మొన్న ఓ వార్త… ప్రఖ్యాత పాత్రికేయుడు, మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ ఒక అవార్డును వాపస్ చేస్తున్నట్టు ప్రకటించాడు… నిజమే, తనకు పాత్రికేయంలో మంచి పేరుంది… ఐనంత మాత్రాన తన ప్రతి చేష్ట ప్రశంసాపూర్వకం అనలేం… చప్పట్లు కొట్టలేం… ఎక్కువ చదివితే బేసిక్స్ మరిచిపోతారు అంటారు కదా… పాత్రికేయంలో ఎదిగీ ఎదిగీ మౌలిక సూత్రాలను, వాటి స్పూర్తిని మరిచిపోయాడేమో అనిపించింది ఓ క్షణం…
ఈ అవార్డు వాపస్ కథేమిటయ్యా అంటే… తనకు కర్నాటకలోని మురుగమఠం 2017లో బసవశ్రీ అవార్డును బహూకరించింది… అది గౌరవమే… అయితే ఇటీవల సదరు పీఠం ప్రధానాధిపతి శివమూర్తి మురుగ శరణారావు మీద పాఠశాల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వచ్చాయి… దాంతో సాయినాథ్ తనకిచ్చిన అవార్డును వాపస్ ఇస్తున్నాననీ, ఆ బాలికలకు సంఘీభావం కోసం, సరైన న్యాయం జరగడం కోసం ఈ నిర్ణయమనీ చెప్పాడు…
నిజంగా సదరు పీఠాధిపతి నేరం రుజువైందా..? ఈయన అవార్డు వాపస్ ఇస్తే, కేసు బలంగా బిగుసుకుంటుందా..? ఐనా ఇదేం సంఘీభావ ప్రకటన..? అది కేవలం పోలీసులు పెట్టిన కేసు… అనేక కేసుల వెనుక అనేక కారణాలుంటయ్… చివరకు కోర్టుల్లో కదా నిగ్గుతేలాల్సింది… పోలీసులు కేసు పెట్టగానే నిజంగానే నేరం జరిగిపోయినట్టు నిర్ధారణకు ఎలా వచ్చినట్టు సాయినాథుడు..?
Ads
చివరకు ఎలా తయారైందంటే..? ఆశ్రమం అంటే చాలు, ఓ దొంగ బాబా ఉంటాడు, తను నిజానికి చీటర్, మహిళల్ని లైంగికంగా వాడుకుంటాడు, మాయమాటలతో లొంగదీసుకుంటాడు అన్నట్టుగా ముద్ర పడిపోతోంది… సాయినాథ్ చర్య కూడా ఇలాంటి ప్రచారాల్లో ఇంకాస్త పెట్రోల్ పోసినట్టుగా ఉంది… నిజమేనా..? ప్రతి ఆశ్రమమూ ఓ లైంగిక వేధింపుల కేంద్రమేనా..? ప్రతి స్వామీ కామాంధుడేనా..? దేశంలో కొన్ని వేల ఆశ్రమాలున్నయ్… వేల మంది సన్యాసులు… చాలా ఆశ్రమాల ఉనికి కూడా బయటికి రాదు… అనేక గురుపరంపరలు…
నిజంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడుకుంటూ… ఆత్మశోధన వైపు అన్వేషణ సాగించే ఆశ్రమాలు బోలెడు… 2019లో శివైక్యం పొందిన కర్నాటక వీరశైవ లింగాయత్ శివకుమారస్వామి తన సిద్ధగంగ మఠం ద్వారా లక్షల మందికి గురుకుల విద్యను అందించిన తీరు చదివాం, ఈ ఒక్క మెతుకు చాలదా..? ఆయనకు ప్రభుత్వమే పద్మభూషణ్ ఇచ్చి సత్కరించుకుంది…
నడిచే దేవుడు అని కర్నాటక సమాజం ఆరాధించింది… ఇలాంటివాళ్లు బోలెడు మంది… ఎటొచ్చీ అవి పత్రికల్లో రాయబడవు, టీవీల్లో చూపబడవు… ఎవరో కొందరి పైత్యాన్ని మొత్తం ధార్మిక సమాజానికి ఆపాదించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగుతోంది… ఎందరో విదేశీయులు సైతం ఈ దేశ ఆధ్యాత్మిక పంథా, అందులోని మార్మికత పట్ల ఆకర్షితులై ఇక్కడికి వచ్చేసి, స్థిరపడిపోతున్నారు కదా… కనీసం కొందరి గురించైనా మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం…
నిన్న మనం చెప్పుకున్నాం కదా… సావిత్రి ఖనోల్కర్ గురించి… ఎక్కడో పుట్టి, మన ఆర్మీ ఆఫీసర్‌ను పెళ్లిచేసుకుని, పరవవీరచక్ర వంటి అత్యున్నత సైనిక పురస్కారాల్ని డిజైన్ చేసి, భర్త మరణించాక జీవితాంతమూ రామకృష్ణ మఠం ద్వారా ధార్మికతోవలోనే పయనించింది… మరో ఉదాహరణ చెప్పుకుందాం… ఆమె ఓ మధ్యతరగతి యూదు మహిళ… హాలీవుడ్ ఉన్న లాస్ ఏంజిల్స్‌లో నివాసం… పెళ్లయింది… లైంగిక వేధింపులకు, దాడికి గురైంది…
మానసికంగా కుంగుబాటు వంటి దుష్ప్రభావాలు వేధిస్తున్నయ్… పలు దేశాలు తిరిగింది… భర్త వెకేషన్ కోసం ఇండియాకు వెళ్దాం అన్నప్పుడు కూడా తనకు ఇష్టమైన శాకాహారం మీద ధ్యాసతో సరేనని తలూపింది… దేవుడు, ఆధ్యాత్మికత వంటి భావాలేవీ లేకుండా ఇండియాకు వచ్చింది… ఒక్కసారి గంగలో స్నానానికి అడుగుపెట్టాక ఏవో అవ్యక్త భావనలు చుట్టుముట్టాయి… ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఆమె సైకాలజీలో పీజీ చేసి, పీహెచ్‌డీ స్టార్ట్ చేసింది… అలాంటిది ఆమెకే అర్థం కాని ఏదో మార్మిక భావన ఆమెను ఆవాహన చేసుకుంది…
ఆమెలో ఏదో ఆత్మచలనం… నా జీవితానికి కావల్సిందేమిటో ఇక్కడే ఉందని ఫిక్సయిపోయింది… తరువాత భర్తకు విడాకులు ఇచ్చేసింది… రుషీకేష్‌లో పరామర్థ నికేతన్ అనే ఆశ్రమం చేరింది… అక్కడ స్వామి చిదానంద సరస్వతి కొన్నాళ్లు ఆమె నడవడిక గమనించి, సన్యాస దీక్ష ఇచ్చాడు… ఆమెకు ఇక ఇదే లోకం… సాధ్వి భగవతి సరస్వతిగా పేరు మారింది… మానసిక స్వాస్థత చేకూరింది… సత్సంగ్ సమావేశాలు, యోగ, ధ్యానం, వ్యక్తిత్వ వికాస పాఠాలు, ప్రసంగాలు, పర్యటనలు… దేశవిదేశాల నుంచి కూడా అనేకమంది ప్రముఖులు అక్కడికి వచ్చారు… ఇంటరాక్ట్ అయ్యేది, నేర్చుకునేది, నేర్పించేది…
ఆ ఆశ్రమం ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం’ పేరుతో 11 భాగాల్ని పబ్లిష్ చేయాలని తలపెట్టింది… ఆ ప్రాజెక్టుకు ఈమె మేనేజింగ్ ఎడిటర్… ఆమధ్య ఓ పుస్తకం రాసింది… హాలీవుడ్ టు హిమాలయాస్… జర్నీ ఆఫ్ హీలింగ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్… లాస్‌ఏంజెల్స్ నుంచి రుషీకేష్ వరకు తన జర్నీ ఏమిటో రాసుకుంది… చాలా అప్లాజ్ వచ్చింది ఈ పుస్తకానికి… నెట్‌లో వెతికితే ఆమె గురించి బోలెడు వార్తలు, ఫోటోలున్నయ్… ఆమె బోధనల వీడియోలు కూడా… అవన్నీ ఇక్కడ రాయలేం గానీ… ఒక్కసారి ఆలోచించండి… ఆమెను ఇక్కడికి ఏం లాక్కొచ్చింది..? ఏం కట్టిపడేసింది..?! అనేకమంది విదేశీయులు ఆ గుట్టల్లో, గుహల్లో పడి రోజుల తరబడీ ఏదో అన్వేషిస్తున్నారు… వాళ్లకు ఏం కావాలి..?!
తమ దేశంలో లైంగిక దాడికి గురై, మానసిక స్వస్థత కోల్పోయిన ఆమెకు సాంత్వన ఇచ్చింది ఓ ఆశ్రమమే కదా… చిదానంద సరస్వతి బోధనలతో ఆమె తన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకుంది కదా… గలీజు స్వాములు ఉంటే ఊరుకోవాల్సిన పనిలేదు… అలాగని ప్రతి ఆశ్రమం అలాంటిదే అనే స్థాయిలో దుష్ప్రచారం జరగడం ఖచ్చితంగా చివుక్కుమనిపించేదే..! అనేక రకాలుగా మోసపోయిన మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్న ఆశ్రమాలు ఎన్ని లేవు..?! చెప్పడం మరిచిపోయా… యూనిసెఫ్ నీరు, శుభ్రత, పారిశుధ్యం లక్ష్యాలుగా సర్వమతాల్ని ఇన్వాల్స్ చేసే వాష్ అనే ప్రోగ్రాంకు రూపకల్పన చేసింది… పైన ఫోటో అదే… ఆ గ్లోబల్ వాష్ అలయెన్స్‌కు ఆమె సెక్రెటరీ జనరల్…! ఆమె అసలు పేరు ఎవరికీ తెలియదు..!!
Share this Article