నిజానికి ఈటీవీలో వచ్చే జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ షోలను చూడటం మీదే పెద్ద ఆసక్తి లేకుండా పోయింది… నాణ్యమైన స్కిట్లు లేవు… మెరిట్ ఉన్న వాళ్లు వెళ్లిపోయారు… ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా అంతే… సోసో నడిపించేస్తున్నారు… ఢీ షో అయితే మరీ నాసిరకం అయిపోయింది… వావ్, క్యాష్, ఆలీతో సరదాగా ప్రోగ్రాములకు సినిమా ప్రమోషన్లకు లింక్ పెట్టడంతో అవీ ఆసక్తికరంగా ఉండటం లేదు…
పైగా హఠాత్తుగా జడ్జిలు మారిపోతుంటారు… ఎవరో వస్తుంటారు, ఎవరో వెళ్లిపోతుంటారు… ఓ కన్సిస్టెన్సీ ఉండదు… రోజా వెళ్లిపోయాక జబర్దస్త్ షోకు జడ్జిలుగా ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు… అందరూ టెంపరరీ బాపతే… అనసూయ వెళ్లిపోయాక, వేరే ప్రయోగం చేయలేక, రష్మినే రెండు జబర్దస్త్‌లు ప్లస్ డ్రామాకంపెనీని గంపగుత్తాగా అప్పగించేశారు…
అసలు ఢీలో మరీ చంచలం… ఒక్క ప్రదీప్ మాత్రమే గ్యారంటీ కేరక్టర్ అన్నట్టుగా ఉన్నాడు అక్కడ… నందిత శ్వేత ఏమైందో, శ్రద్ధాదాస్ కనిపిస్తోంది… అందరూ తమను వదిలేసి వెళ్లిపోయారనే కోపంతో ఉన్నది కదా మల్లెమాల ప్రొడక్షన్స్… ఆర్పీ అనే ఓ కమెడియన్ ఏవేవో పిచ్చి చానెళ్లలోకి వచ్చి మల్లెమాల మీద నానా విమర్శలూ చేశాడు… దాంతో తన మీద మల్లెమాల స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇప్పించింది… ఇదో చర్చ, కంపు… అయితే తమను వదిలేసిన వెళ్లిపోయిన అనసూయ, సుధీర్, చమ్మక్ చంద్ర వంటి ఆర్టిస్టులనూ పిలిచి వచ్చే 28న ఈటీవీ 27వ వార్షికోత్సవం స్పెషల్ షో ప్రసారం చేయబోతున్నారు… పేరు ‘భలే మంచిరోజు’… భలే చానెల్ బాసూ…
Ads
నిజానికి చెప్పుకోవాల్సింది ఇది కాదు… హఠాత్తుగా ఒకప్పటి ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్ జబర్దస్త్ జడ్జి సీట్లో కూర్చుని కనిపించాడు… పక్కన ఇంద్రజ ఉంది… ఆమె రోజా ప్లేసులో ఓ జడ్జిగా ఇక అతుక్కుపోయినట్టే… ఈమధ్య డ్రామా కంపెనీకి అప్పుడప్పుడూ కృష్ణ భగవాన్ వస్తున్నాడు… తోచిన సెటైర్లు, పంచ్‌లు వేస్తున్నాడు… ఇప్పుడు ఏకంగా జడ్జి సీటులో కూర్చోబెట్టారు… నిజంగా తనను చూస్తే జాలి అనిపించింది…
తాగుబోతు రమేష్ సినిమాల్లో అవకాశాల్లేక జబర్దస్త్ నాసిరకం స్కిట్లకు ఫిక్సయిపోయినట్టు… కృష్ణ భగవాన్ కూడా ఈటీవీకి అంకితం అవుతాడా అనిపించింది… ఐనా తప్పులేదు… ఒకప్పుడు మంచి టైమింగుతో సినిమాల్లో తను అదరగొట్టినవాడే… వంశీ సినిమాలే కాదు, తనే కథానాయకుడిగా కూడా సినిమాలు వచ్చాయి… తను స్వతహాగా రైటర్ కూడా… స్పాంటేనియస్‌గా పంచులు వేయగలడు, రాయగలడు… కాకపోతే కెరీర్ ప్లానింగ్ సరిగ్గా లేక చెడగొట్టుకున్నాడు…
మద్యం కూడా తనను చెడగొట్టినట్టుంది… ఓ దశలో తనకు కేన్సర్ అనే ప్రచారం జరిగింది… కానీ తనకు బ్యాక్ పెయిన్ ఉందనీ, కేన్సర్ గట్రా ఏమీ లేవని కృష్ణ భగవానే క్లారిటీ ఇచ్చినట్టున్నాడు… ఇప్పుడైనా డ్రామా కంపెనీకి వచ్చినా, జడ్జిగా వచ్చినా కూర్చోవాల్సిందే… కాకపోతే రెగ్యులర్ జబర్దస్త్ జడ్జిల్లా ఎహెహె అని నోరంతా తెరిచి నవ్వేసి, అదే జడ్జి బాధ్యత అనుకోవడంకన్నా… కృష్ణభగవాన్ తనే నాలుగు ఎదురు పంచులు వేశాడు స్కిట్లలో ఆర్టిస్టుల మీద… సరదాగా బాగున్నయ్… ఆయన్నే ఆ సీటులో కంటిన్యూ చేసేస్తే పోలా…!!
Share this Article