్యవహారం ఇది… ఇది బయటపడి నెలలు గడిచిపోతున్నా దర్యాప్తు అడుగు కదలడం లేదు…
సరే, దాన్ని కాసేపు పక్కన పెడితే ఓ తాజా కేసు చెప్పుకుందాం… ఇదీ కేరళ సీఎం పినరై విజయన్‌కు మరోరకంగా లింకున్న యవ్వారం… ఎందుకంటే..? కేకే రాగేష్ అని పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు… తరువాత సీఎం దగ్గర ప్రైవేటు సెక్రెటరీగా చేరాడు… ఆయన భార్య పేరు ప్రియా వర్ఘీస్… ఆమెకు ఈమధ్య కేరళ కన్నూరు యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు ఇచ్చారు… అసలు ఆమెకు అర్హతలే సరిగ్గా లేకపోయినా ఈ పోస్టింగ్ ఇచ్చారనేది ఆరోపణ…
Ads
మరి మాజీ ఎంపీ గారు, సీఎం పీఎస్ గారి భార్య… ఆమెకు అడ్డంకి ఏముంది..? కొలువులో చేరిపోయింది… కానీ ఆ యూనివర్శిటీలో విద్యార్థులు, అధ్యాపకులు కొందరు కలిసి ‘‘సేవ్ యూనివర్శిటీ క్యాంపెయిన్’’ పేరిట రచ్చ ఆరంభించారు… గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు… గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సదరు యూనివర్శిటీ వైస్ చాన్సిలర్ గోపీనాథ్ రవీంద్రన్ నుంచి వివరణ కోరాడు…
ఈలోపు సదరు గ్రూపు ఆర్టీఐ కింద ఈ కొలువుకు పోటీపడిన ఫైనలిస్టుల అర్హతలు, ఇంటర్వ్యూ మార్కుల వివరాలు కోరింది… అవి చూసి అందరూ షాక్… ఎందుకంటే..? సెకండ్ ర్యాంక్ వచ్చిన కేండిడేట్ పేరు జోసెఫ్ స్కారియా… తనకు 651 రీసెర్చ్ స్కోర్… ఈ ప్రియకు స్కోరో ఎంతో తెలుసా..? కేవలం 156 మాత్రమే… పైగా పబ్లిషైన రీసెర్చ్ ఆర్టికల్స్ సంఖ్య తక్కువ… టీచింగ్ అనుభవం కూడా తక్కువే… ఇక మరో కేండిడేట్ సి.గణేష్ స్కోర్ 645… ఐతేనేం, ఇంటర్వ్యూలో ప్రియకు ఫస్ట్ ర్యాంకు ఇచ్చేసి, యూనివర్శిటీలోని మలయాళం డిపార్ట్‌మెంట్‌లో కొలువు నీదేనమ్మా అనేసింది యూనివర్శిటీ సిండికేట్…
ఆమె త్రిసూర్‌లోని కేరళ వర్మ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేది… గత జూన్‌లో ఈ కొత్త కొలువులో చేరింది… ఇదండీ కథ… నిజానికి ఈ కొలువుకు పీహెచ్డీ కావాలి, ఎనిమిదేళ్ల టీచింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి… పీహెచ్డీ చేయడానికి తీసుకున్న మూడేళ్ల సెలవును కూడా టీచింగ్ ఎక్స్‌పీరియెన్స్‌లో కలిపేసిందట ఆమె… సో, ఏరకంగా చూసినా అర్థమయ్యేది ఏమిటంటే… నిజంగా అర్హత ఉన్న మరో అభ్యర్థికి అన్యాయం చేసి, అక్రమంగా ప్రియ వర్ఘీస్‌కు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు కట్టబెట్టారన్నమాట… యూనివర్శిటీ చాన్సిలర్‌గా గవర్నర్ ఉండాల్సిన పనిలేదని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు కత్తెరపెట్టడానికి ప్రయత్నిస్తుంటాయో అర్థమైంది కదా… ఇదుగో ఇలాంటి బాగోతాలకు అడ్డంకులు లేకుండా..!!
Share this Article