అందరూ కాకపోవచ్చుగాక…. కానీ ఈ దేశంలో నయా జమీందార్లు, దొరలు, దొరసాన్లు సివిల్ సర్వెంట్లు… భారతీయ సమాజానికి అది పెద్ద శాపం వాళ్లే… బట్టీలు పట్టి, సబ్జెక్టు పుస్తకాలను ముక్కున పట్టి, ఆ దిక్కుమాలిన సివిల్స్ పరీక్షల్ని రాసి, తలతిక్క ఇంటర్వ్యూల్లో నెగ్గితే… మనం ఆహా అంటున్నాం, ఓహో అంటున్నాం… చిన్న మంచి పని చేస్తే చప్పట్లు కొడుతున్నాం… కానీ వాళ్లలో ఎందరు ఈ సొసైటీకి కరోనా వైరసులు అవుతున్నారనే నిఘా లేదు, చర్యల్లేవు…
ఒక్కసారి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఎట్సెట్రా ఏదో సర్వీసు… వశపడని జీతాలు, క్వార్టర్లు, పనిమనుషులు, దాసదాసీజనం… వందిమాగధులు… సర్కారీ పైరవీలు, కమీషన్లు, ఆస్తుల, ఆడంబరాలు, అట్టహాసాలు… ఒక్కొక్కరూ ఒక్కో సంస్థానాధీశులు… మోడీ కాదు కదా… వంద మంది మోడీలు పుట్టుకొచ్చినా సరే ఇప్పటికిప్పుడు ఈ వ్యాధికి చికిత్స లేదు… ఇంత హార్షా కామెంట్లు చేయడానికి కారణం, ఓ ప్రబల ఉదాహరణ… ష్, సివిల్ సర్వెంట్లకన్నా వాళ్ల భార్యలు ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరం… రిటైర్ అయినా సరే ఆ బలుపు తగ్గదు…
జార్ఖండ్‌లో ఓ ఉదాహరణ… ఓ రిటైర్డ్ ఆఫీసర్… పేరు మహేశ్వర్ పాత్రా… పెళ్లాం పేరు సీమా పాత్రా… పదేళ్ల క్రితమే సర్వీసు నుంచి రిటైరయ్యాడు… ముందు కాంగ్రెస్, తరువాత బీజేపీలో చేరాడట… ఇంకా సొసైటీని పీడించింది చాల్లేదేమో… సదరు సీమా పాత్రా ఓ గిరిజన బాలికను ఇంట్లో పనికి పెట్టుకుని, హింసించి, వేధించి… చివరకు తన మూత్రాన్ని తన నాలుకతో క్లీన్ చేయించిందట… దాన్ని (సారీ, ఈ పదం వాడినందుకు…) ఏం చేయాలి..? అసలు భారతీయ చట్టాలు ఆమెను శిక్షించగలవా..? మన కోర్టులకు అంత దమ్ముందా..?
Ads
సునీత… గుమ్లా అనే గ్రామానికి చెందిన గిరిజన బాలిక… పదేళ్ల క్రితం వీళ్ల ఇంట్లో పనికి చేరింది… తరువాత ఈ ‘‘పుణ్య దంపతుల బిడ్డ’’ వత్సల పాత్రా ఇంట్లో పనికోసం ఢిల్లీకి పంపించారు… తరువాత రాంచీకి బదిలీపై వచ్చాక మళ్లీ వాళ్లతోపాటే ఇక్కడికి వచ్చేసింది… వేధింపులు, కొట్టేవాళ్లు, నేను పనిమానేసి మా ఊరు వెళ్లిపోతానంటే ఓ గదిలో వేసి బంధించారు…
డజన్ల కొద్దీ సంఘటనలు… ఆమెకు వేడి పెనంతో వాతలు పెట్టేవాళ్లు… సరైన నీళ్లు ఉండవు, ఫుడ్డు ఉండదు, ఓ గదిలో వేసి నిర్బంధించేవాళ్లు… మాట్లాడనిచ్చేవాళ్లు కాదు… భయపడి, వణికిపోయి మూత్రం పోసుకుంటే నాలుకతో క్లీన్ చేయించేదట ఈ యజమానురాలు… తను మనిషి అని చెప్పడానికి మనసొప్పడం లేదు… అసలు మనిషి లక్షణాలుంటే కదా… ఇప్పుడు సునీత రాంచీలోని రిమ్స్‌లో చావుబతుకుల్లో కొట్లాడుతోంది…
ఆమె దేహం మీద బోలెడు గాయాలున్నయ్… అవే ఆమెపై జరిగిన వేధింపులకు, హింసకు సాక్ష్యాలు… మూతి మీద పలుసార్లు కొట్టి ఉంటారు, పళ్లు విరిగిపోయాయి… పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారి వివేక్ బస్కి ఆమె గురించి తెలిసి, డీసీ రాహుల్ కుమార్ సిన్హాకు సమాచారం ఇచ్చాడు… పోలీసులు ఆ ఇంట్లోకి ప్రవేశించి, మేజిస్ట్రేట్ సమక్షంలో ఆమెను విడిపించారు… ఎంత ఘోరం..?
వివేక్ బాస్కీ ఫిర్యాదు మేరకు IPCలోని 323, 325, 346, మరియు 374 సెక్షన్లు మరియు SC-ST చట్టం 1989లోని నిబంధనల ప్రకారం రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది… సునీత పరిస్థితి మెరుగుపడిన తర్వాత సెక్షన్ 164 కింద కోర్టులో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని అగోరా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ తెలిపారు… ఇవన్నీ సదరు రిటైర్డ్ దొరవారిని, వాడి పెళ్లాన్ని శిక్షిస్తాయా అనేది డౌటే…
ఈ మొత్తం వార్తలో… ఒక్క విషాదవిశేషం ఏమిటంటే… ఆ పిశాచికి ఓ కుమారుడున్నాడు… తన పేరు ఆయుష్మాన్… సునీత మీద తల్లి సాగిస్తున్న పైశాచికత్వాన్ని వ్యతిరేకించేవాడు… తల్లితో గొడవపడేవాడు… తరువాత అతన్ని రాంచీలోని RINPAS అనే సైకియాట్రిక్ ఆసుపత్రిలో చేర్చారు… ఇప్పటికీ తను RINPASలో ఉన్నారు… నిజమే… సునీత పట్ల సదరు యజమానుల హింస చూసి పిచ్చోడైపోయినట్టున్నాడు… తల్లి పైశాచికత్వం చూసి మైండ్ దెబ్బతిని ఉంటుంది…!! ఇది ఈ మొత్తం వార్తలో వీసమెత్తు మానవత్వపోకడలు కనిపిస్తున్న వాసన… అంతే…
Share this Article