తెలుగు ప్రజల్లో ప్రాంతీయ చిచ్చు పెట్టినవి ఏమిటి..? ఉద్యోగాలు, అడ్మిషన్లు… ఎవరు స్థానికుడు, ఎవరు స్థానికేతరుడు అనే పంచాయితీలే… జై ఆంధ్రను, జై తెలంగాణను రగిలించాయి… మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది కూడా హైదరాబాద్ ఫ్రీజోన్ అనే తగాదాతోనే…! చివరకు విడిపోయాం… ఎవరి బతుకు వాళ్లదే… కాదు, విభజన తగాదాలు సాగుతూనే ఉంటయ్… ఉన్నయ్…
పోతిరెడ్డిపాడు పొక్కను ఇంకా తవ్వీ తవ్వీ, నీళ్లను జగన్ ఎత్తుకెళ్తానంటున్నాడు… నిధులు మాయమైపోయి రెండున్నర లక్షల కోట్ల అప్పు చేతికొచ్చింది… ఇంకా పెరగనుంది… నియమాకాలు పడకేశాయి… కనీసం తెలంగాణ సొంత ప్రభుత్వం వచ్చినా సరే, ఈ అడ్మిషన్లు, రిక్రూట్మెంట్ల మీద సొంత సోయి, స్థానిక సోయి అనేది ఉందా..? అసలు ఎవరైనా ఆలోచిస్తున్నారా..? ఏమైపోయారు వీరతెలంగాణవాదులు..?
Ads
ఎస్, 1969 నుంచీ కాలేజీ అడ్మిషన్లు, లోకల్-నాన్ లోకల్ అనే ఇష్యూయే ప్రధానం కదా… మరి తెలంగాణలో మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వమే స్థానిక విద్యార్థులకు అన్యాయం చేస్తుంటే… ఆంధ్రా విద్యార్థులు లబ్ధి పొందుతుంటే… అసలు ఎవరైనా పట్టించుకున్నారా..? పోనీ, ఒక పత్రిక ఫస్ట్ పేజీలో దీన్ని వెలుగులోకి తెచ్చింది… అప్పుడైనా దాని మీద ఫోకస్ పడాలి కదా… అదీ లేదు… ఆ వార్త ఏమిటంటే..?
డెక్కన్ క్రానికల్లో వంశీ శ్రీనివాస్ రాసిన స్టోరీ తెలంగాణ మెడికల్ యూనివర్శిటీ అవగాహన లేమిని, నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది… చాలామందికి ఇందులోని సంక్లిష్టత అర్థం కాకపోవచ్చు… కానీ అడ్మిషన్ల యవ్వారాలు తెలిసినవాళ్లకు సులభంగానే అర్థమవుతుంది… మల్లారెడ్డి కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ ఇవ్వకుండా, అయిదేళ్లు బ్యాన్ పెట్టడం పెద్ద వార్త అయ్యింది గానీ… అసలు ఈ మెడికల్ సీట్ల నష్టం మిగతా మీడియాకు, పార్టీలకు వార్త ఎందుకు కాకుండా పోయింది..?
సింపుల్… కాలేజీల్లో 85 శాతం లోకల్, 15 శాతం ఓపెన్… అయితే ముందుగా ఓపెన్ నింపాక, లోకల్ కోటా నింపాలనేది సుప్రీం కోర్టు డైరెక్షన్… కానీ తెలంగాణ మెడికల్ యూనివర్శిటీ ఏం చేస్తోంది..? సెకండ్ కౌన్సిలింగుకు వచ్చేసరికి ఓపెన్లో ఖాళీ అయిన సీట్లలో ఆంధ్రా పిల్లలను నింపుతోంది… మెరిట్ ఉన్నవాళ్లే కానీ… ఈ యూనివర్శిటీ అనుసరించే పద్ధతి వల్ల తెలంగాణ పిల్లలకు అన్యాయం జరుగుతోంది… ఎలా అంటే..,?
ఓపెన్ కోటాలో ఖాళీల్ని ముందు భర్తీ చేసేయాలి… ఎలా..? మెరిట్, అంటే ర్యాంకులను బట్టే… దానివల్ల లోకల్ కోటాలో సీట్లు పొందిన మంచి ర్యాంకర్లు ఓపెన్ కోటాలోకి వస్తారు, ఈమేరకు లోకల్ కోటాలో ఖాళీలు ఏర్పడతాయి… అవి స్థానికులతోనే నింపాలి… సింపుల్… కానీ వీళ్లు ఏం చేస్తున్నారు..? ఓపెన్ కోటాలో ఖాళీలను విడిగా కౌన్సిలింగు ద్వారా నింపుతున్నారు… దీనివల్ల ఆంధ్రా పిల్లలు ఉస్మానియా, గాంధీ వంటి కాలేజీల్లోనూ సీట్లు పొందుతున్నారు…
కరీంనగర్, ఖమ్మం, ఇతర ప్రభుత్వ కాలేజీల్లోనూ ఈమధ్య భర్తీ చేసిన తీరు గమనిస్తే… ఎందరు స్థానిక పిల్లలు నష్టపోయారో తేలుతుంది… ఇదే సమస్య ఆంధ్రా మెడికల్ యూనివర్శిటీకి కూడా వచ్చింది… కానీ అధికారులు ఎంచక్కా ఈ లోకల్, నాన్-లోకల్ సీట్ల భర్తీని సుప్రీం డైరెక్షన్స్ ప్రకారం చేసుకుంటున్నారు… దీనివల్ల ఆంధ్రా పిల్లలకే లబ్ధి కలుగుతోంది… ఇటు తెలంగాణ యూనివర్శిటీ తీరుతోనూ ఆంధ్రా పిల్లలకే లబ్ధి… వెరసి తెలంగాణ పిల్లలకు నష్టం…
ఒక మెడికల్ సీటు విలువ ఏమిటో తెలుసు కదా… ఎంత కట్ థ్రోట్ పోటీ ఉంటుందో తెలుసు కదా… అసలు మెడికల్ సీట్ల దందా ఎంతటి మాఫియా తరహాయో తెలుసు కదా… అలాంటప్పుడు ఒక్కో సీటూ ముఖ్యమే… మరి తెలంగాణ వైద్య యూనివర్శిటీకి ఎందుకు పట్టడం లేదు..? పోనీ, మేం చేసేదే కరెక్టు అని భావించే పక్షంలో అదయినా ఎందుకు చెప్పడం లేదు..? అసలు ఆంధ్రా యూనివర్శిటీ అనుసరించే పద్ధతే తెలంగాణ కూడా పాటిస్తే, అది తెలంగాణ పిల్లలకే మేలు కదా… ఈ బేసిక్ లాజిక్ ఎందుకు మరిచిపోయారు..? అసలు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి అంశాల్ని గాలికి వదిలేసిందా..?!
Share this Article