రాజ్యసభకు నామినేటైన విజయేంద్రప్రసాద్ పూనుకుని అమిత్ షాతో జూనియర్ ఎన్టీయార్ భేటీని ఆర్గనైజ్ చేశాడనేది నిజం… రామోజీకి గానీ, ఇతరులకు గానీ సంబంధం లేదు… అందుకే తను రామోజీ ఫిలిమ్ సిటీకి వెళ్లి అమిత్ షాతో కలవలేదు… నోవాటెల్ హోటల్‌లో కలిసి భోజనం చేశాడు… మంచి ప్రయారిటీ ఇచ్చినట్టే… అయితే ఎందుకు..?
వదిలేయండి, ఆర్ఆర్ఆర్ సినిమాలో బాగా నటించావు బ్రదర్ అని అభినందించాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలు, మరీ ప్రత్యేకించి పిలిచి భోజనం పెట్టాల్సిన పనిలేదు… అదే నిజమైతే, ఫాఫం, రాంచరణ్‌ను కూడా పిలిచేవాడు కదా… పైగా అమిత్ షా కలిస్తే తప్పకుండా ఇంకేదో కారణాలు ఉంటాయి… ఏమిటవి..? రాజకీయ పండితులకే అంతుపట్టడం లేదు…
ప్రాబబులిటీస్ గనుక ఓసారి ఆలోచిస్తే… అమిత్ షా ఎంతగా బద్దలు కట్టినా సరే, ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ బీజేపీకి ఏమీ ఉపయోగపడే సీన్ కనిపించడం లేదు… తెలంగాణ కాదు, ఎప్పటికైనా జూనియర్ రాజకీయ కార్యక్షేత్రం తప్పకుండా ఏపీయే… మరి ఇప్పటికిప్పుడు జూనియర్ బీజేపీకి ఏం ఉపయోగపడగలడు..?
Ads
కమల్ హాసన్ అడ్డగోలుగా రాజకీయాల్లో బోల్తాకొట్టి, అన్నీ చాలించుకుని, బుద్ధిగా సినిమాలు చేసుకుంటున్నాడు… రజినీకాంత్ అయితే రాజకీయాలు అనే పదం వినడానికి కూడా ఇష్టపడటం లేదు, తను కూడా ఏవో సినిమాలు తీసుకుంటున్నాడు… పవన్ కల్యాణ్ కూడా చేదు అనుభవాలతో తిరిగి సినిమాలు చేస్తున్నాడు… ప్రస్తుతం సినిమా నటుల్ని రాజకీయాల్లో ఆదరించే సీన్ లేదు… ప్రజలు సినిమాలకు, రాజకీయాలకు నడుమ స్పష్టమైన విభజన రేఖ గీస్తున్నారు… మరి ఈ స్థితిలో జూనియర్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయాలి..?
ఇప్పుడు జూనియర్ సినిమా కెరీర్ మంచి ఊపులో ఉంది… ఈ స్థితిలో సినిమా కెరీర్‌ను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వస్తాడా..? అలా రావాలంటే వందల కోట్లను వదిలేసి, తెగించి రావాలి… పోనీ, అలా వచ్చినా సరే, సినిమా హీరోల రాజకీయాలు క్లిక్ కావడం లేదు కదా… పోనీ, జూనియర్ క్లిక్ అవుతాడనే అనుకుందాం… కానీ తన వయస్సు ఇంకా నలభయ్యేళ్లే… రాజకీయాల్లో రాటుదేలేంత మానసిక పరిపక్వత, ముదురుతనం వచ్చాయా..?
బీజేపీలో చేరలేడు, చేరినా దాన్ని పట్టుకుని సీఎం కుర్చీ ఆశించడం అంటే, వర్తమాన స్థితిగతుల్లో కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడమే… పోనీ, సొంత పార్టీ పెట్టుకుని, జనంలోకి వెళ్లి, అదృష్టాన్ని పరీక్షించుకుందాం అంటే… ఏపీలో పొలిటికల్ వాక్యూమ్ ఉందా..? ఉంది, కానీ ఎవరికి..? ఇప్పటికైతే రెడ్డి వర్సెస్ కమ్మ రాజకీయం జోరుగా సాగుతోంది… చంద్రబాబు, లోకేష్ ఏదో కిందామీదా పడుతున్నారు… ఈ స్థితిలో జూనియర్ రంగప్రవేశం కమ్మ ప్రతిఘటన పోరును డైల్యూట్ చేసినట్టే అవుతుంది… కాపు ఫ్యాక్టర్‌ను పవన్ కల్యాణ్ సరిగ్గా వాడుకోలేకపోవడం వేరే సంగతి… ఒకప్పుడు వంశీ, నాని జూనియర్ ఎన్టీయార్‌కు జాన్‌జిగ్రీలు… ఇప్పుడు వాళ్లూ తన వెంట రారు, మరి ఏపీలో సొంత పార్టీతో వెళ్తే తన వెంట నడిచేదెవరు..?
పోనీ, బీజేపీ గనుక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని, కూటమి తరుఫున ప్రచారానికి జూనియర్‌ను అమిత్ షా ఆహ్వానించాడు అనుకుందాం… దాంతో జూనియర్‌కు ఫాయిదా ఏమిటి..? సీఎం కుర్చీకి లబ్ధిదారులు అయితే చంద్రబాబు, లేదంటే లోకేష్… బాలకృష్ణ కూడా జూనియర్ పొడ సహించడు తెలుగుదేశంలో… వాడుకుని వదిలేయడంలో ఇండియాలో నెంబర్ వన్ కేరక్టర్ చంద్రబాబు, అది జూనియర్‌కు కూడా తెలుసు, అందుకే చాలా దూరంగా ఉంటున్నాడు… చివరకు హరికృష్ణ బిడ్డను ఏదో ఎన్నికలో నిలబెట్టినా జూనియర్ ప్రచారం మాత్రం చేయలేదు…
తెలంగాణలో కమ్మ సెటిలర్లను దువ్వడానికి, బీజేపీ పట్ల సానుకూలత పెంచడానికి జూనియర్‌తో సాన్నిహిత్యాన్ని అమిత్ షా ప్రదర్శిస్తున్నాడనే అనుకుందాం… కానీ ఇప్పటికిప్పుడు అంత అవసరం ఏముంది..? మరీ కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే తప్ప..! ఐనా సరే, జూనియర్ బీజేపీకి ప్రచారం చేస్తాడని ఊహించలేం… చివరగా :: ఇదే విజయేంద్రప్రసాద్ ద్వారా ఆర్ఎస్ఎస్ మీద సినిమా తీయబోతున్నారు, దానికోసం జూనియర్‌తో భేటీ ఏర్పాటు చేశారని మరో ప్రచారం… ఆర్ఎస్ఎస్ మీద సినిమా విజయేంద్రప్రసాద్ తీసినా సరే, బీజేపీ అధికారికంగా నిర్మించదు… ఒకవేళ జూనియర్ నటిస్తే బాగుంటుందని అనుకునే పక్షంలో దానికి అమిత్ షా మధ్యవర్తిత్వం అక్కర్లేదు… సో, ఈ భేటీ ఎందుకో ప్రస్తుతానికి ఓ రహస్యం…!!
Share this Article