అదేదో శుద్ధపూస పత్రిక అయినట్టు… ఆప్, బీజేపీ తన్నుకుంటున్నాయి..! ఆప్ నేతలు చెబుతున్నారేమిటంటే..? ‘‘ఢిల్లీ ప్రభుత్వం విద్యావిధానంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్ని న్యూయార్క్ టైమ్స్ ఫస్ట్ పేజీలో ప్రత్యేక కథనంగా కుమ్మేసింది… అది చూసి మోడీకి, షాకు బుగులు పట్టుకుంది, ఇక రాబోయే ఎన్నికలు కేజ్రీ వర్సెస్ మోడీ అనేది ఫిక్స్… పైగా అదే పత్రిక కరోనా సమయంలో మోడీ వైఫల్యాల్ని కూడా ఏకిపారేసింది… అదుగో, దాంతో కక్షపెట్టుకుని సిసోడియాను టార్గెట్ చేసి, సీబీఐ కేసు పెట్టించాడు మోడీ…’’
దీనికి ప్రతిగా బీజేపీ వాళ్లు ఏమన్నారో తెలుసా..? ‘‘ఆ కథనాలు పెయిడ్ స్టోరీలు, మాకు తెలియదా ఏం..? రాయించుకుంటే ఎన్ని కథనాలైనా వస్తాయి అలా…’’ నిజానికి తలతిక్క వ్యాఖ్యలకు బీజేపీ నాయకులే అనుకుంటాం గానీ, ఆప్ నేతలు కూడా తక్కువేమీ కాదు… ఇదే ఉదాహరణ… లేకపోతే ఏదో ఓ దిక్కుమాలిన పత్రిక, అదీ అమెరికాలో పబ్లిషయ్యే పత్రిక ఏదో రాయడం ఏమిటి..? దాంతో ఇక్కడ రెండు పార్టీలు తన్నుకోవడం ఏమిటి..? పైగా సీబీఐ కేసులు కూడా ఆ కుళ్లుబోతుతనంతోనే పెట్టేసుకుంటున్నారట…
నిజం, ఢిల్లీ మద్యం స్కామ్ నిజం… కూలంకషంగా వివరాలు బయటికొస్తున్నాయి… ఆ మద్యం డబ్బుల్నే కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టాడట… సరే, అన్ని పార్టీల బాగోతాలూ అవే కదా… ఆ పత్రిక సంగతికొద్దాం… అదొక దిక్కుమాలిన పత్రిక… ఇండియా మీద బీబీసీ వాడిలాగే విషాన్ని కక్కుతూ ఉంటుంది… తెలుగు పత్రికల్లో కంట్రిబ్యూటర్లుగా కూడా పనికిరాని కేరక్టర్లను రిపోర్టర్లుగా పెట్టుకుని ఏదో రాయించుకుంటూ ఉంటుంది సదరు న్యూయార్క్ టైమ్స్…
Ads
మన ఈనాడుకు బాబాయ్, మన సాక్షికి తాత… పెయిడ్ ఆర్టికల్స్ రాయని పత్రిక ఏది..? ఢిల్లీ విద్యావిధానం మొన్నమొన్ననే మారిపోలేదు… చాన్నాళ్లుగా కేజ్రీవాల్ ప్రభుత్వం దాని మీద వర్క్ చేస్తోంది… మరి అంత అర్జెంటుగా ఆ న్యూయార్క్ టైమ్స్‌లో ఇంటర్నేషన్ ఎడిషన్‌లో ఆ కథనం దేనికో ఎవరికీ అర్థం కాలేదు… పైగా ఆ స్టోరీకి, ఆ పత్రిక ఢిల్లీ రిపోర్టర్ కొన్ని ఎన్జీవోల ‘‘సహకారాన్ని’’ తీసుకున్నాడట… దీనివెనుక మొత్తం చెల్లింపులే ప్రాతిపదిక అని బీజేపీ సోషల్ మీడియా బోలెడు ఆధారాల్ని బయటపెడుతోంది…
నిజానికి కేజ్రీవాల్‌కు వివిధ ఎన్జీవోల ద్వారా అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు రావడం, అవి తనకు మద్దతు పలకడం ఎంతోకాలంగా ఉన్నదే… ఇలాంటి పత్రికల్లో ఇలాంటి కథనాలు రాయించుకోవడం అనేది తనకు పెద్ద విషయమేమీ కాదు… తెలంగాణ సీఎం కేసీయార్‌లాగే దేశంలోని అన్ని భాషల పత్రికలకు వందల కోట్ల ఖర్చుతో జాకెట్ యాడ్ కూడా ఇస్తుంటాడు కేజ్రీవాల్… ప్రజాధనమేగా… గాలికిపోయే పేలపిండి… పత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలు ఇస్తే, దేశమంతా నీరాజనాలు పలికి, జాతీయ నేతలు అయిపోతారా..? హేమిటో ఇదంతా..!
కేజ్రీవాల్ ప్రకటనలు మరీ ఘోరం… వివిధ భాషల పత్రికల్లో కూడా హిందీ ప్రకటనలు వేస్తుంటారు… ఎవడు చదవాలి అవి..? సరే, కేజ్రీవాల్ పైత్యం అలా ఏడ్చింది… పెయిడ్ స్టోరీలు అనే వెక్కిరింపులు దేనికి బీజేపీకి..? ఈ విషయంలో బీజేపీ ఏమీ శుద్ధపూస కాదు కదా… బోలెడు మీడియా సంస్థలు బీజేపీ చెప్పినట్టే కథలు రాస్తుంటాయి కదా… దాన్నేమనాలి..? మీడియా సంస్థలు ఉన్నదే అమ్ముడుబోవడానికి… పార్టీలు ఉన్నదే వాటిని కొని, ఇష్టమొచ్చిన కథనాలు రాయించుకోవడానికి… అదో పెద్ద దుష్కార్యంగా బీజేపీ చిత్రీకరించడమే విచిత్రం…!!
చివరగా… ఎవరో ఇంగ్లిష్ వెబ్‌సైట్ రిపోర్టర్ సదరు న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్‌కు మెయిల్ పెట్టాడు… ‘‘అది పెయిడ్ స్టోరీ అట కదా… ఢిల్లీలో రెండు పార్టీలు తన్నుకుంటున్నాయి’’ అని… నో, నో, మా రిపోర్టర్ కష్టపడి, ఫీల్డ్ స్టడీ చేసి ఫైల్ చేసిన స్టోరీ అది… మేం ఎప్పుడూ వివిధ దేశాల ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తాం తెలుసు కదా అని ఎడిటర్ ఉవాచ… మరి సేమ్ సేమ్ స్టోరీ యథాతథంగా కలేజా టైమ్స్‌లో కూడా ఎలా వచ్చింది అని అడిగితే… మా స్టోరీలు అలా ఉన్నదున్నట్టు వాడేసుకుంటూ ఉంటారు అని మరో వింత సమాధానం… ఇవీ మన ఇంటర్నేషనల్ మీడియా స్టాండర్డ్స్… !! అవునూ, గుజరాత్ దాకా పాకుతున్నాడు కేజ్రీ, ఇక్కడే కాళ్లు నరికేద్దాం అనే బీజేపీ ప్లాన్ ఏమైనా ఈ ఢిల్లీ స్కాం బద్దలు కొట్టడానికి కారణమా..!?
Share this Article