నాలుగైదు రోజులు అయ్యిందేమో… కుర్చీ మీద ప్రేమతో నితిశ్ కుమార్ మళ్లీ క్యాంపు మార్చి, మళ్లీ ఆర్జేడీ పంచన చేరి, మళ్లీ చేతులు కలిపి, ఆర్జేడీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి, తన ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకుని, ఊపిరి పీల్చుకున్నాడు… ఒకప్పుడు సుశాసన్‌బాబు అనిపించుకున్న ఈ పెద్దమనిషి పదిహేడేళ్ల పాలనలో, ఎనిమిదిసార్లు సీఎం… ఐనా ఈరోజుకూ అది బీమారు రాష్ట్రమే… మానవాభివృద్ది, జీవననాణ్యత సూచికల్లో సోమాలియాతో పోటీయే… ఈ దిక్కుమాలిన పాలనలో బీజేపీ పాత్ర కూడా ఉందండోయ్… దానికీ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ పట్టలేదు…
ఎప్పుడైతే తను ఆర్జేడీతో చేతులు కలిపి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాడో బీహార్‌లో మళ్లీ ఓ దడ… నాటి గూండారాజ్ మళ్లీ వచ్చేసినట్టేనా..? ఉత్తరప్రదేశ్‌లో అఖిలేషుడి పాలనలో ఎస్పీ మూకల అరాచకంలాగే, మళ్లీ బీహార్‌లో ఆర్జేడీ గ్యాంగుల దాదాగిరీ స్టార్టయినట్టేనా..? మీడియాలో బోలెడు వార్తలు ఇదేకోణంలో వచ్చాయి… ఎందుకంటే..? ఆరోజునే ఓ టయోటా కార్ షోరూంను దుండగులు లూటీ చేశారు… 12 మంది గ్యాంగ్ ఆ ప్రైవేటు సెక్యూరిటీ గార్డును కత్తులతో పొడిచారు… చంపేశారు… ఇంకో గార్డును కట్టేసి చితకకొట్టారు…
ఆరు ల్యాప్‌టాపులు, లక్షల నగదు ఎత్తుకుపోయారు… ఇది నేషనల్ హైవే పక్కన, ఓ టోల్ ప్లాజా దగ్గరే ఉంటుంది… ఓచోట ఒక జర్నలిస్టు కాల్చి చంపబడ్డాడు… నిజానికి వాళ్లు సాయుధులైన దోపిడీదొంగలు… పార్టీలతో సంబంధం లేదు… జరిగిన సంఘటన కూడా అర్ధరాత్రి… కానీ మీడియా రిపోర్టింగ్ మాత్రం ఇక లాలూ కాలంనాటి గూండారాజ్ మళ్లీ వచ్చేసిందన్న కోణంలో సాగింది… మరి లాలూ పాలనలో కులం, నేరం పాత్ర అంత భీకరంగా ఉండేది… కొన్ని మీడియా సంస్థలు నాడు లాలూ బిడ్డ పెళ్లికి లాలూ బంధు, అనుచరగణం సాగించిన బజారు రౌడీయిజాన్ని మళ్లీ ఫోకస్ చేయడానికి ప్రయత్నించాయి…
Ads
అవునూ, అప్పుడేం జరిగింది..? తనకు తొమ్మిది మంది పిల్లలు… ఇద్దరు కొడుకులు, ఏడుగురు బిడ్డలు… (చిన్న బిడ్డ రాజలక్ష్మిని యూపీ ములాయంసింగ్ యాదవ్ కుటుంబానికి చెందిన తేజప్రతాప్‌సింగ్‌యాదవ్‌కు ఇచ్చాడు… ఆయన సమాజవాదీ మాజీ ఎంపీ)… ఇప్పుడు మీడియా చెప్పేది ఆయన రెండో పెద్ద బిడ్డ రోహిణి పెళ్లి గురించి… 2002లో జరిగింది… లాలూ గూండారాజ్ పీక్స్‌లో ఉండేది ఆరోజుల్లో…
పెళ్లికి ముందురోజు… లాలూప్రసాద్ బావమరిది సుభాష్ ప్రసాద్ యాదవ్‌కు చెందిన గ్యాంగులు పలు కార్ల షోరూంలపై దాడులు చేశాయి… మిథిల మోటార్స్, కర్లో ఆటోమొబైల్స్, ఆషియానా హోల్డింగ్స్, లాలీ అండ్ సేన్, దేవూ మోటార్స్, గినియా మోటార్స్ ఎట్సెట్రా… పెళ్లికి వచ్చే వీఐపీ అతిథుల కోసం 45 బ్రాండ్ న్యూ ప్రీమియం కార్లను బలవంతంగా ఎత్తుకుపోయారు… అడ్డగించినవాళ్లను చితకబాదారు… పాట్నాకు 35 కి.మీ దూరంలోని టెల్కో గోదామ్ నుంచి రెండు టాటా సఫారీలు, మూడు టాటా సుమోలు పట్టుకుపోయారు… లోకల్ పోలీసులు కూడా సహకరించారుట…
షాపుల్లోకి జొరబడి 100 సోఫాసెట్లు, డిజైనర్ సూట్లు, దుస్తులు కూడా ఎత్తుకుపోయారు… రేమాండ్స్ ఎక్స్‌క్లూజివ్ షోరూం ప్రధానంగా దాడికి గురైంది… చివరకు ఎంత నీచం అంటే… పళ్ల దుకాణాలు, బేకరీలు, మిఠాయి షాపుల మీద దాడులు చేసి 50 కిలోల డ్రైఫ్రూట్స్, చాకొలేట్స్ తీసుకుపోయారు… ఆ దశాబ్దకాలంలో లాలూ గ్యాంగుల ధాటికి కనీసం 10 వేల మంది వ్యాపారులు తమ వ్యాపారాల్ని మానుకుని, రాష్ట్రం వీడి వెళ్లిపోయారని అంచనా…
లాలూ మరో బావమరిది పేరు అనిరుధ్ ప్రసాద్ అలియాస్ సాధు యాదవ్… బోలెడంత నేరాల చిట్టా తనది… ఒకసారి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ… తరువాత బావతో పడలేదు… జనఅధికార పార్టీ, కాంగ్రెస్, మధ్యలో కొన్నిరోజులు గరీబ్ జనతాదళ్ అని సొంత పార్టీ… ప్రస్తుతం బీఎస్పీ… ఓసారి అక్క రబ్రీదేవి మీదే పోటీచేశాడు… ఇక బజారు రౌడీయిజానికి పాల్పడ్డ బావమరిది సుభాష్ ప్రసాద్ యాదవ్ మొదట్లో సెక్రెటేరియట్‌లో గుమస్తా… రబ్రీదేవి సీఎం కాగానే, ఆమెకు సహకరించడం కోసం ఆర్జేడీలో చేరాడు… ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి రాజ్యసభ సభ్యుడు… తన సొంత బంధుగణం సాగించిన అరాచకాల చిట్టా తీస్తే అదెంత పెద్ద పుస్తకం అవుతుందో చెప్పలేం…
ఇదంతా సరే, మీడియా ఎక్స్‌పోజ్ చేస్తోంది లాలూ పాతరోజుల్ని… ఇదంతా నితిశ్, తేజస్వి యాదవ్ అక్రమ కలయికను బదనాం చేయడానికే… కానీ తేజస్వియాదవ్‌ను ఆనాటి గూండారాజ్ వారసుడిగా ఫోకస్ చేయడం కరెక్టేనా..? తను ఓ స్కూల్ డ్రాపవుట్… కులం సరేసరి, కానీ దెబ్బతిన్న పార్టీని చక్కదిద్దుకుని, ఇతర సెక్యులర్ పార్టీల్ని కలుపుకుని కాస్త హూందా రాజకీయమే ప్రదర్శిస్తున్నట్టు చెబుతుంటారు మరి…!!
Share this Article