రాజకీయ గురువుతో ‘అఫైర్’ నుంచి బయటిపడి భర్తతో దాంపత్య జీవితాన్ని కాపాడుకున్న కాబోయే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ నిజంగా గ్రేట్…. బ్రిటిష్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన మేరీ ఎలిజబెత్ ట్రస్ (47) దాంపత్య జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మీకూ చెప్పాలనిపించి రాస్తున్నాను. బోరిస్ జాన్సన్ రాజీనామాతో పాలకపక్షమైన కన్సర్వేటివ్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం కోసం భారత పంజాబీ ఖత్రీ రిషి సునక్ నుంచి ఎదురైన పోటీలో విజేతగా నిలిచిన లిజ్ ట్రస్ జీవిత విశేషాలు రెండు నెలల క్రితం చదివినప్పుడు ఈ విషయం తెలిసింది. కలిసి పనిచేసిన తోటి అకౌంటెంట్ హ్యూ ఓ లియరీ(48)ని ఆమె 2000లో పెళ్లాడింది. మూడేళ్ల స్నేహం తర్వాత వారి గాఢ ప్రేమ పెళ్లికి దారితీసింది.
అయితే, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కన్సర్వేటివ్ పార్టీ మాజీ ఎంపీ మార్క్ ఫీల్డ్ తో కొన్నాళ్లు సాగిన ఆమె ‘అఫైర్’ 2006లో బయటి ప్రపంచానికి వెల్లడవడంతో లిజ్, హ్యూల సంసారం ‘కూలిపోయే’ పరిస్థితి ఎదురైంది. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న ప్రేమానురాగాలు ఈ ఇబ్బందిని జయించాయి. భర్త హ్యూ ఆమె అఫైర్ ను అర్ధం చేసుకున్నాడు.
గతాన్ని మరిచి వారిద్దరూ జీవితంలో ముందుకు సాగిపోయారు. కన్సర్వేటివ్ పార్టీలో తనకు బాగా జూనియర్ అయిన లిజ్ తనకు సహాయకురాలిగా ఉండగా ఈ సంబంధాన్ని ఎంపీ మార్క్ ఫీల్డ్ ‘అఫైర్’గా మార్చుకున్నాడు. లిజ్ కూడా మార్క్ కు ఉన్న హోదా, అధికారం కారణంగా అందుకు అంగీకరించిదని అంటారు. మొత్తానికి ‘వివాహేతర సంబంధం’ ఈ చక్కటి యువ భార్యాభర్తలను విడదీయలేకపోయింది. దాంపత్యంలో చెలరేగిన సంక్షోభం వారి బంధాన్ని మరింత బలోపేతం చేసింది.
Ads
Share this Article