బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసమే హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా, అట్టహాసంగా నిర్వహించాలని భావించింది… సరే… కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లో ఉంది… ఒక జాతీయ ప్రభుత్వం ఒక చరిత్రాత్మక దినాన్ని స్మరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తే తప్పులేదు… ఇక్కడ సమస్య వేరు… రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆ సందర్భాన్ని ఓ స్మారక కార్యక్రమంగా నిర్వహించడానికి సిద్ధంగా లేదు గనుక కేంద్రమే పూనుకోవడం ఓ విశేషం… పనిలోపనిగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ తన లాభం సొంత చూసుకోవడం వేరే సంగతి…
ఆయ్ఁ, ఈ పేరుతో మతకల్లోలాల్ని సృష్టిస్తారా..? ఇది జాతివిభజన కుట్ర అని నిన్నమొన్నటిదాకా వీరంగం వేశారు టీఆర్ఎస్ వర్గీయులు… అసలు నిజాం పాలన ఎంత స్వర్ణయుగమో కదా అన్నంత భ్రమల్లో తను బతుకుతూ, మనల్ని కూడా అలాగే బతకమన్నాడు కేసీయార్ నిన్నటిదాకా..! ఠాట్, ఈ విమోచన దినాన్ని నేను నిర్వహించనుపో అనేవాడు… కారణం అందరికీ తెలుసు… మజ్లిస్‌కు కోపం రావద్దు, తద్వారా ముస్లింలు దూరం అవుతారమో అనే భయసందేహం…
ఇది మతకల్లోలాన్ని మళ్లీ సృష్టించడం ఏమిటి అసలు..? ఆగస్టు 15, మనం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాం… అంటే విమోచనం… దాన్నలాగే పాటిస్తాం… సెలబ్రేట్ చేసుకుంటాం… ఒకరోజు ముందుగా పాకిస్థాన్ కూడా స్వాతంత్య్ర సంగ్రామ దినంగానే నిర్వహిస్తుంది… రెండు ప్రాంతాలూ పరాయి పాలన నుంచి విముక్తి పొందిన సందర్భం అది… అంతే… తెలంగాణ కూడా అంతే… సెప్టెంబరు 17 దానికి విముక్తి దినం… హైదరాబాద్ రాజ్య ప్రజల అభీష్టం మేరకే భారతీయ సైన్యం విమోచనాన్ని ప్రసాదించి, ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన దినం… అది సమైక్యతా దినం ఎలా అయ్యింది..?
Ads
దేశం నడిబొడ్డున చైనా లేదా రష్యా అనుకూల ఎర్ర రాజ్యం ఏర్పడకుండా ఇండియన్ యూనియన్ హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకుందనే కారణం చూపి కొందరు దీన్ని విద్రోహదినం అంటారు… నయానో భయానో సంస్థానాల్ని యూనియన్‌లో కలిపేస్తున్న రోజులవి… నిజంగానే దేశం నడిబొడ్డున పాకిస్థాన్ నంబర్ టూ లేదా కమ్యూనిస్టు రాజ్యం స్వతంత్రంగా కొనసాగడం ఇండియన్ యూనియన్ ప్రభుత్వానికి ఇష్టం లేదు… భారతీయ సైన్యానికి స్వాగతాలు చెబుతూ హైదరాబాద్ ప్రాంత ప్రజలు కూడా యూనియన్‌లో నిర్బంధ విలీనాన్ని ఆమోదించారు… ఆకాంక్షించారు…
ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే… సహజంగా ఓ చర్చ జరుగుతుంది… కానీ తెలంగాణలో అదేమీ ఉండదు… ఒక్కసారి ఎగువన ఓ ఫోటో చూడండి… అదే హైదరాబాద్ రాజ్యం నుంచి విడిపోయి కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో, మరికొన్ని జిల్లాలు కర్నాటకలో కలిశాయి… ఇప్పటికీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు… ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే… విమోచన దినోత్సవం, ముక్తి సంగ్రామ దినంగానే అధికారికంగా నిర్వహిస్తాయి… గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉండి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని తొక్కిపడేసిన రోజుల్లో ఎవరూ పట్టించుకోరు, అప్పుడు ఇదే కేసీయార్ గొంతెత్తి గర్జించాడు, ఎందుకు విమోచన దినాన్ని నిర్వహించరు అని..!
ఇప్పుడు కేంద్రమే రంగంలోకి దిగుతుండేసరికి, ఏం చేయాలో పాలుపోక, ఎలా కౌంటర్ చేయాలో తెలియక… ఇలా ఓ కొత్త పేరు పెట్టి, సమైక్యతాదినం అని తనే ముందుకొచ్చాడు… నిజాంను ఏమీ అనకుండా ఇలా నిర్వహిస్తే సరి అని ఒవైసీ చేసిన సూచనా..?! విమోచన, విముక్తి పదాలు అక్కర్లేదట… ఎందుకు వద్దు..? హఠాత్తుగా ఈ సమైక్యతా భావన ఎందుకు తెరమీదకు వచ్చింది..? అది తప్పు పదం కాదు, కానీ స్మరించుకోవాల్సింది విమోచనను కదా… సెలబ్రేట్ చేసుకోవాల్సింది విముక్తిని కదా… ఆ పదాలు లేకుండా సమగ్రత, సమైక్యత పదాలతో కొత్త భావనల్ని ఆ సందర్భానికి రుద్దుడు దేనికి..? తెలంగాణ ముక్తిసంగ్రామ దినం ఎందుకు కాకూడదు..?!
కేంద్రం నుంచి దిగుమతయ్యే నేతలు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను పొగడ్తల్లో ముంచెత్తుతారు… ఆయనేదో బీజేపీ పూర్వీకుడు అయినట్టుగా రాష్ట్ర అధికార పార్టీ ఆ పేరును కూడా ఉచ్చరించదు… అమిత్ షా తదితరులు నిజాం పాలనలో అకృత్యాల్ని తిట్టేస్తారు… రాష్ట్ర అధికార పార్టీ నిజాంను పల్లెత్తు మాట కూడా అనదు… ఇదీ రెండు క్యాంపులుగా జరిగే కేంద్ర, రాష్ట్ర విడివిడి విమోచన సమైక్యతాదినం కథ… ఇక్కడ మరొకటీ చెప్పాలి… మార్క్కిస్టు పత్రికలో ఒకాయన రాసుకొచ్చాడు, ఈ విముక్తికి వారసులం మేమే అని… ఆ పార్టీ ఆత్మవంచన దినం అని నిర్వహించుకోవడం సబబు… అదెందుకో చెప్పాలంటే అదే పెద్ద పుస్తకం అవుతుంది…!! కేసీయార్ పిలవగానే ఇదే ఎర్రన్నలు వెళ్లి… జై సమైక్యతాదినం… అని నినాదాలు చేస్తారేమో అమరుల ఆత్మల్ని మరో మైలు లోపలకు పాతిపెట్టి…!!
Share this Article