ఈ బీజేపీ వాళ్లకు పనిలేదు, పాటలేదు… ఎప్పుడూ బట్టకాల్చి మీద వేయడమే తెలుసు… అరె, అభివృద్ధికి సహకరించకుండా, ఎప్పుడూ బురదజల్లుడు రాజకీయాలేనా..? ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు… ఫాఫం, 74 ఏళ్లు… ఆ సీఎం నీతిశ్ బీజేపీ ఏదో చేస్తుందని గజ్జున వణికిపోయి, ఈ పాము పక్కలో చేరాడు… ఐనాసరే, నీకెందుకు భయం, నేనున్నాను కదాని అభయం ఇచ్చాడు లాలూ… కానీ ఓపిక లేదు, తరాల తరబడీ ప్రజలకు సేవ చేసీ చేసీ అలిసిపోయాడు…
ఐనాసరే, బాధ్యతల నుంచి పారిపోలేదుగా, పోడు… పాపం, బీహార్ ప్రజల కోసం ఏం చేయాలో బాగా తెలిసినోడు కదా… తను జైలుకు వెళ్తే పెళ్లాన్ని కుర్చీ ఎక్కించాడు… పెళ్లామనే ప్రేమతో కాదు, ఇంటి బాధ్యతల్ని ఎలా నిభాయించిందో కళ్లారా చూశాడు కాబట్టి… ఆరుగురు కొడుకుల్లో తను రెండోవాడు… ఒక అన్న ఓ వెటర్నరీ కాలేజీలో ప్యూన్, తనేమో క్లర్కు… అలాంటి నేపథ్యం నుంచి, అందరూ కోట్లకుకోట్లు వెనకేసుకున్నారూ అంటే, ఎంత కష్టపడి ఉండాలో మీరే చెప్పండి…
తనకేమో 9 మంది పిల్లలు… ఇద్దరు కొడుకులు, ఏడుగురు బిడ్డలు… తన సొంత బామ్మర్దులు సరేసరి… అందరినీ ఉద్దరించాడు… ఎవరికీ తక్కువ చేయలేదు… ఇంకేం చేయమంటారు..? ఇప్పుడు నితిశ్ కూడా ముసలోడైపోయి, పాపం ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను చిన్న కొడుకు తేజస్వికి అప్పగించాడు, నువ్వే ఉపముఖ్యమంత్రివి అన్నాడు… పెద్ద కొడుకు తేజప్రతాప్ యాదవ్ ఫీలవుతాడేమో అని తననూ మంత్రిని చేశాడు… తను ఆడ, మగ కాని మాటలు మాట్లాడుతుంటాడు… అలాంటప్పుడు ఓ పెద్ద దిక్కు కావాలి కదా… అందుకని అల్లుడు శైలేష్‌ను పిలిచి కాస్త బావమరిదికి సాయం చేయవోయ్ అన్నాడు…
Ads
కొడుకు మీటింగులో కూర్చుంటాడు… మిగతావన్నీ అల్లుడు చక్కబెడతాడు… తప్పేముంది..? సలహాదారుల పేరిట ఎన్ని ప్రభుత్వాలలో ఎందుకు వేళ్లు, కాళ్లు పెట్టడం లేదు..,? ఫైళ్లు కూడా చూస్తున్నారు కదా… దీన్ని కూడా రాద్దాంతం చేస్తే ఎలా..? అలాగని మిగతా ఆరుగురు అల్లుళ్లను మీటింగుల్లో కూర్చోబెట్టడం లేదు కదా… సంతోషించరెందుకు..?
ఐనా ఈ నితిశ్‌కు పాలన చేతకాదు, అసమర్థుడు… అసలు సీఎం అంటే ఎలా ఉండాలి..? టెరిఫిక్‌గా ఉండాలి… తను సీఎంగా ఉన్నప్పుడు వీథికో ప్రైవేటు ఆర్మీ… ఎవడైనా ఎదురుతిరిగితే మక్కెలు విరిగిపోవడమే… ఉదాహరణకు… తన బిడ్డ పెళ్లి ఖాయం కాగానే కార్ల షోరూంల మీద పడి లగ్జరీ కార్లన్నీ ఎత్తుకొచ్చారు తన గ్యాంగు… బట్టలు, బంగారం, చాక్లెట్లు, స్వీట్లు… వాట్ నాట్… పెళ్లిలో కనిపించిన ప్రతి సరుకూ ఎత్తుకొచ్చిందే… ఒక్క వరుడు తప్ప…
శాంతి, భద్రత అనే పదాలు వినిపించకుండా కట్టడి చేశాడు… రాజధర్మం పాటించాడు… అదీ ఎంతగా అంటే… తన బిడ్డ దోస్త్ అభిషేక్ మిశ్రా అని ఉండేవాడు… విషయం లాలూకు తెలిసిన తెల్లారేసరికి శవమయ్యాడు… అంతెందుకు..? లండన్ బేస్డ్ డాక్టర్ బీఎన్‌సింగ్ ఉండేవాడు, ఆయన కొడుకు గౌతమ్… లాలూ పార్టీ యువజన విభాగమే… తన లేడీ దోస్త్ శిల్పి జైన్… అకస్మాత్తుగా ఇద్దరూ శవాలయ్యారు…
ఘోరం ఏమిటంటే..? హత్యకు ముందు పలుసార్లు అత్యాచారానికి గురైందని హైదరాబాద్, ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది… కానీ సీబీఐ వాళ్లిద్దరూ ఆత్మహత్యలు చేసుకున్నారని ఫైల్ క్లోజ్ చేసింది… ఇంకో ఘోరం ఏమిటంటే… ఇదే లాలూ బావమరిది, ఎమ్మెల్యే సాధుయాదవ్ డీఎన్ఏ శాంపిల్ అడిగింది సీబీఐ ఓ దశలో… నేనివ్వను, ఏం చేసుకుంటారో చేసుకొండి అన్నాడు తను… ఏమైంది..? ఏమీ కాలేదు… సీబీఐ అంటే అదేమీ తోపు కాదు కదా… కుర్చీ చెప్పినట్టు ఆడే మరబొమ్మ…
ఇలా ఎన్ని కేసులు..? ఎన్ని అరాచకాలు..? ఛిఛీ, ఈ నితిశ్ ఉత్త వేస్ట్ ఫెలో… ఇవన్నీ చేతకావు… మెల్లిమెల్లిగా అల్లుడిని దింపినట్టే, మళ్లీ అందరినీ దింపి, బీహార్‌ను పాత రోజుల్లోకి తీసుకెళ్లాలని ఉంది… కానీ ఈ బీజేపీ వాళ్లకు సిగ్గూశరం లేదు, ప్రతిదానికీ ఏదో కొంపలు మునిగిపోయినట్టు గీపెడతారు… నాన్సెన్స్… నా జీవితకాలంలో మళ్లీ బీహారర్ చూడలేనా..?!
Share this Article