పుట్టినవాడు గిట్టకతప్పదు… ప్రతి జీవికీ మరణం తప్పదు… అందరూ అంగీకరించేదే కదా… కాకపోతే లోకాన్ని విడిచిపెట్టి పోవడానికి జీవి గుంజాటన ఉంటుంది… తనతో అనుబంధం ఉన్నవాళ్లకు బాధ ఉంటుంది… అలాగని సాగనంపడానికి శోకాలు పెట్టాలా..? కడుపులో లేకపోయినా కన్నీళ్లు ప్రవహించాలా..? మరణం ఖరారయ్యాక.., ఆ ఆత్మను, ఆ దేహాన్ని నవ్వుతూ సాగనంపితే తప్పేమిటి..? ఈ ప్రశ్న ఇప్పుడు కేరళలో ఓ చర్చకు దారితీస్తోంది… ఇంట్రస్టింగు…
ఎస్, చాలా దేశాల్లో… మన దేశంలోనూ కొన్ని తెగల్లో ఎవరినైనా ఈలోకం నుంచి సాగనంపాలంటే కన్నీళ్లు పెట్టుకోరు… అలా పెట్టుకుంటే వెళ్లిపోయే జీవి బాధపడుతుందని భావిస్తారు… సెలబ్రేట్ చేస్తారు… తాగడం, తినడం, డాన్సులు చేయడం ఎట్సెట్రా… మన రాష్ట్రాల్లో కూడా అనేక కులాల్లో పెద్ద కర్మను ఓ ఫంక్షన్‌లాగే చేస్తారు… కుటుంబం ఆర్థికస్థాయిని బట్టి… అదేమీ తప్పు కాదు… మరణించిన వ్యక్తి పట్ల చూపే గౌరవమే… కొన్ని కుటుంబాల్లో పెళ్లి ఖర్చుతో సమానం…
కొట్టాయం, మల్లపల్లిలో… 95 ఏళ్ల మరియమ్మ మరణించింది… జీవితంలో అన్నీ చూసింది… మనమళ్లు, మునిమనమళ్ల దాకా బోలెడు మంది వారసులు… వీలైనంత మంది వచ్చారు… ఆమె శవపేటిక వద్ద అందరూ చేరి, నవ్వు మొహాలతో సెల్ఫీ తీశారు… సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా… ‘‘తప్పేముంది..? మరణించిన వ్యక్తి స్వర్గానికి చేరుకుంటుంది… ఆనందంగా స్వర్గానికి పంపించడమే కదా మనం చేయాల్సింది… సాయంత్రం 4 గంటలకు మృతదేహం ఇంటికి వస్తే, పొద్దున 3 గంటల దాకా ప్రార్థనలు చేశాం, తరువాత సెల్పీ తీసుకున్నాం… ఇదొక జ్ఞాపకమే కదా’’ అని ఓ కుటుంబసభ్యుడు చెప్పుకొచ్చాడు… హేతుబద్ధంగానే అనిపిస్తోంది కదా…
Ads
‘‘నిజమే, కొందరు సోషల్ మీడియాలో దీన్ని తప్పు అంటున్నారు… కానీ నేనొకటి చెబుతాను… ఆమె ఏడాదిగా మంచం మీదే ఉంది… వయోసంబంధ వ్యాధులతో బాధపడుతోంది… తొమ్మిది మంది పిల్లలు… సాధ్యమైనన్ని అన్నిరకాల చికిత్సలూ చేయించారు, ప్రేమగా చూసుకున్నారు… ఐనా కొందరు ఈ ఫోటోను తప్పుపడుతున్నారంటే, అది వాళ్ల మనస్సుల్లోనే ఏదో తేడా ఉన్నట్టు లెక్క…’’ అనేది ఆయన సమర్థన…
నిజమే కదా… ఇందులో వెకిలి చేయడానికి గానీ, నవ్వడానికి గానీ, తప్పుపట్టడానికి గానీ ఏముంది..? ఆ కుటుంబసభ్యులు తమకు ప్రియమైన ఓ కుటుంబపెద్దను నవ్వుతూ, ఆనందంగా ఈ లోకం నుంచి సాగనంపుతున్నారు… ఇందులో నటించాల్సిన అవసరం లేదు… ఆ పిల్లలకు ఓ మెమరీ… ఏడవడం ఓ సంప్రదాయమైతే కాదు కదా… మరెందుకు ఈ రచ్చ..?! సోషల్ మీడియా ఇలాంటి కొన్ని విషయాల్లో బ్రాడ్‌గా ఉండలేక, విచక్షణ లేక, మరీ పిచ్చి వివాదాల్ని మోసుకొస్తుంటుంది…!!
Share this Article