ఆర్కియాలజిస్టు నాగార్జున వారణాసిలో ఓ శిథిలాలయాన్ని పునరుద్ధరిస్తుంటాడు… తనకు కొన్ని శక్తులు కనిపిస్తుంటాయి… సైంటిస్టు షారూక్‌ఖాన్ బ్రహ్మాస్త్ర మూలశక్తి కోసం అన్వేషిస్తుంటాడు… తనకు ఏదో లింకులు కనిపిస్తుంటాయి… విలన్ మౌనీరాయ్ తన గ్యాంగుతో బ్రహ్మాస్త్రాన్ని సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది… ఆధ్యాత్మిక గురు అమితాబ్ బచ్చన్ శివుడే ఓ అగ్నిఅస్త్రమని కనిపెడతాడు… బ్రహ్మాస్త్ర సాధనలో నువ్వూ ఓ ఆయుధమే అని చెబుతాడు… ఇంకోవైపు ఆలియాభట్ శివుడిలో శక్తిని కనిపెట్టి, తన ప్రేమలో పడిపోతుంది… అందరూ బ్రహ్మాస్త్రం కోసం తన్నుకుంటుంటారు…
ఎహె, ఏమిటిదంతా..? బ్రహ్మాస్త్ర పోస్టర్లు, టీజర్లు చూడబోతే హీరోహీరోయిన్ల లవ్వు, సాంగులు గట్రా ఉన్నయ్, నువ్వే ఏదో వేదకాలం నాటి అస్త్రాల గురించి మాట్లాడతావేంటి అని విసుక్కోకండి… ఇదేదో కార్తికేయ-2 కథలాగే అనిపిస్తోంది అనీ సణగకండి… ఛాయలు అవే… ఇప్పుడు సినిమాల్లో నడిచేవి ఈ సినిమాలే… 8 ఏళ్ల నుంచి ఈ దర్శకుడు అయాన్ కథను చెక్కుతూ వస్తున్నాడట… సినిమా తీయడమే నాలుగేళ్లుగా సాగుతోంది… సరిగ్గా ఆ ట్రెండ్ నడిచే సమయానికి రిలీజ్ చేసుకోగలుగుతున్నాడు… ఆ సెట్లలోనే రణబీర్‌కపూర్, ఆలియాభట్ మనస్సులు కలిశాయి, డేటింగ్ కుదిరింది… పెళ్లి జరిగింది… రేపోమాపో బిడ్డో, కొడుకో… మొత్తం పార్టులన్నీ అయిపోయేనాటికి ఎందరో…
Ads
కథ విషయానికి వస్తే… హిందీ మీడియా, సైట్లు వాటంతటవే భలే కథలు అల్లి చెబుతున్నాయి… కొన్ని ఆసక్తికరంగా ఉన్నయ్, నిజంగా బ్రహ్మాస్త్ర కథ అది కాకపోవచ్చుగాక, కానీ చదవడానికి ఇంట్రస్టింగు… అందులో ఒకటి ఆలియాభట్ నిజానికి హీరోయిన్ కాదట… ఆమే ప్రధాన విలన్ అట… శివుడిపై ప్రయోగించబడిన హానీ ట్రాప్ అట… వావ్… నిజమే అయితే కథ మాంచి రసకందాయంలో నడుస్తుందన్నమాట… ఐనా ఇది ఫస్ట్ పార్టేగా… మొత్తం మూడు పార్టులు… మరి బ్రహ్మాస్త్రం అంటే మాటలా..,?
ఒకాయన మరో కథ రాసుకొచ్చాడు… శివుడు ఇంజనీరింగ్ విద్యార్థి… నిజానికి తనే అగ్నిఅస్త్రం… ఆలియాభట్ కూడా ఇంజనీరింగ్ చదువుతూ ఉంటుంది… శివుడి తండ్రి ఓ చిన్న రైతు… ఆలియా తండ్రి ఠాకూర్… వాళ్ల ప్రేమను గమనిస్తాడు, హెచ్చరిస్తాడు, ప్రాణాలతో వదిలేస్తాడు… శివుడి కుటుంబం లక్నోకు పారిపోతుంది… తరువాత శివుడి శక్తిరహస్యాన్ని అమితాబ్ వివరిస్తాడు… వర్తమాన కాలానికీ, నాటి వేదకాలానికీ అంటే రెండు టైమ్ ఫ్రేముల మధ్య కథ అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది…
అప్పట్లో బ్రహ్మాస్త్రాన్ని అయిదు అస్త్రాలుగా తెగనరికి వేర్వేరుగా భద్రపరుస్తారట… అవి తాళ, వాయు, అగ్ని, జల, నాభ అస్త్రాలు… వాటికి రక్షణగా వానరాస్త్రం వంటి జంతుఅస్త్రాలు కూడా ఉంటాయట… వీటిల్లో జలఅస్త్ర పాత్ర దీపిక పడుకోన్ పోషించిందట… సర్‌ప్రయిజ్ ఎలిమెంటుగా ప్రవేశపెడతారన్నమాట… ఈ బ్రహ్మాస్త్రాన్ని అయిదు ముక్కలు చేయడం ఏమిట్రోయ్ అని జుత్తు పీక్కోకండి… ఆఫ్టరాల్ సినిమా కథ… ఫాంటసీ,.. క్రియేషన్… ష్… నాలుగైదేళ్ల వెనక్కే కాదు, వర్తమానం దాటి భవిష్యత్తులోకి కూడా వెళ్తుందట కథ… ఆదిత్య-369 తరహాలో… బహుశా రాబోయే పార్టుల్లోనేమో…
ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… పురాణాలతో లంకె పెట్టి, ఫాంటసీ కథను, భీకరమైన గ్రాఫిక్స్, బీభత్సమైన బీజీఎంతో చెప్పడమే నేటి ట్రెండ్… అఫ్‌కోర్స్, కాస్త లక్కు కూడా తోడవ్వాలి… అంతేతప్ప నేను దివ్యాంగుడినే అయినా సైన్యంలో చేరి మస్తు ఉద్దరిస్తాను, నేను అర్జెంటుగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మైక్ టైసన్‌ను కూడా కొట్టేసి ప్రపంచవిజేతను అవుతాను వంటి కథలకు చెలామణీ లేదు ఇప్పుడు… కాస్త కార్తికేయ వాసనలు కొట్టాలి… బ్రహ్మాస్త్ర సినిమా నిండా ఆ వాసనలే… మరి బాయ్‌కాట్ అంటున్నారు కదా అంటారా..? సినిమా కాస్త బాగున్నా సరే, అవన్నీ చల్తా నై… అసలే బాలీవుడ్ ప్రేక్షకుల రాక కోసం ఆకలితో ఉంది… ఆగదు…!!
Share this Article