5G స్పెక్ట్రమ్ [5G Spectrum] వేలంలో కుంభకోణం జరిగింది ! గత నెల రోజులుగా ఒక సెక్షన్ మీడియా, నాయకులు చేస్తున్న ప్రచారం ఇది! ఇందులో వాస్తవం ఎంత ? నిజంగా లక్షల కోట్ల కుంభకోణం జరిగే చాన్స్ ఉందా అందులో..? లేక బట్ట కాల్చి మీద వేయడమే ప్రస్తుత రాజకీయం కాబట్టి, ఆ ప్రచారం సాగుతోందా..?
టెలికాం స్పెక్ట్రమ్.., అది ఎలా పనిచేస్తుంది లేదా దానిలో ఉండే సాధకబాధకాలు అన్నీ డబ్బు కంటే ఎక్కువగా సాంకేతిక అంశాల మీద ఆధారపడి ఉంటయ్… కాబట్టి సామాన్యులకి ఈ విషయంలో అర్ధం అయ్యేది చాలా తక్కువ. ఏ మాత్రం టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఇలాంటి విషయాల మీద ఆరోపణలు చేయడం అంటే అది హాస్యాస్పదం…
2G స్పెక్ట్రమ్ వేలం విషయంలో అక్రమాలు జరిగాయని అప్పట్లో CAG నివేదిక ఆరోపించింది. అది ఎన్ని వేల కోట్ల రూపాయల నష్టం కలిగించింది అన్నది ఇప్పుడు అప్రస్తుతం. కానీ 2G స్పెక్ట్రమ్ తో 5G ని ఎలా పోలుస్తారు ? అబ్సర్డ్. ఎందుకంటే..?
Ads
కొత్తగా 5జీ ఫోన్లు కొనేవాళ్లు ఎందరు..?
1. 2G స్పెక్ట్రమ్ వేలం వేసేనాటికి భారత ప్రజలందరి దగ్గర మొబైల్ ఫోన్లు లేవు. అంటే మొబైల్ కనెక్షన్ తీసుకోవాల్సిన వారి సంఖ్య చాలా పెద్దది. 120 కోట్ల జనాభాలో హీనపక్షం 50 కోట్ల జనాభా మొబైల్ ఫోనే కొనే అవకాశాలు ఉన్నాయి అప్పట్లో… కాబట్టి ఎక్కువ మొత్తంలో కేంద్ర ప్రభుత్వానికి రాబడి రావాలి… అలాగే టెలికాం కంపనీలు కూడా కొత్తగా పెట్టుబడులు పెట్టాలి, ఐనాసరే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది అన్న గ్యారంటీ ఉన్నది అప్పట్లో… ఎందుకంటే మొబైల్ కనెక్షన్ తీసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ కనుక…
2. 20 ఏళ్ల తరువాత… ఇప్పుడు, అంటే 2022 లో కొత్తగా 5G కనెక్షన్ తీసుకునే వారి సంఖ్య పెద్దగా ఉండదు. 4 G ఇప్పటికే బాగా వాడుకలో ఉంది. వీడియోలు నేరుగా చూడవచ్చు 4 G మొబైల్ లో…
3. ఇక 5 G కనెక్షన్ తీసుకుంటే 4 G కంటే ఎక్కువ వేగంగా వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు లేదా ఎలాంటి అవాంతరాలు లేకుండా లైవ్ వీడియో చూడవచ్చు… 5 G అంత స్పీడ్ లేకపోయినా 4 G తో కూడా ఇదే సౌకర్యం ఇప్పటికే దొరుకుతున్నది కదా ? కాబట్టి ఎంత మంది 5G కి మారుతారు అన్నది టెలీకామ్ కంపనీలకు కూడా ఉన్న అనుమానం.
4. 20 ఏళ్ల కిందటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు. కొత్తగా కనెక్షన్ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది ఇప్పుడు… 150 కోట్ల మొబైల్ కనెక్షన్స్ ఇప్పటికే అమలులో ఉన్నాయి. ఇంకా కొత్తగా ఎక్కడ నుండి వస్తారు ? ఉన్న 4G కనెక్షన్ ని వదిలేసి కొత్త కనెక్షన్ తీసుకొని దానికోసం 5G ఫోన్ కొనేవాళ్ళు ఎంత మంది ఉంటారు ? మహా అయితే 50 లక్షల మంది ఉండవచ్చు అనుకుందాం… ఈ 50 లక్షల వినియోగదారులని రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడా ఐడియాలు పంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక్కో టెలీకామ్ సంస్థకి ఈ 50 లక్షలని పంచినా ఒక్కొక్కరికి 17 లక్షల వినియోగదారులు వస్తారు… అంటే కేవలం 17 లక్షల మంది వినియోగదారుల కోసం టెలీకామ్ సంస్థలు లక్షల కోట్ల లైసెన్స్ ఫీజ్ చెల్లించి, తిరిగి వాటిని రాబట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ?
5. టెలీకామ్ సంస్థలు బాంకుల నుండి ఋణం తీసుకొని లైసెన్స్ ఫీజ్ కడతాయి కాబట్టి ఆ లోన్లపై చెల్లించే వడ్డీలని కూడా లెక్కలోకి తీసుకుంటే వాటి ఖర్చు మరింత ఎక్కువ అవుతుంది. ఇంత ఖర్చు పెట్టి, వినియోగదారుల దగ్గర నుండి రాబట్టుకోవాలి అంటే ఇప్పుడు ఉన్న డాటా రేట్ల కంటే కనీసం 30% ఎక్కువ వసూలు చేయాల్సి ఉంటుంది… ఉదాహరణకి. ఎయిర్ టెల్ 56 రోజులకి రోజుకి 3gb డాటాకి 699 /- చార్జ్ చేస్తున్నది. ఇది 4G కి… అదే 5G కోసం అయితే తక్కువలో తక్కువగా 1000/- నుండి 1200 /- చార్జ్ చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు 15 వేలు పెట్టి 5G ఫోన్ కొనాల్సి ఉంటుంది. ఇలా ఎంత మంది వినియోగదారులు 5G కి మారతారు ?
6. 4G స్పెక్ట్రమ్ కోసం లైసెన్స్ ఫీజ్ చెల్లించిన అన్ని టెలీకామ్ సంస్థలకి ఇప్పటివరకు లాభాలు రాలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 5G స్పెక్ట్రమ్ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టే స్థితిలో లేవు.
7. 5G స్పెక్ట్రమ్ వేలంలో ముందు రిలయన్స్ జియో పాల్గొన్నది ధైర్యం చేసి… ఎందుకంటే 5G మార్కెట్ లోకి ఎవరు ముందు వస్తే వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి… ఎయిర్టెల్, వొడా ఐడియాలు ఎక్కువగా ఆసక్తి చూపలేదు కానీ ఈ రెండు సంస్థలు కూడా వేలంగా పాల్గొని పరిమితంగా మాత్రమే కొన్నాయి…
8. 4G లాగా 5G సిగ్నల్ విస్తృతంగా, అంటే దూరంగా వెళ్లలేదు. కాబట్టి ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాలలోనే 5G టెక్నాలజీని ప్రవేశపెడతారు. అంటే కేవలం మెట్రో నగరాలలో మాత్రమే 5G ముందుగా అందుబాటులోకి వస్తుంది తప్పితే అర్బన్ లేదా సెమీ అర్బన్ ప్రాంతాలలో 5G లాభదాయకంగా ఉండదు…
9. మొదటి దశలో కేవలం 13 నగరాలలో 5G అందుబాటులోకి వస్తుంది. అహ్మదాబాద్, బెంగళూరు, చండీఘర్ ,చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్నగర్, కోలకత్తా, లక్నో, ముంబై, పూణే …
ఇంకా ఉంది చెప్పాల్సింది…
కేంద్ర ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ వేలం వలన 4,75,000 వేల కోట్ల రూపాయలు రావాలని టార్గెట్ పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వపు అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి కానీ వేలం జరిగింది పరిమితంగా మాత్రమే ! ఎందుకంటే పైన చెప్పిన కారణాల వల్ల టెలీకామ్ సంస్థలు లాభాలు వస్తాయా రావా అనే సందిగ్ధంలో ఉండడం వలన…
వేలంలో అమ్ముడుపోయిన స్పెక్ట్రమ్ బాండ్ల విలువ సుమారుగా ఒక లక్షా యాభై వేల కోట్ల రూపాయలు… రిలయన్స్, ఎయిర్ టెల్, వొడా ఐడియాలు కలిసి కొన్న మొత్తం ఇది. ఇందులో రిలయన్స్ ఎక్కువ బ్యాండ్లు కొన్నది. రిలయన్స్ 88 వేల కోట్ల రూపాయల విలువ చేసే బ్యాండ్లు కొన్నది. మిగతా మొత్తాన్ని ఎయిర్టెల్, వొడాఐడియాలు కొన్నాయి. ఇవి కూడా కొన్ని సర్కిల్స్ కి మాత్రమే పరిమితం అన్నమాట…
********************************************
600 MHz and 2300 MHz బాండ్స్ అసలు అమ్ముడుపోలేదు… దీని విలువ ₹2,81,432 కోట్లు… ఈ బ్యాండ్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. వీటిని ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు… అలాంటప్పుడు ఇందులో స్కామ్ జరిగింది అని ఎలా అంటున్నారు? ఈ బ్యాండ్లు కూడా అమ్ముడుపోతే అప్పుడు మొత్తం 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి వస్తాయి…
********************************************
గతంలోలాగా రిలయన్స్ ధరలు తగ్గించి, వినియోగదారులని తమ దగ్గర నుండి లాక్కోవచ్చు అనే భయం మిగతా టెలీకామ్ సంస్థలకి ఉంది. 4g విషయంలో రిలయన్స్ ధరలు తగ్గించడంతో విధి లేని స్థితిలో మిగతా సంస్థలు కూడా తగ్గించిన సంగతి మనకి తెలిసిందే! ఇప్పుడు కూడా రిలయన్స్ అలా చేయదనే గ్యారంటీ లేదు అన్నది మిగతా టెలీకామ్ సంస్థల భయం… ఇది వ్యాపారపరమయిన పోటీ తప్పితే ఇందులో ఎలాంటి మోనోపలీ లేదు. నిజానికి రిలయన్స్ ధరలు తగ్గించడం వలనే కదా మనకి ఇతర సంస్థలు ఎలా మోసం చేస్తూ వచ్చాయో తెలిసింది ?
*******************************************
Share this Article