అవును, అందుకే తను సూర్య… దటీజ్ సూర్య… నిజానికి ఎప్పుడూ తను ఓ మట్టిముద్ద… ఏదైనా మంచి పాత్ర దొరికిందీ అంటే, అచ్చం ఆ పాత్రలా తనను తాను మలుచుకుంటాడు… చాలా మంది స్టార్ హీరోలతో పోలిస్తే తన మొహంలో భావోద్వేగాలు సరిగ్గా పలుకుతాయి… కష్టపడతాడు… గజిని దగ్గర్నుంచి ఎన్ని చూశాం… ఎన్ని చప్పట్లు కొట్టాం… మరోసారి… ఈసారి ఆకాశం నీ హద్దురా సినిమా గురించి… రియల్ స్టార్ హీరో…
తను నిజంగానే వ్యాపారవేత్త… చాలా వ్యాపకాలున్నయ్… రాజకీయ సంబంధాలున్నయ్… కానీ తనలోని నటుడిని వాటితో ప్రభావితం కానివ్వలేదు… ఒక్కసారి స్టార్ట్, యాక్షన్ అనగానే జస్ట్, నటుడు… అంతే… డిజిటల్ రిలీజులపై థియేటర్ల సంఘం బెదిరించినప్పుడు కూడా హీరోగానే నిలబడ్డాడు తప్ప పారిపోలేదు… భార్యకు కూడా భరోసాగా నిలబడి ప్రోత్సహించాడు… ఇప్పుడు ఏకంగా ఈ సినిమాకు నిర్మాత తనే… నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశాడు…

ఆకాశం నీ హద్దురా సినిమా పేరు… సూరారం పొట్రు… తమిళ ఒరిజినల్ పేరు… దర్శకురాలు కొంగర సుధ… తెలుగు మహిళ… హీరో సూర్య… తల్లి ఊర్వశి… మరో పాత్ర మోహన్‌బాబు… అంతే… మిగతాదంతా అరవమే… కానీ ఈ సినిమా మనల్ని ఎందుకు ఆకట్టుకుంటుందో చెప్పుకోవాలి… కొన్ని పాయింట్లున్నయ్… సూర్య గురించి వదిలేస్తే…

సాధారణంగా మన సినిమాల్లో, మరీ ప్రత్యేకించి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లు ఉత్త పిచ్చి మొద్దులు… చంకలు, బొడ్డు, తొడలు చూపిస్తూ ఎగిరితే చాలు… హీరోలు కార్చుకునే సొల్లు తెర నిండా ఆక్రమించుకుంటుంది… కానీ ఈ సినిమాలో హీరోయిన్ అపర్ణ పాత్ర బాగుంది… తను స్వతహాగా వ్యాపారి… సొంతంగానే నిర్వహించుకుంటుంది… భర్త ప్రభావం పడనివ్వదు… తనకు సపోర్టుగా ఉంటూనే, తన వ్యాపారం, తన వ్యాపకాన్ని ఇగ్నోర్ చేయదు…

ఎక్కడా అశ్లీలం జోలికి పోలేదు సినిమాలో… పైగా రొటీన్ ఫార్ములా బాపతు సీన్ల జోలికి కూడా పోలేదు… భార్యాభర్తల నడుమ సన్నివేశాలు కూడా స్టీరియోఫోనిక్ ధోరణులకు భిన్నంగా కనిపిస్తాయి… రిలీఫ్… కాకపోతే సూర్యకు డబ్బింగ్ ఎవరో గానీ… బాగా ఇబ్బంది పెట్టింది… అసలే సూర్య, ఆపై అపర్ణ… ఆ సీన్లు ప్లజెంటుగా ఉంటయ్…

బయోపిక్ అంటేనే ఓ రిస్క్… అందులోనూ ఓ వ్యాపారి బయోపిక్… ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ బయోపిక్ ఇది… ఓ పల్లెటూరు నుంచి ఓ ఎయిర్ లైన్స్ అధినేతగా ఎదిగే క్రమం… అందులోనూ ‘‘రూపాయికే విమానప్రయాణం’’ అనేది మామూలు నినాదమా..? ఆ లెవల్‌కు తన ప్రస్థానం చెప్పాలంటే బిజినెస్ పరిభాషలో చెప్పొచ్చు… తనే ‘సింప్లి ఫ్లై’ అని రాసుకున్నాడు ఓ పుస్తకాన్ని… దాన్ని ఆధారంగా తీసుకున్నప్పుడు ఇక దర్శకురాలు, స్క్రిప్ట్ రైటర్‌కు క్రియేటివ్ లిబర్జీ తీసుకునే చాయిస్ తక్కువ… ఐనా సరే, ఈ కథను సినిమా పరిభాషలోనే సామాన్య ప్రేక్షకుడినీ కనెక్టయ్యేలా చెప్పడంలో దర్శకురాలిదే శ్రమ… తన ప్రయాసలో తను విజయం సాధించింది…

కాస్త రొమాన్స్, కాస్త పగ, కాస్త ప్రతీకారం, కాస్త కామెడీ, కాస్త యాక్షన్…. ఇదేనా సినిమా అంటే..? కాదు… కాదని చెబుతుంది ఈ సినిమా… ఒక సంకల్పాన్ని సాకారం చేసుకునే క్రమంలో పడే అవస్థలు, కష్టాలు… అధిగమించడానికి పడే తిప్పలు… దీన్నే ఓ కమర్షియల్ సినిమాగా చేయడం అంత వీజీ కాదు… కానీ నిర్మాత కమ్ హీరో సూర్య, డైరెక్టర్ కొంగర సుధ అది చేసి చూపించారు… నిజానికి ఈ సినిమా థియేటర్లలో గనుక రిలీజయ్యే పరిస్థితులు ఉండి ఉంటే… సినిమా రేంజ్ ఇంకా ఎక్కువగా ఉండేది… హీరో హీరోయిన్లు, దర్శకురాలికి ఇంకా ఎక్కువ ఎలివేషన్ దొరికి ఉండేది…

మన సిస్టమ్ లో ఉన్న లోపాల్ని కూడా టచ్ చేయడం, కొత్త ఆలోచనలకు అడ్డు పడే పాత కలల బేహారులు.. బ్యూరోక్రాట్లు, పాలసీలను చెబుతూ… వాటిని అధిగమించి తీరు చూపించడం బాగుంది…
Ads
ఒక రెబల్, ఒక ఊరోడు, ఒక ఆవేశపరుడు… నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉద్యోగిగా… చివరకు ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మాగ్నెట్ గా ఎదిగే క్రమాన్ని, ఆ సంకల్పానికి కారణమైన ఓ విషాదాన్ని… తన ఆలోచనల్ని, అడుగుల్ని సగటు మనిషి ప్రయోజనం కోణంలో రక్తికట్టేలా చూపడం… అదే సమయంలో హీరోయిజం, ఒక పెద్ద హీరోను అదే రేంజులో… పిచ్చి ఫైట్లు, కామెడీ ట్రాకులు, ఐటం సాంగ్స్ గట్రా లేకుండానే చూపడం పెద్ద టాస్క్… చాలా పెద్ద టాస్క్… ముందుగా సూర్య అభినందనీయుడు… ఈ పాత్రను తనే చేసినందుకు, సినిమా తీసినందుకు… తరువాత కొంగర సుధ… తను సక్సెసైంది… ఆరు వేళ్ల తండ్రి మళ్లీ అమ్ముగా పుట్టడం వంటి చిన్న చిన్న ఎమోషనల్ సీన్లను కూడా పెట్టినందుకు…!!
Share this Article