Gurram Seetaramulu………. అనగనగా ఒక తెల్దారుపల్లి . వీరోచిత వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన నేల అది. తమ్మినేని సుబ్బయ్య గారు అని గొప్ప ప్రజానాయకుడు ఉండేవాడు. దళాలకు బువ్వ పెట్టి ఆదుకున్నాడు. మా పక్క ఊరే. ఆ ఊరికి ఒకనాడు ఒక ప్రజా కంటక తురక జమీందారు ఉండేవాడు. రాబందులా ఎండిన డొంకలు, డొక్కల మీద ఎగబడ్డ ఆ జమీందారుని సాయుధ పోరాట కాలంలో తరిమేసారు
……. అని పుస్తకాలలో చదువుకున్నాము. అప్పటి ఆ నేత సుందరయ్య కూడా రాసాడు. ప్రజలు చైతన్యవంతం అయ్యారు . ఆ జమీందారు ఊరు వదిలి పారిపోయాడు. అక్కడ జనతా ప్రజాస్వామిక విప్లవ పునాదులు ఏర్పడ్డాయి. బి.టి రణదేవె పేర ఒక ‘పెద్ద’పార్టీ ఆఫీస్ కూడా కట్టుకున్నారు. ఊరంతా సిమెంట్ రోడ్లు, నల్లా నీళ్ళు, ప్రజలు సుఖంగా సౌఖ్యంగా ఉన్నారు.
గుడులు బడులు.., ఊరి పక్కనే కాళికామాత గుడి కూడా కట్టుకున్నారు. అంతా కులరహితంగా బ్రతుకుతున్నారు. పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పడిన రోజు నుండి అక్కడ ఎన్నికలు ఉండేవి కావు. ఒకరిని చూపిస్తే అతనే అక్కడ ప్రజా ప్రతినిధి. ఆ నేల నుండి ఒక నాయకుడు బయలు దేరాడు.
Ads
జిల్లా కార్యదర్శి మొదలు, MLA, MP, ఆఖరికి రాష్ట్ర కార్యదర్శి ,కేంద్ర కమిటీ కూడా అయ్యాడు. వామపక్ష రాజకీయాలలో దూకుడు మనిషి. ముందు చూపుతో పార్టీకి ఒక పేపర్ ఉండాలి , జనరంజకంగా ఒక టీవీ కూడా ఉంటే బాగుండు అనుకున్నాడు. ప్రజాధనం సమకూరింది. పెట్టుబడిదారీ సమాజంలో ప్రజా ప్రత్యామ్నాయ ఆలోచన ఒక విఫల ప్రయోగం అని భావించి, చివరకు ఆ ప్రజాధనాన్ని మై హోమ్, మాట్రిక్స్ ఆస్తుల్లో అవనతం చేశారు. అది చరిత్ర…
అక్కడ కేవలం ఒక జెండా మాత్రమే ఎగిరేది. వేరే జెండా వస్తే అది కబరస్థాన్ పాలు అయ్యేది. రాష్ట్రం మొత్తాన్ని గులాబీ అనే పెనుభూతం వెంటాడుతోందిగా. ఆ ఉదృతి ఆ ఊరికి కూడా వచ్చింది. పరిణామక్రమాన్ని ఎవరు ఆపగలరు ? ఈ మధ్య జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అక్కడి ప్రజలు తొలిసారి ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈసారి అక్కడ ఎర్ర జెండా గెలవలేదు. ఇంటి పార్టీ నీడ అయిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఆరు వందల మెజారిటీతో, అక్కడ తొలిసారిగా ప్రజలు గెలిచారు. ఇంకెవరన్నా ప్రజాస్వామ్యం గెలిచింది అంటారేమో నాకు తెలియదు…
ప్రజలు బూత్ కి వెళ్లి ఓటు వేసారు. అలా ప్రజలు గెలిపించిన తమ్మినేని మంగతాయారు భర్త తమ్మినేని కృష్ణయ్య ఈ రోజు అత్యంత కిరాతకంగా చంపబడ్డాడు. రెండు చేతులు నరికి పక్కన పడేసారు. ఈరోజు చంపబడ్డ తమ్మినేని కృష్ణయ్య శవాన్ని దగ్గరగా చూసా ఫ్యాక్షన్ తగాదాలలో కూడా అంత రక్తం పారి ఉండదు. రక్తానికి రక్తం… ఈ రక్తంలో మరిగిన ఎర్రజెండా మరింత పదును ఎక్కొచ్చు…
జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో ఉండే ఆ ఊరు విస్తరిస్తూ జాతీయ రహదారి దిశగా కదులుతోంది. కిక్కిరిసే దర్బార్లు. ఒకనాటి ఆ జమీందారు కూడా కుళ్లుకునేంత పెద్ద భవనాలు అక్కడ మొలిచాయి. ఇంటి ముందు సింపుల్ గా బెంట్లీ కారు . ఆ ఊరిలో రాయికి కూడా వర్గ స్పృహ ఉంటది. ఆ రాయి తొలిసారి బెంట్లీ మీద పడ్డది. బి.ఎం.డబ్ల్యు తుక్కు తుక్కు అయ్యింది. మార్పు మంచిదే…
Share this Article