ఏవగింపు… వెగటు… జలదరింపు… ఈ పదాలకు మించి ఇంకా ఏమైనా ఉంటే గుర్తుకుతెచ్చుకొండి… మన పెళ్లి వేడుకల్ని ఎటు తీసుకుపోతున్నామో తలుచుకుని సిగ్గుపడదాం అందరమూ… ప్రివెడ్ షూట్లు మరీ నీచమైన ధోరణుల వైపు వెళ్తున్నాయి… ఉదాహరణగా బోలెడు ఫోటోలు… అసలు ఈ తలతిక్క పైత్యాలకన్నా రిజిష్టర్ మ్యారేజీలు, స్టేజ్ మ్యారేజులు, సింపుల్‌గా గుళ్లల్లో పెళ్లిళ్లు చాలా చాలాా బెటర్ కదా… ఈ ఫోటో చూడండి ఓసారి…
ఇది ప్రి వెడ్ షూటట… ఆదిమమానవుల కాన్సెప్టు అనుకుంటా… ఇంకాస్త ముందుకెళ్తే, ఇంకా ఎక్కడికి తీసుకుపోతారో ఈ ట్రెండ్‌ను… ప్రి వెడ్ మాత్రమేనా..? ప్రి డ్యాష్ డ్యాష్ దాకా తీసుకుపోతారా..? అసలు మధ్యతరగతి పేరెంట్సే దీనికి కారణం… ఒకడినిచూసి ఒకడు… అప్పులు తెచ్చయినా సరే, ఈవెంట్లు, ప్రి వెడ్ ఖర్చుల దాకా వెళ్తున్నారు…
Ads
అసలు పెళ్లి తంతును వీడియో గ్రాఫర్లు, ఫోటో గ్రాఫర్లు ఎప్పుడో హైజాక్ చేశారు,.. జరిగిన తంతును షూట్ చేయడం కాదు, తాము చెప్పినట్టు తంతు నడవాలి… డబ్బుల కోసం ఇక స్పెషల్ ఫోటో షూట్లు, ప్రి వెడ్ షూట్లు వంటివి పుట్టుకొచ్చాయి… అది చేయించుకోకపోతే అసలు పెళ్లే కాదన్నట్టుగా తయారైంది పరిస్థితి…
సరే, డబ్బున్న మారాజులు తమ సంపద ప్రదర్శన కోసం పెళ్లి వేడుకలకు ఎంత కర్చయినా పెడతారు… అట్టహాసం, ఆడంబరం ప్రదర్శిస్తారు… వాడి డబ్బు వాడిష్టం అనుకుందాం… రోకా, ఎంగేజ్మెంట్, హల్దీ, మెహెందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్… మనది కాని సంప్రదాయాల్ని తెచ్చుకుని మరీ అతిశయాలు పోతున్నారు… కాలరెగరేస్తున్నారు… అసలు ఈ సంగీత్ ఎక్కడిది..? ఈ మెహెందీ ఫంక్షన్ ఎక్కడిది..? తెలుగు పెళ్లి సంస్కృతిలోకి ఎందుకు జొప్పిస్తున్నారు..? వాళ్లను చూసి మధ్యతరగతి వాడు వాతలు ఎందుకు పెట్టుకోవాలి..? ఈ ప్రి వెడ్ కూడా అలాంటిదే…
కొన్ని జాతరల్లో తెలుగు సినిమా బూతు పాటలకు రికార్డింగు డాన్సులు చేస్తారు కదా… అదిగో మన పెళ్లిళ్లలోనూ ఆ సంస్కృతి వచ్చేసింది… సంగీత్ అని కార్యక్రమం పెట్టి, ప్రత్యేకంగా డాన్సులు నేర్పించుకుని, బూతు పాటలకు గంతులేయడం ప్రజెంట్ కల్చర్… ఇదేం దరిద్రంరా అనడిగితే వాడికి తన్ని తరిమేసేంత పిచ్చి ఇప్పుడు…
ప్రి వెడ్ షూట్లకే వద్దాం… కచ్చితంగా ఇది సగటు పెళ్లికూతురు తండ్రికి భారమే… ఖర్చు మాట అటుంచితే ఈ పెడపోకడలు ఏమిటి..? పిల్ల, పిల్లగాడి నడుమ కాస్త సాన్నిహిత్యం కోసం పెళ్లిళ్లలో బిందెలో ఉంగరం, ఆకులుపోకలు వంటివి ఆడిస్తారు… ఇప్పుడవన్నీ ఎందుకు..? ఇలా నగ్నంగా అలుముకుని ఫోటోలకు ఫోజులే ఇస్తుంటే..?
ఈ పైత్యపు షోటో షూట్లకు, వింత కాన్సెప్టులతో ఆమధ్య ఎవరో ప్రమాదానికి గురైనట్టు కూడా వార్తలు చదివాం… అయినా సరే, ఈ పైత్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికే ఈవెంట్ మేనేజర్లు నిర్ణయించినట్టుంది…
కరోనా దెబ్బకు అతిథుల సంఖ్య తగ్గిపోయింది… ఇప్పుడంతా వాట్సపులో శుభలేఖలు లేదా మెసేజులు పంపించడమే… మరీ మొహమాటం, మర్యా,ద, సర్కిల్ గట్రా ఆలోచించేవాళ్లయితే పెళ్లిరోజే ప్రత్యేకంగా పెళ్లిభోజనం బుట్టలు పంపించేస్తున్నారు ఇళ్ల వద్దకు… బుట్ట మీద శానిటైజర్ చల్లుకుని, వధూవరులను మనసులో ఆశీర్వదించి కడుపు నిండా మెక్కడమే… నిజానికి ఇది చాలా బెటర్… కర్చయినా సరే, కడుపు నింపుతుంది… బంధాల్ని నిలుపుతుంది…
కానీ ఈ వెధవ ట్రెండీ ఫోటో షూట్లతో వచ్చేదేముంది…? ‘‘జీవితంలో ఒకేఒక పెద్ద మొమరబుల్ ఈవెంట్, ఖర్చుకు భయపడితే ఎలా సార్..?’’ ఈ ఒక్క డైలాగుతో పిల్లలు, పెద్దలు పడిపోతున్నారు… గతంలో పెళ్లి బాగా జరిగింది అని చెప్పడానికి వచ్చిన అతిథుల సందోహం, మంచి భోజనాల్ని చెప్పేవాళ్లు… ఇప్పుడు అవన్నీ జాన్తా నై… ‘‘చేతనైనవాడే ఖర్చుపెట్టుకుంటాడు, మీకేం తీట..?’’ ఈ సమర్థనతో వ్యతిరేకించే అందరి నోళ్లూ మూతపడుతున్నయ్…
Share this Article