తెలుగు దిగ్దర్శకుడిగా పేరొంది, ఒకప్పటి స్టార్ హీరోలందరికీ సూపర్, బంపర్ హిట్స్ ఇచ్చిన రాఘవేంద్రరావు ప్రస్తుత ఆలోచన సరళి, వెళ్తున్న బాట తన మీద జాలేసేలా ఉంటోంది… ఎనభయ్యేళ్ల వయస్సులో తను ఎంత ఆదర్శంగా ఉండాలి ఈ తరానికి..? ఫాఫం… కొందరు అంతే… వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా చూస్తుంటే రాఘవేంద్రరావు మీద జాలివేయడం మినహా ఇంకేమీ ఫీలింగ్ కలగదు… జస్ట్, జాలి, సానుభూతి…
ఈరోజుకూ రాఘవేంద్రరావు అనగానే జనం బొడ్డు-పండు అని వ్యాఖ్యానిస్తుంటే దాన్ని గొప్పతనంగా ఫీలయ్యే కేరక్టర్ అది… ఈ వయస్సులోనూ సినిమాల్లో నటిస్తూ, సమర్పిస్తూ యాక్టివ్‌గా ఉన్నందుకు అభినందించాలా..? తన కీర్తికి, తన చరిత్రకు మరింత మెరుపు అద్దేలా ఓ రిమార్కబుల్ సినిమా తీయలేని తన టేస్టును జాలిగా చూడాలా..? మొన్నామధ్య పెళ్లిసందD అనే ఓ చెత్తా సినిమా తీశాడు… ఇప్పుడైతే తనే ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకుని, బోలెడుమంది కమెడియన్లను వెంటేసుకుని మరో చెత్తాను థియేటర్లలో వదిలాడు…
చెత్త అన్నందుకు కోప్పడకండి… అసలు దీన్ని సినిమా అనాలా..? ఈటీవీలో వచ్చే జబర్దస్త్ అనే బూతు కామెడీ షో, మాటీవీలో వచ్చే కామెడీ స్టార్స్ అనే మరో డూప్లికేట్ జబర్దస్త్ షో స్కిట్లను ఒక్కచోట కలిపి కుట్టేసినట్టుంది సినిమా… ఈ పిచ్చి సినిమా బదులు ఏదైనా టీవీలో గానీ, ఓటీటీలోగానీ కామెడీ షో చేయవచ్చు కదా… అసలే థియేటర్లకు రావాలంటే జనం భయపడి చస్తున్నారు… ఈ సమయంలో టీవీ ప్రోగ్రాముల్లాంటి ఓ పెద్ద స్కిట్‌ను సినిమా పేరిట విడుదల చేయాలా..? ఫాఫం బొడ్డు రాఘవేంద్రరావు… ఈ వయస్సులో ఈ చెడ్డపేరు అవసరమా నీకు..?
Ads
ఒకరా ఇద్దరా..? పదుల సంఖ్యలో కమెడియన్లు, ఆర్టిస్టులు ఉన్నారు… అందులో అధికశాతం జబర్దస్త్ కమెడియన్లే… కొందరు మాత్రం సినిమా కమెడియన్లు… గుర్తున్నకాడికి రాస్తాను… సునీల్, శ్రీమతి అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, బ్రహ్మానందం, రఘుబాబు, అనంత్, పుష్ప జగదీష్, నిత్యా శెట్టి, వసంతి, విష్ణు ప్రియ, హేమ, షకలక శంకర్, తనికెళ్ల భరణి, ఆమని, థర్టీ ఇయర్స్ పృథ్వీ ఎట్సెట్రా ఎట్సెట్రా ప్లస్ రాఘవేంద్రరావు…
వీళ్లను చూస్తుంటే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ గుర్తొస్తుంది… థియేటర్ వదిలి, ఓ జిందాతిస్మాత్ కొందామని మెడికల్ షాపు వెళ్లేలోపు ఈ సినిమాలో పాటలూ గుర్తురావు… ఎవరు ఎవరితో జతకట్టారో, అసలు సినిమా కథేమిటో కూడా గుర్తుండదు… నిజానికి ఇంతమంది కమెడియన్లను ఒక్క కథలో ఇరికించడం చాలా పెద్ద టాస్క్… ఈ దర్శకుడి పేరు గుర్తులేదు గానీ అందులో అట్టర్ ఫెయిల్… పైగా అక్కడక్కడా స్కిన్ షోలు… అప్పట్లో ఈవీవీ సినిమా వచ్చింది, పేరు ఎవడిగోల వాడితే… ఈ సినిమా కూడా అంతే…
ఎవడి గోల వాడిదే… సునీల్ అనే పాతకాలం కమెడియన్ జైలు నుంచి పారిపోతాడు, తనను పట్టుకుంటే కోటి రూపాయలు ఇస్తామని ప్రకటిస్తారు… ఇక అందరూ రంగంలోకి దిగుతారు… చివరకు ఏం జరుగుతుందనేది కథ… నిజానికి ఇందులోని ఆర్టిస్టులు వ్యక్తిగతంగా మంచి మెరిట్ ఉన్నవాళ్లు… మంచి టైమింగు ఉన్నవాళ్లు… కానీ సరిగ్గా వాడుకుంటే కదా… రాఘవేంద్రరావు తాతగారూ… ఓ చిన్న ఐడియా… ఈ థియేటర్లలో వర్కవుట్ కాదు గానీ… అదే ఈటీవీ వాళ్లతో మాట్లాడి (మీ దోస్తులే కదా…) నాలుగైదు వారాలపాటు జబర్దస్త్ షో బదులు ఇదే ప్రసారం చేస్తే బెటరేమో… యాడ్స్ డబ్బు చెరిసగం..!!
Share this Article