తెలుగు టీవీలను కాసేపు వదిలేద్దాం… మరోసారి చెప్పుకుందాం… ట్యాంపరింగుకు అతీతం కాకపోయినా వాటి మంచీచెడూ కొలవడానికి బార్క్ రేటింగ్స్ వస్తుంటయ్ వారంవారం… మరి పత్రికలు, వాటికి అనుబంధంగా ఉండే వెబ్‌సైట్లు… వాటి పరిస్థితేమిటి..? అసలు పాఠకుడు దేన్ని విశ్వసిస్తున్నాడు..? దేన్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు..? ఏది విశ్వసనీయ పత్రిక..? పోనీ, ఏ వెబ్‌సైట్‌ను పాఠకుడు ఆదరిస్తున్నాడు..? ఎందుకు..?
ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలే… గతంలో ఏబీసీ అనే సిస్టం ఉండేది… ఏ పత్రిక ఎన్ని కాపీలు అమ్ముతున్నదో ఆడిట్ చేసి, ఓ పద్ధతి ప్రకారం లెక్కకట్టేది… వాణిజ్యసంస్థలు తమ యాడ్స్ ఇవ్వడానికి కూడా ఆ ఏబీసీ అంకెల్నే ప్రామాణికంగా తీసుకునేవాళ్లు… అందులోనూ కొంత దందా ఉంటుందని అంటారు… కానీ ఇప్పుడు అదీ రావడం లేదు… కరోనా కాలంలో ఆగిపోయింది, తాజా ఏబీసీ రిపోర్ట్ ఎప్పుడో ఎవరూ చెప్పలేని స్థితి… ఐఆర్ఎస్ కూడా అంతే… అదీ ఆగిపోయింది… పత్రికల ఆదరణ స్థాయి తేల్చడానికి అదొక కొలమానం… అదెప్పుడొస్తుందో చెప్పలేం…
సరే, పత్రికల పట్ల పాఠకాదరణ వాటి వెబ్‌సైట్ల ట్రాఫిక్‌లో కూడా రిఫ్లెక్టవుతుంటుంది… పైగా ఇప్పుడు ప్రింట్ కాపీల కొనుగోళ్లు తగ్గిపోయి, ఆయా పత్రికల ఈ-పేపర్లను, వెబ్‌సైట్లను, యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు పాఠకులు… సో, మనం తెలుగు పత్రికల స్థితినీ, గతినీ వాటి వెబ్‌సైట్ల ట్రాఫిక్, ర్యాంకింగ్స్, ఇతర టెక్నికల్ అంశాల్లో పరిశీలిద్దాం ఓసారి… పాఠకాదరణ ఎవరికి ఎంతో అంచనా వేయడానికి ఇది కూడా ఓ కొలమానమే…
Ads
అయితే గతంలో అలెక్సా అని పాపులర్ ర్యాంకింగ్ వెబ్‌సైట్ ఉండేది… ఏ సైట్ ర్యాంక్ ఏమిటో చెప్పేది… తరువాత కాలంలో దాని అంకెల్ని కూడా ట్యాంపర్ చేయడం (ట్వీక్) ఈజీ అయిపోయింది… సో, దాని ర్యాంకుల విశ్వసనీయత పోయింది… కొంతకాలంగా అది మొత్తానికే ఆగిపోయింది… మరి ఇప్పుడు దేన్ని కొలమానంగా తీసుకుందాం… సరే, సిమిలర్‌వెబ్ అనే ర్యాంకింగ్, వెబ్‌సైట్ల విశ్లేషణ సైట్ చూద్దాం… మజ్జిగ ఏమిటో, పెరుగు ఏమిటో తేలిపోతుందిగా… ఏబీసీ లేదు, ఐఆర్ఎస్ లేదు, అలెక్సా లేదు… కానీ ఇదొక కొత్త కొలమానం…
పైన చార్ట్ చూడండి… నాలుగు తెలుగు దినపత్రికల్ని పరిశీలనకు తీసుకున్నాను… మిగతా పత్రికల సైట్ల ర్యాంకులు, ట్రాఫిక్ చూశాక వాటిని అసలు కంపారిజన్‌లోకి తీసుకోవడమే వేస్ట్ అనిపించింది… సో, ఆ మిగతా పత్రికలను వదిలేద్దాం… వాటి ప్రభావమూ తక్కువ, వాటికి పాఠకాదరణ కూడా తక్కువే… ఈ-పేపర్లు కూడా అంతే…
మే నుంచి జూలై వరకు అంకెల్ని చూస్తే… ఆంధ్రజ్యోతి 5.3 మిలియన్లు, ఈనాడు 24.4 మిలియన్లు, సాక్షి 5.9 మిలియన్లు, నమస్తే మిలియన్ లోపు విజిట్స్ కనిపిస్తున్నాయి… అంటే ఈనాడు మిగతా పత్రికలన్నా చాలా ముందంజలో, మిగతావాళ్లు అసలు అందుకోలేనంత దూరంలో ఉంది… సో, ఇప్పటికీ ఈనాడు ఈనాడే… దాని విజిట్స్‌తో పోలిస్తే సాక్షి గానీ, ఆంధ్రజ్యోతి గానీ పావు వంతు లేవు… వాటి అసలైన సత్తా అదీ, వాటి పట్ల పాఠకుల విశ్వసనీయత, ఆదరణ రేంజ్ అది… ఇక నమస్తే గురించి చెప్పడానికి ఏమీ లేదు… నిజానికి కంపారిజన్‌లోకి వచ్చే సీన్ కూడా లేదు దానికి ఇప్పుడు…
మొబైల్‌కన్నా డెస్క్‌టాప్ వీక్షణల్లోనూ ఈనాడే టాప్… అంటే ఇళ్లల్లో వృద్ధులు, ఆడవాళ్లు ఈనాడునే అధికంగా చదువుతున్నారని తద్వారా ఓ అంచనా… ర్యాంకు విషయానికి వస్తే ఈనాడు 151, జ్యోతి 379, సాక్షి 351… ఈనాడు చాలా చాలా బెటర్ పొజిషన్… ఇతర అంశాల్ని పరిశీలించినా సరే, ఈనాడు చాలా చాలా ముందంజ… నెలలవారీ విజిట్స్, యూనిక్ విజిటర్స్, ఒక్కొక్క విజిట్ డ్యురేషన్, సగటున ఎన్ని పేజీలు చూస్తున్నారు, బౌన్స్ రేటు ఎట్సెట్రా ఏ అంశం తీసుకున్నా ఈనాడే బెటర్… విజిట్ సగటు పేజీల వీక్షణం, బౌన్స్ రేటు విషయంలో సాక్షి బెటర్… బౌన్స్ రేటు కోణంలో ఆంధ్రజ్యోతి ఘోరం…
స్వతహాగా ఈనాడు తెలుగుదేశం పత్రికే, ఎవరికీ అందులో డౌట్ లేదు, నిష్పక్షపాత పత్రిక అనే సర్టిఫికెట్ ఎవరిచ్చినా అది ఫేక్… కాకపోతే అది మరీ ఆంధ్రజ్యోతిలాగా బట్టలు విప్పి బజారులో పోతురాజులాగా కొరడాలతో కొట్టుకోదు… కాస్త తలుపుచాటుగా నిల్చుని, కన్నుకొట్టి పిలిచే రకం అది… సాక్షిది కూడా బట్టబయలు వ్యవహారమే… జగన్ దాన్ని ఎప్పుడో వదిలేశాడు, దానికి ప్రస్తుతం ఓ దశ లేదు, ఓ దిశ లేదు… నమస్తే గురించి ఈ ప్రస్తావన కూడా అనవసరమేమో… టీఆర్ఎస్ డప్పు మినహా ఏమీ లేకపోవడం దానికి మైనస్…
వెరసి, పార్టీల రంగులు పూసుకున్న పత్రికల్ని జనం పట్టించుకోవడం లేదు… న్యూట్రల్ ముసుగు వేసుకుని, నేను పత్తిత్తును అని చెప్పుకోవడానికి పదే పదే ప్రయత్నించే ఈనాడునే ఇంకా పాఠకులు నమ్ముతున్నారు…!! మరి మిగతా పత్రికల సంగతి ఏమిటీ అంటారా..? సారీ…!!
Share this Article