మనసుంటే మల్లి… లేకపోతే ఎల్లి…. కేసీయార్ చాలాసార్లు చేసేది ఇదే… ఉదాహరణకు నియంత్రిత సాగు… పంటల కొనుగోళ్లు… తను తాజాగా తీసుకున్న నిర్ణయం ఏమిటి..? ఇకపై నియంత్రిత సాగు ఉండదు, మీ ఇష్టం వచ్చిన పంట వేసుకొండి… ప్రభుత్వం పంటలు కొనదు… 7500 కోట్లు లాస్ అయ్యింది ప్రభుత్వం… మీ ఇష్టం వచ్చినచోట మీ ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకొండి… ఇదీ ఆ నిర్ణయం… అంటే గ్రామ స్థాయి వరకూ అద్భుతమైన నెట్వర్క్ అని ప్రచారం చేసుకున్న రైతు సమితుల గతేమిటి..?
ముందుగా నియంత్రిత సాగు సంగతి చూద్దాం… ఏ పంటకు కొరత ఉందో, ఏం వేస్తే బెటరో, ఏది అవాయిడ్ చేయాలో నిర్దేశించింది మార్కెట్… అంతేతప్ప ప్రభుత్వం కాదు… ఒకవేళ మనకున్న చిన్న చిన్న కమతాల్లో ఇది వేయి, ఇది వేయకు అని ప్రభుత్వం చెబితే… వేసిన పంటకు ధర, కొనుగోళ్లకు గ్యారంటీ ఇవ్వగలదా.,.? ఇప్పుడు ప్రభుత్వం వ్యాపాార సంస్థ కాదు అని చెబుతోంది, మరి గత ఏడాది నియంత్రిత సాగు ఆచరణకు ముందు ఏం ఆలోచించారు..?
Ads
ప్రభుత్వ వ్యవసాయశాఖ ఎక్స్టెన్షన్ సర్వీసు వదిలిపెట్టింది… ఇది వేయి, ఇది వేయకు అని చెప్పాలంటే… ఏయే నేలలు ఏయే పంటలకు సూటబులో, వాటికి ధరలున్నాయో లేదో ఓ అధ్యయనం జరగాలి… అది జరిగిందా..? మొక్కజొన్న వేయొద్దు అన్నారు, కానీ ధర బాగానే ఉంది… పత్తి వేయండీ అన్నారు… సన్నరకాల వరి వేసుకొండి అన్నారు, సన్నాల దిగుబడి తక్కువ… తీరా పంట చేతికొచ్చాక ధర లేదు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిందించారు కొన్నాళ్లు… మరి ఆ పంట వేసుకోవాలని ఎందుకు ఫోర్స్ చేశారు..?
నిజానికి దేశానికి అవసరం నూనెగింజలు, అపరాలు… అవి వేసుకోవాలని సూచనలు, సలహాలు ఇవ్వకుండా… సరైన సంకర వంగడాలు అందుబాటులో ఉంచకుండా… వాటికి రాయితీలు ఇవ్వకుండా…. కౌలు రైతుల్ని దగా చేస్తూ, సాగు కూడా చేయని రైతులకు కూడా రైతుబంధు పేరిట నగదుసాయం చేస్తున్నారు… ఇవన్నీ లోపాలే కాదా..? కందులు, పెసలు, శెనిగెలు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదాలు… ఇవి కదా ప్రమోట్ చేయాల్సినవి… సన్నాల ధరపై రైతుల్లో వ్యతిరేకత కనిపించడంతో ఇక మీ పంట మీ ఇష్టం అని చేతులెత్తేశారు…,
ఇక కొనుగోళ్లు, ధరలు, అమ్మకాల సంగతికి వద్దాం… ‘‘ఇక ప్రభుత్వం కొనదు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నాం’’ అంటున్నాడు కేసీయార్… ఆరేళ్లుగా 7500 కోట్ల నష్టం అంటున్నారు… ధాన్యం భారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎఫ్‌సీఐ భరిస్తోంది… మొక్కజొన్నను కొనిపించి మార్క్‌ఫెడ్‌ను ముంచేశారు… అధికారులు, దళారులు, నాయకులు ఎన్ని బాగోతాలు పడ్డారో ఒక్కరోజయినా కేసీయార్ వెనక్కి తిరిగి చూసుకున్నాడా..? వ్యవసాయ మార్కెట్లలో అడ్తీదారులకు పనిలేకుండా చేసి, ఓ నెట్వర్క్ దెబ్బతీయడం వల్ల ఇప్పుడు ఎంత నష్టమో గమనించారా..?
పోనీ, ఏ పంట ఎప్పుడు కొనాలో, ఎప్పుడు అమ్మాలో, ఎవరికి అమ్మాలో ఆలోచించే అధికారులు ఉన్నారా..? మరి నష్టం ఎందుకు రాదు..? సరే, చేతులు కాలినయ్… ఎహె, నేను ఇక కొనబోను అనే నిర్ణయం కూడా తప్పే… ఒక ప్రభుత్వం కొనుగోళ్ల సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే మార్కెట్లోకి రావాలి… లేదా వ్యాపారుల సిండికేట్లను బద్దలు కొట్టాలి… అంతే తప్ప, కొనుగోళ్లు నా పనికాదు అని చేతులెత్తేస్తే ఎలా..? అది చేయాల్సినప్పుడు మాత్రమే చేయాలి… చేయడానికి రెడీ ఉండాలి…
అసలు ధాన్యాన్ని ప్రభుత్వం కొని, మిల్లర్లతో మిల్లింగ్ చేయించి, ఎఫ్సీఐకు పెట్టడం దేనికి..? ఆ పనేదో మిల్లర్లే చేసుకుంటారు కదా… కనీస మద్దతు ధర వస్తుందా లేదా నిఘా వేసుకుంటే సరిపోదా..? మిల్లర్ల నుంచి ఎంత మేరకు బియ్యం తీసుకోవాలో, మన జాతీయ ఆహార అవసరాలు ఎంతో ఎఫ్‌సీఐ ఆలోచిస్తుంది కదా, అది ఉన్నదే అందుకు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం కొనడం దేనికి..?
పల్లెల నుంచి ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారులూ నష్టపోయి, ప్రభుత్వమూ నష్టపోయి, ఎఫ్‌సీఐ నష్టపోయి… మరి లాభపడింది ఎవరు..? ఈమేరకు ధాన్యం రైతుకైనా ఫాయిదా దక్కిందా..?
అడ్డమైన కొత్త వ్యవసాయ చట్టాలు, మేం అంగీకరించం, అమలు చేయం అన్నాడు కేసీయార్ మొదట్లో… ఓరోజు బంద్ చేయించాడు… తీరా ఏమైంది..? ఆ కొత్త కేంద్ర చట్టాల్లో ఉన్నట్టుగానే…. రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఆంక్షల్లేవు, అభ్యంతరాల్లేవు అంటున్నాడు ఇప్పుడు… అంటే డిల్లీకి వెళ్లిరాగానే ఆ చట్టాలు పవిత్రంగా తోచాయా ఇప్పుడు..? రైతు తన పంటను దేశం మొత్తమ్మీద ఎక్కడ అమ్ముకున్నా ఎవరూ అడ్డుకోవద్దు అనేదే కదా కేంద్ర చట్టాల ఉద్దేశం… మరి దాన్ని ఎందుకు వ్యతిరేకించినట్టు..? ఇప్పుడు వాటినే ఎందుకు అమలు చేస్తున్నట్టు..? మన అడుగుల్లో, మన ఆలోచనల్లోనే భారీగా తేడా కొడుతున్నది కదా…!!
వాస్తవానికి ఇక్కడ కేసీయార్ నోటి వెంట రావల్సిన ప్రకటన ఏమిటంటే..? ‘‘మీకు ఇష్టమైన పంట వేసుకొండి, ఫలానా వేసుకుంటే బెటర్.., ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకొండి,… కొనేవాడు లేకపోతే, సరైన ధర రాకపోతే నేనున్నా… నేను కొంటా… ప్రభుత్వం మరీ అగాధంగా మిమ్మల్ని వదిలేయదు…’’ ఒక ముఖ్యమంత్రి పలకాల్సింది ఇదీ… కానీ ‘‘మీ ఖర్మ, ఏమైనా వేసుకొండి, ఎక్కడైనా అమ్ముకొండి’’ అన్నట్టుగా ఉండకూడదు…!!
Share this Article