ఔనా…? నిజమేనా..? అబ్బఛా…! రాహుల్ గాంధీకి అద్భుతమైన నాయకత్వ లక్షణాలున్నయ్, కానీ సీనియర్లే పార్టీకి శాపాలయ్యారు… కోట్లకుకోట్లు కుమ్మేసి, ఇప్పుడు కాంగ్రెస్‌ను నట్టేట ముంచి ఎవడి దారి వాడు చూసుకుంటున్నాడు, దుర్మార్గులు… ఇన్నేళ్లూ అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు పార్టీకి ద్రోహం చేస్తున్నారు అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ శోకాలు పెట్టాడు ఈరోజు తన పత్రికలో… ఫాఫం, జాలేసింది… ఆర్కే ఇక మారడు…
గులాం నబీ ఆజాద్ అట, వైఎస్ దగ్గర డబ్బులు కొట్టేసి, సోనియా కళ్లకు గంతలు కట్టి, పెద్ద లీడర్‌ను చేశాడట, తరువాత తను చనిపోవడంతో కాంగ్రెస్‌కూ దిక్కూదివాణం లేకుండా పోయిందట… అదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో…!! ఆర్కే వంటి జర్నలిస్టులు కొన్నిసార్లు సమాజానికి అవసరం, ఇలాంటి సందర్భాల్లో యాణ్నుంచి వస్తారురా అనిపిస్తుంటుంది…
తనకు తెలియక కాదు… రాహుల్‌ను ఎత్తుకోవడం, తనకేవో నాయకత్వ లక్షణాలున్నయ్ గానీ, సీనియర్లే భ్రష్టుపట్టిస్తున్నారని బురద జల్లడం… పోయిన ఎన్నికలకు ముందు చంద్రబాబు మస్తు డబ్బుసాయం చేసి, కాంగ్రెస్ గెలుస్తుందని భ్రమపడి, చివరకు భంగపడి, ఇప్పుడు మోడీ అంటే గడగడా వణికిపోతున్న సీన్ ఆర్కే మరిచిపోయాడా ఏంటి… సేమ్, కేసీయార్ కూడా అవే కారణాలతో బీజేపీకి ఫస్ట్ టార్గెట్ అయ్యాడనీ విస్మరించాడా ఏంటి..?
Ads
గులాం నబీ ఆజాద్ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ భ్రష్టుపట్టిపోయిందట… నిజానికి తెలంగాణలో కేసీయార్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం జరగకుండా, డీల్ తన అజ్ఞానంతో చెడగొట్టింది దిగ్విజయ్ సింగ్… లేకపోతే ఈరోజు కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసిపోయి ఓ భిన్న రాజకీయ చిత్రం ఉండేది తెలంగాణలో… దిగ్గీరాజా ఓ వేస్ట్ ఫెలో… నిజానికి గులాం నబీ ఆజాద్ వైఎస్ కాంగ్రెస్‌ను వీడిపోకుండా సెట్ చేశాడు… పార్టీకి మస్తు ఆర్థిక సత్తాను అందించేలా చేశాడు…
ఎప్పుడైతే వైఎస్ మరణించాడో, జగన్‌ను చేజేతులా సోనియా దూరం చేసుకుంది… బెదిరించింది, దాంతో ఇటు తెలంగాణలో దిగ్గీరాజా మూర్ఖత్వం కారణంగా… అటు ఏపీలో జగన్‌ను సరిగ్గా టాకిల్ చేయలేని అసమర్థత కారణంగా… తెలుగు రాష్ట్రాల్లో ధ్వంసమైపోయింది… మరి రాహుల్ పాత్ర ఏమిటి..? జీరో..!! అసలు ఏ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో, తన వారసత్వం ఏమిటో, తనేం చేయాలో సోయి ఉంటే కదా… ఓ పిచ్చి కోటరీని వెంట పెట్టుకుని చేజేతులా తన కెరీర్‌ను ఖడ్గతిక్కనలాగా మార్చుకున్నాడు…
జగన్, కేసీయార్ మాత్రమే కాదు… మరో ఉదాహరణ… ప్రజెంట్ అస్సోం సీఎం హిమంత విశ్వశర్మ నిజానికి కాంగ్రెస్ మనిషే… అక్కడ తరుణ గగోయ్‌తో విభేదాలు… అహ్మద్ పటేల్, సోనియా హిమంతను బుజ్జగిస్తూ వచ్చారు… కానీ ఓరోజు హిమంత అండ్ టీంను పిలిచి మరీ, వాళ్లు వచ్చాక రాహుల్ తన కుక్కలతో ఆడుకుంటూ వాళ్లతో మాట్లాడకుండా అవమానించాడు… ఆ కోపంతో అస్సోం వెళ్లిన హిమంతను బీజేపీ పికప్ చేసింది, నువ్వే సీఎం అని చెప్పింది… అన్నట్టుగానే హిమంత కసిగా కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టి అస్సోంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చాడు… ఎవరిది తప్పు… ఇవేనా రాహుల్ నాయకత్వ లక్షణాలు.., పైగా సీనియర్లే చెడగొడుతున్నారంటూ రాధాకృష్ణ ఫ్రెష్ ఏడుపు దేనికో అర్థం కాలేదు…
అంతేనా..? జ్యోతిరాదిత్య సింథియా ఎవరి కారణంగా పార్టీని విడిచిపెట్టాడు..? సచిన్ పైలట్ ఎందుకు ఊగిసలాటలో పడ్డాడు… ఇప్పుడు అశోక్ చవాన్ ఎందుకు జంప్ కాబోతున్నాడు..? భారత్ జోడో వంటి యాత్రలతో ఒరిగేదేమిటి..? అసలు సమస్య రాహుల్‌కు స్వతహాగా లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవు… దానికితోడు తనను దారుణంగా రాంగ్ ట్రాక్ పట్టించే ఒక పిచ్చి కోటరీ…
జీ-23 పేరిట చాలామంది సీనియర్లు కలిసి చాలా రోజుల క్రితం ఓ లేఖ రాశారు… ఇప్పటివరకూ దాని మీద దిద్దుబాటు లేదు…! కపిల్ సిబల్ ప్రజాక్షేత్రంలో లేని నేత కావచ్చుగాక, కానీ లీగల్‌గా పార్టీకి తను చేసిన సేవలకు సార్థకతే లేదా..? అర్థరాత్రిళ్లు సుప్రీం తలుపులు తెరిపించగల సమర్థుడు తను… పోనీ, వాళ్లందరూ దుర్మార్గులే అయితే అందరినీ బయటికి పంపించేయవచ్చు కదా, ఆ సాహసం కూడా లేదు… రాహుల్‌కు నాయకత్వం వద్దట, కానీ కీలక నిర్ణయాలన్నీ తనే తీసుకుంటూ ఉంటాడుట… ఎందుకీ దోబూచులాట…? కాంగ్రెస్ మునిగిపోతున్న ఓ టైటానిక్ కాబట్టే సీనియర్లు ఇక దిక్కులేక సొంత దారులు వెతుక్కుంటున్నారు… ఎనిమిదేళ్లుగా పార్టీనే అంటిపెట్టుకునే ఉన్నారు కదా, ఇప్పుడు ఆశలు అడుగంటాయి కాబట్టే, అడుగులు పక్కదోవల్లోకి పడుతున్నయ్… ఒక అనివార్యత అది…
చదవేస్తే ఉన్న మతిపోయినట్టు… రాధాకృష్ణకు కాంగ్రెస్ సీనియర్లు కోట్లకుకోట్లు కుమ్మేసి, పార్టీకి ద్రోహం చేసిన దుర్మార్గుల్లాగా కనిపిస్తున్నారు… ఏ పార్టీలో ఎవరు శుద్ధపూసలో కాస్త వివరిస్తే బాగుండు… రాజకీయ నాయకుడు అంటేనే అనైతికం, తన స్వార్థం తను చూసుకుంటాడు… కాంగ్రెస్ అహోబిలం మఠం కాదు… వందేళ్ల అవలక్షణాలు… ఇప్పుడు అది మునిగిపోతున్నది కాబట్టే, ఒక్కొక్కరూ బయటపడుతున్నారు… దానికి షిప్ వారసత్వ కెప్టెన్ అని భావించే రాహులే ప్రధాన కారకుడు… ఇక అర్థం లేని, సందర్భరహితమైన ఈ డప్పు ఆపండి డియర్ ఆర్కే గారూ…!!
Share this Article