అనుమానించడంలో తప్పు లేదు… టాటా గ్రూపు మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణ కారణాల్ని శాస్త్రీయంగా అన్వేషించడంలో తప్పులేదు, నిజానికి అవసరం కూడా…! కార్పొరేట్ దుర్మార్గ ప్రపంచంలో దేన్నీ తేలికగా తీసుకునే చాన్స్ లేదిప్పుడు… మిస్త్రీకి శత్రువులు లేరనీ కాదు..! అయితే తనను బలిగొన్న రోడ్డు ప్రమాద దృశ్యాలను చూస్తుంటే మాత్రం, పెద్దగా సందేహించే పనిలేదని, అది రోడ్డు ప్రమాదం తప్ప, మరో కుట్ర జరిగిందనే సందేహాలేవీ కలగడం లేదు… పోలీసులు కూడా రోడ్డు ప్రమాదం కోణంలోనే కేసు నమోదు చేసుకున్నారు… కానీ..?
కొన్ని అంశాలపై స్పష్టత అవసరం… పోలీసులకే అవి అంతుచిక్కడం లేదు… మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ‘భిన్నమైన కోణాల్లో సమగ్ర దర్యాప్తు’ సాగాలని ఆదేశించాడు… కొన్ని విషయాల్ని పరిశీలిద్దాం…
– అహ్మదాబాద్ నుంచి ముంబైకి తామే డ్రైవ్ చేస్తూ, రోడ్డు మార్గంలో ఎందుకొస్తున్నారు..? అది డేరియస్ పండోలే కారు… డ్రైవ్ చేస్తున్నది ఆయన భార్య అనహిత… డేరియస్ తమ్ముడు జెహంగీర్ కూడా కారులో ఉన్నాడు… డేరియస్ కుటుంబం సాధారణంగా విమాన ప్రయాణాలే చేస్తుంటుంది…
Ads
– వాళ్లదీ కార్పొరేట్ కుటుంబమే… జేఎం ఫైనాన్షియల్ ఈక్విటీ సంస్థ ఎండీ, సీఈవో డేరియస్ పండోలే… టాటా గ్రూపులో ఇండిపెండెంట్ డైరెక్టర్… మిస్త్రీని బయటికి పంపించడాన్ని వ్యతిరేకించినవాడే… మిస్త్రీ మద్దతుదారు… కానీ హఠాత్తుగా మిస్త్రీ వాళ్లతోపాటు ముంబైకి వాళ్ల కారులో ప్రయాణించడానికి ఎందుకు రెడీ అయ్యాడు..?
– డేరియస్ సోదరుడు ఒకాయన పక్షం రోజుల క్రితం మరణించాడనీ, తనకు సంబంధించిన ఏవో కర్మల్లో పాల్గొనడానికి ఈ కుటుంబం గుజరాత్, వల్సాద్‌లోని ఉద్వాద పార్శీ ఫైర్ టెంపుల్‌కు వెళ్లిందనీ, అక్కడి నుంచి వాపస్ వస్తుంటే మిస్త్రీ వాళ్లకు జతకలిశాడనీ అంటున్నారు… తనూ ఆ కార్యక్రమం కోసమే వెళ్లాడా, వేరే పని మీద వెళ్లి, వీళ్లతో కలిసి ముంబై వస్తున్నాడా క్లారిటీ లేదు…
– అనహిత బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఫేమస్ గైనకాలజిస్టు… మంచి పేరే ఉంది… ప్రత్యేకించి తమ పార్శీ కుటుంబాల్లో సంతానరేటు తగ్గిపోవడంతో, దాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది… ఈ ప్రయాణ సమయంలో వాళ్ల డ్రైవర్ ఏమయ్యాడో తెలియదు… డేరియస్ సోదరుడు వెనక కూర్చున్నాడు… భార్య డ్రైవ్ చేస్తోంది… భర్త పక్కన కూర్చున్నాడు…
– పాల్ఘార్ దగ్గర సూర్య నదీప్రవాహం మీద కట్టిన ఓ చిన్నవంతన పారాపిట్‌కు కారు గుద్దుకోగానే ఎయిర్ బ్యాగ్స్ ఓపెనయ్యాయి… గాయాలకు గురైనా ముందు సీట్లలో కూర్చున్న అనహిత, డేరియస్ ప్రాణాలతో బయటపడ్డారు… దగ్గరలోనే ఛరోటీ టోల్ నాకా ఉండటంతో సమయానికి రెస్క్యూ చేసి, హాస్పిటల్‌కు తరలించారు… ఐనా సరే, అప్పటికే వెనక సీట్లలో కూర్చుని ఉన్న సైరస్, జెహంగీర్ మరణించారు…
– వాళ్లది మెర్సిడెస్… బలమైన, దృఢమైన వాహనమే… చాలా భద్రత పరీక్షల్లో పాసయ్యాకే రిలీజ్ చేస్తారు… ఐనా ఇంజన్ విడిపోయి పక్కన పడింది… ఎంత స్పీడుగా వస్తున్నా సరే, మరీ అంత తీవ్రత కనిపించడం అసాధారణంగా ఉంది… పైగా ముందు సీట్లలో వాళ్లు సేఫ్‌గా ఉండి, వెనుక సీట్లలో ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మరణించడం కూడా అసాధారణమే… అలా జరగకూడదని ఏమీ లేదు… కానీ సందేహాల్లో, దర్యాప్తులో ప్రతిదీ పరిగణనాంశమే…
Share this Article