నిజంగా ప్రత్యూషది ఓ కథే… ఆమె కథ ముందు పదీపన్నెండు టీవీ సీరియళ్లు, తెలుగు సినిమాలు కూడా సరిపోవు… ఆమె పాత విషాదం గురించి ఇక్కడ చెప్పుకోవడం వద్దు గానీ… ఒక ప్రభుత్వ శాఖ మొత్తం ఆమెను సొంత బిడ్డలా పరిగణించడం… చదివించి, కొలువు ఇప్పించి, పెళ్లి చేస్తుండటం… సాక్షాత్తూ ముఖ్యమంత్రి సతీమణి వెళ్లి, పెళ్లికూతురిని చేసి, ఆశీర్వదించడం… అవును, ఓ కలలాంటి, ఓ కథలాంటి వార్త…
ఈ ఫోటో బాగా నచ్చేసింది… ముఖ్యమంత్రి సతీమణి ప్రత్యూషకు బొట్టుపెట్టి, పట్టుబట్టలు పెట్టి… సొంత బిడ్డలాగే ఓన్ చేసుకోవడం, ఆ ఫోటో ఓ విశేషమే… ఇంతకీ కేసీయార్ తన దత్తపుత్రికకు ఇస్తున్న పెళ్లికానుక ఏమిటీ అంటారా..? సారుగారికి కరుణ వచ్చినా పెద్దగానే ఉంటుంది… కోపం వచ్చినా పెద్దగానే ఉంటుంది… మరి తన దత్తపుత్రికగా ఇంత ప్రచారం జరిగిన ప్రత్యూషకు తన రేంజ్‌లోనే ఓ కానుక ఇచ్చాడు… డైమండ్ నెక్లెస్… అవును, ఆయన సతీమణి స్వయంగా తెచ్చి పెళ్లి కూతురి మెడలో అలంకరించింది…
Ads
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే… ఈ పెళ్లి రెండు మత సంప్రదాయాల్లో జరగబోతోంది… పెళ్లికి ముందు లాంఛనాలన్నీ హైందవ సంప్రదాయం… అంటే పసుపు దంచడం, ఒడి నింపడం వంటివన్నీ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు శనివారం నిర్వహించారు… ఐఏఎస్ గెస్ట్ హౌస్ ఈ పెళ్లికి పెళ్లికూతురి వైపు పెళ్లివిడిది… సీఎం భార్య కూడా అక్కడికే వెళ్లి తమ లాంఛనాల్ని పూర్తి చేసింది…
వరుడు చరణ్‌రెడ్డి కుటుంబం క్రైస్తవాన్ని పాటిస్తుంది కాబట్టి… ఇక సోమవారం మొత్తం క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి జరగనుంది… ఓ క్రిస్టియన్ ప్రార్థన మందిరంలో జరగబోయే ఈ పెళ్లికి కేసీయార్ హాజరవుతాడా లేదా తెలియదు గానీ… మొత్తం ఓ ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు మొత్తం పెళ్లికూతురి తరఫున హాజరు కాబోతున్నారు… పీడ కలల వంటి విషాదాల నుంచి బయటపడి, ఓ కొత్త జీవితం వైపు వెళ్తున్న ప్రత్యూషా… నీ కథ తెలిసిన ప్రతి మనసూ నీకు చెప్పేది ఒకటే… విష్ యూ హేపీ మేరీడ్ లైఫ్…
Share this Article