రాజకీయ ప్రత్యర్థులపై దాడికి తెలుగుదేశం శిబిరం అనుసరించే విధానాలు యూనిక్… బహుశా ప్రపంచంలోనే ఇలా బహుముఖ దాడులు చేసేవాళ్లు ఉండరేమో… మొదట ఈనాడులో గానీ, ఆంధ్రజ్యోతిలో గానీ (ఇప్పుడు ఏబీఎన్, టీవీ5 చానెళ్లు జతకూడాయి… అప్పట్లో టీవీ9 కూడా…) వార్తలు వేస్తారు… తరువాత వాటి ఆధారంగా పలుచోట్ల యెల్లో లీడర్లు ప్రెస్‌మీట్లు పెడతారు… మళ్లీ అవి వార్తలుగా వస్తాయి…
రకరకాల ఆరోపణలతో పెద్ద పోస్టర్ ప్రిపేర్ చేస్తారు, దాన్ని ఆవిష్కరిస్తూ చంద్రబాబు ప్రెస్‌మీట్… ఈనాడు ఫుల్ పేజీ కుమ్మేస్తుంది… (జగన్ మీద లక్ష కోట్ల ఆరోపణలు)… వీలైనంతవరకూ దాన్ని లైవ్‌గా ఉంచుతారు… వాటి ఆధారంగా ఫీల్డులో పొలిటికల్ యాక్టివిటీ సరేసరి… ఇతర పార్టీల్లోని యెల్లో అనుకూల పరాన్నజీవుల్ని కూడా రంగంలోకి దింపుతారు… రౌండ్ టేబుల్ చర్చలు, పత్రికల్లో వ్యాసాలు, టీవీల్లో డిబేట్లు నడుస్తుంటాయి…
కేసులు, లీకులు, వాటి ఆధారంగా పేజీల కొద్దీ వరుస కథనాలు, కార్టూన్లు… బజారులోని బురదనంతా ఎత్తుకొచ్చి పత్రికల్లో అక్షరాలుగా పులమడం మరో మోడస్ ఆపరెండి… దీనికి కాస్త భిన్నంగా మరొకటి… తాము విన్నవి, పత్రికల్లో వచ్చినవీ, తాము చెప్పాలనుకున్నవి గట్రా క్రోడీకరించి తమ క్యాంపుకే చెందిన జర్నలిస్టులు, యాక్టివిస్టులు, క్యాంపెయినర్లతో బుక్స్ రాయించడం… అదుగో, అందులో ఏం రాశారో తెలుసా అంటూ ఈనాడు లేదా ఆంధ్రజ్యోతి మళ్లీ పేజీల్లో నిలువెత్తు కాలాల సారాంశాన్ని నింపేయడం… ఇలా ఇంకా చాలా చాలా…
Ads
తాజాగా… అంటే నిన్న ఈనాడు మెయిన్ ఎడిషన్‌లో నాలుగు నిలువెత్తు కాలాల్లో ఓ వార్త కనిపించింది… ఈ వార్త చూడగానే పైన రాసినవన్నీ గుర్తొచ్చాయి… కందుల రమేష్ అనే రచయిత ‘అమరావతి- వివాదాలు- వాస్తవాలు’ అని ఓ పుస్తకం రాశాడుట… బహుశా ఈరోజు దాన్ని ఆవిష్కరిస్తారేమో… అందులో ఏముందో తెలుసా..? అంటూ దాని సారాంశం మొత్తాన్ని అక్కడక్కడా అక్షరాలకు రంగులు పూసి మరీ ప్రచురించింది… మళ్లీ దాని ఆవిష్కరణ సందర్భంగా జరిగే మీటింగు, దాని కవరేజీ, జగన్ ప్రభుత్వంపై దుమ్మూదుమారం ఎలాగూ ఉంటాయి… (రచయిత గతంలో ఆంధ్రప్రదేశ్ అనబడే ప్రభుత్వ అధికారిక మ్యాగజైన్‌కు చంద్రబాబు పాలనకాలంలో ఎడిటర్)…
నిజానికి ప్రఖ్యాత రచయితలు రాసిన పుస్తకాలు, కంట్రవర్సీ సబ్జెక్టులకు సంబంధించి… ముందస్తు ప్రచారం కోసం, ఆ పుస్తకాల్లోని కొంత కంటెంట్ ప్రచురించడం కొన్ని పత్రికలు, న్యూస్ సైట్లలో పరిపాటే… అయితే అది ఈనాడుకు అలవాటు లేదు… సాక్షాత్తూ చంద్రబాబు బుక్ రాసినా సరే… సండే మ్యాగజైన్‌లో ఎక్కడో ఓచోట చిన్న సమీక్షలాగా చెప్పబడే పరిచయం, లేదంటే పుస్తకం అందింది అనే అక్నాలెడ్జ్‌మెంటుతో సరిపెడుతుంది… కానీ ఈ ఒక్క కందుల రమేష్ అనే రచయితకు మాత్రం అన్నింటి నుంచీ మినహాయింపు…
ఇప్పుడే కాదు, ఆమధ్య సేమ్, ఇదే రచయిత ఎన్టీయార్ లౌకికవాదం మీద రాసిన పుస్తకానికి కూడా అంతే… అదీ నాలుగు కాలాల Excerpt పబ్లిష్ చేశారు… ఈ పాత్రికేయ ప్రక్రియకు ఈనాడు జర్నలిజం స్కూల్ అర్జెంటుగా ఏదేని నామకరణం చేయాలి… ఎందుకంటే… ఇవి వార్తలు కావు, ప్రత్యేక కథనాలు కావు, ప్రకటనలు అసలే కావు, ప్రోగ్రాం కవరేజీ కాదు, దందా బాపతు అడ్వర్టోరియల్ కూడా కాదు… అప్పట్లో వచ్చిన ఆ వార్త చదవండి…
ఇప్పటికి పబ్లిష్ కాని, మార్కెట్‌లోని రాని ఒక బయోపిక్ పుస్తకం నుంచి కొన్ని పేరాలు తీసుకుని, నాలుగు కాలాల విస్తీర్ణంలో… ఒక వార్త అనిపించేలా, వార్తగా కనిపించేలా పరిచేయడం నిజంగా ఒక ఈనాడు సగటు పాఠకుడికి విస్తుపోయే విషయమే… అది ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తదితర పత్రికలు చేస్తాయి… కానీ ఈనాడు ఈ పని చేయడమే వింత… ఆ బుక్కుకు ఈనాడు ఇంత మార్కెటింగ్ చేసి పెట్టాలా..? కనీసం సమీక్షలు కూడా సరిగ్గా రాయని ఈనాడు ఒక బుక్కును ఇంత నెత్తిన మోయాలా..? అంత అద్భుత గ్రంథరాజమా అది..? అని అప్పట్లోనే అందరూ మహాశ్చర్యపడిపోయారు…
ఇప్పుడు అమరావతి మీద పుస్తకం కూడా అలాంటి ప్రత్యేక వార్తే (??) పబ్లిష్ చేసి, తనలో తనే మురిసిపోయింది..! అందుకే అది ఈనాడు… తన అవసరానికి, తన టార్గెట్లపై దాడికి ఎలాంటి పాత్రికేయ ప్రక్రియనైనా అవలంబించగలదు..!! (అమరావతి రాజధానిపై జగన్ ఎన్నికల ముందు ఏమన్నాడు..? తరువాత అది ఎలా భ్రష్టుపట్టిపోయింది..? అసలు జగన్ కక్షకు కారణాలేమిటి..? జగన్ చేసేది కరెక్టేనా..? అమరావతి ప్రాంత రైతాంగానికి మోసం చేయడం కాదా..? వంటి ప్రశ్నలు, చర్చల లోతుల్లోకి నేనిక్కడ వెళ్లడం లేదు… అవసరమైతే సాక్షి వాళ్లు సేమ్, ఇదే తరహాలో ఎవరితోనైనా కౌంటర్ బుక్ రాయిస్తారేమో బహుశా… ఐనా సాక్షిలో ఇంకా ఆ వర్గకసి కనిపిస్తున్నదంటారా..?)
Share this Article