రానున్న 2021 కొత్త సంవత్సరంలో పూర్తిగా స్వదేశీ వస్తువులనే వాడుతామని మనకు మనం సంకల్పించుకుని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని మన ప్రధాని మన్ కీ బాత్. ఈ వార్తను ఎలా అన్వయించుకోవాలో? ఎలా అర్థం చేసుకోవాలో? తెలియక తికమకపడుతున్నాను.
కడప జిల్లా తాళ్ళపాక పక్కన పల్లెలో పుట్టి, అనంతపురం జిల్లా లేపాక్షిలో పెరిగి- ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో; ఎస్ కె యు, ఉస్మానియా, తెలుగు యూనివర్సిటీల్లో చదువుకున్న నేను పూర్తిగా స్వదేశీనే. భారతదేశం, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మీద నాకు గౌరవముంది. భారతీయుడిగా, తెలుగువాడిగా ఉండాల్సిన ఆత్మాభిమానముంది.
Ads
మోడీజీ మన్ కీ బాత్ ప్రకారం 2021 లో ఎదురయ్యే నా సమస్యలివి.
1 . నేను వాడుతున్న ఐ ఫోన్ అమెరికాది.
2. నా కారు జపాన్ వాడు బెంగళూరు పక్కన ఫ్యాక్టరీ పెట్టి అందులో తయారు చేసినది. అంతకు ముందు కారు కూడా జపాన్ వాడు హర్యానాలో ఫ్యాక్టరీ పెట్టి అక్కడ తయారు చేసినది.
3 . నేను వాడే కెమెరాలు జపాన్ లో తయారై ఇక్కడికి దిగుమతి అయినవి. లెన్సులు జపాన్ లో తయారై ఇక్కడికి దిగుమతి అయినవి. ఆడియో, వీడియో కేబుల్స్ జర్మనీలో తయారై ఇక్కడికి దిగుమతి అయినవి. ఎడిటింగ్ సిస్టమ్ అమెరికాలో తయారై ఇక్కడికి దిగుమతి అయినది.
4. ఇంట్లో చూస్తున్న టీ వీ జపాన్ ది. ఫ్రిడ్జ్ కొరియాది. వండే స్టౌ జర్మనీది. గిన్నెలు కడిగే మిషన్ జర్మనీది. బట్టలుతికే మిషన్ అమెరికాది. టైమ్ చూసే గడియారం చైనాది. వెలిగే బల్బు ఫిన్లాండ్ ది. ఫాల్స్ సీలింగ్ లోపల కరెంట్ వైర్ జర్మనీది. చల్లబరిచే ఏ సీ జపాన్ ది. నీటిని వేడిచేసే గీజర్ నార్త్ అమెరికాది. బట్టల షెల్ఫ్ తలుపులు జర్మనీవి.
5. డిగ్రీ కాగానే మా అబ్బాయి పిజి కి వెళ్లబోయేది బ్రిటన్ లేదా అమెరికా.
వాడుతున్న విదేశీ వస్తువులు ఇంకా ఇంకా చాలా ఉంటాయి. కొన్ని అవి విదేశీ అని కూడా మనకు తెలియదు. ఇందులో ఏవి అత్యవసరమై వాడుతున్నాను? ఏవి కాదు? అన్న చర్చలోకి నేను వెళ్లదలుచుకోలేదు. నేనంటే దేశాభిమానం లేక ఇలా నానా విదేశీ వస్తువులు వాడుతూ భారత్ లో ఉంటున్నాను. మీరందరూ అలా కాదు. పూర్తి స్వదేశీ వస్తువులనే వాడుతూ ఉండి ఉంటారు!
మోడీజీ మన్ కీ బాత్ ప్రకారం నా 2021 ఎలా గడుస్తుంది? అన్నదే నా దిగులు! నేను భారతీయుడినే. 2021 లో, ఆ తరువాత కూడా భారతీయుడిగానే ఉండాలనుకుంటున్నా.
“అనుకున్నామని జరగవు అన్నీ;
అనుకోలేదని ఆగవు కొన్నీ;
జరిగేవన్నీ మంచికని-
అనుకోవడమే మనిషి పని”
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article