‘‘మన కోహినూర్ వజ్రాన్ని మనం మళ్లీ తెచ్చుకోవాలి…’’ ఇదీ దేశప్రజల నుంచి చాన్నాళ్లుగా వినిపించే డిమాండే… ఇప్పుడు ఆ బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణించాక ఈ డిమాండ్ మరింత పెద్దగా వినిపిస్తోంది… విదేశీయులు ఎక్కడెక్కడి నుంచో దొంగిలించుకుపోయిన, పురాతన విలువ కలిగిన బోలెడు కళాఖండాల ఆచూకీ కనిపెట్టి మరీ, పట్టుకొస్తున్నాం కదా… కోహినూర్ తీసుకురాలేమా..? అనే ప్రశ్న పదే పదే వినిపిస్తోంది… నిజమేనా..? అది సాధ్యమేనా..? దాన్ని దొంగిలించబడిన వస్తువుల జాబితాలో చేర్చగలమా..?
ముందుగా ఓ కీలక విషయం చెప్పుకుని, అసలు కథనంలోకి వెళ్దాం… కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు అప్పజెప్పాలనే డిమాండ్ మీద 2010 లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ స్పందించాడు…. ఒకవేళ భారత్‌కు గనుక కోహినూర్ తిరిగి ఇవ్వాల్సి వస్తే, చాలా దేశాలకు చాలా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నాడు… దాంతో బ్రిటీష్ మ్యూజియం మొత్తం ఖాళీ అయిపోతుందని కూడా చమత్కరించాడు… సో, బ్రిటిష్ ప్రభుత్వాలకు చాలా క్లారిటీ ఉంది… కోహినూర్ తిరిగి ఇచ్చేది లేదనే బలమైన భావన కూడా ఉంది…
కోహినూర్ మన తెలుగు నేలలో దొరికిందే… ఓ బలమైన కథనం ఏమిటంటే… కాకతీయుల కాలంలోనే కోహినూర్ వజ్రం బయటపడగా… యుద్ధంలో ఓడిపోయిన ప్రతాపరుద్రుడు 1310 లో మాలిక్ కపూర్‌తో సంధి చేసుకొని, ఢిల్లీ సుల్తాన్‌కు ఈ వజ్రాన్ని సమర్పించుకున్నాడని అంటారు… మొత్తానికి అది ఢిల్లీ చేరింది… తరువాత పలు చేతులు మారీ, మారీ… చివరకు లాహోర్ రాజధానిగా పంజాబ్‌ను పాలించిన మహారాజా రంజిత్ సింగ్ చేతుల్లో పడింది… ఆ తరువాతే బ్రిటిషర్ల కన్నుపడింది దానిపై…
రంజిత్ సింగ్ మరణం తరువాత ఓ యుద్ధంలో పంజాబ్ పతనమైంది… రంజిత్ మూడో భార్య జిందన్ కౌర్, చిన్న పిల్లవాడైన ఆమె కొడుకు దులీప్ సింగ్‌ను బ్రిటిషర్లు బందీలుగా పట్టుకుని, దులీప్‌ను నామ్‌కేవాస్తే రాజుగా చూపిస్తూ వాళ్లే పాలించారు… వాళ్ల విలువైన సంపదతోపాటు కోహినూర్ కూడా అప్పటి రాణి విక్టోరియాకు ఇస్తున్నట్టు రాయించుకున్నారు… దాన్ని ఆమె కిరీటంలో పొందుపరిచారు… ఆ దులీప్ సింగ్ అనామకంగా మరణించాడు… కానీ టెక్నికల్‌గా కోహినూర్‌ను రాణికి కానుకగా సమర్పించినట్టే…
ఇప్పుడు ఎలిజబెత్ మరణించడంతో, ఆ కోహినూర్ ఉన్న కిరీటాన్ని ఆమె కోడలు కెమిల్లా ధరించబోతోంది… అదేమో శాపగ్రస్త వజ్రం… దాన్ని కిరీటంలో పెట్టుకున్న రాజులు అర్థంతరంగా మరణిస్తారని ఓ ప్రచారం ఉంది… దాంతో రాణులు మాత్రమే ధరిస్తారు… బ్రిటిషర్లు కూడా దాన్నే నమ్మారు… క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు… ఇప్పుడు మరో రాణి ధరిస్తుంది… తమకు కానుకగా ఇవ్వబడిన వజ్రాన్ని బ్రిటన్ వాపస్ ఎందుకిస్తుంది..?
అదేమో పాత పంజాబ్‌కు చెందిన ఆస్తి… ఇప్పుడు పంజాబ్ రెండు ముక్కలై… కొంత పాకిస్థాన్‌లో ఉంది… ఇంకొంత ఇండియాలో ఉంది…ఇంతకూ దానిమీద యాజమాన్య హక్కు ఎవరిది..? ఇదొక చిక్కుముడి… నిజానికి ఈ వజ్రం మొదట్లో 793 క్యారెట్లు ఉండేదట… దానికి సానపెడుతూ, పెడుతూ ఉంటే, మార్పులు చేస్తూ ఉంటే, చివరకు 105 క్యారెట్లకు తగ్గిపోయిందట… దాని బరువే ఇప్పుడు 21 గ్రాములు… ఐతేనేం, దాన్ని తీసుకురావడం మన ఆత్మగౌరవానికి ఓ సూచికగా భావిస్తే ఇండియా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి… ఒకవేళ నిజంగానే బ్రిటిషర్లు తిరిగి ఇచ్చేస్తే… దాన్నేం చేయాలి..? ఏదో సేఫ్ ట్రెజరీలో లేదా మ్యూజియంలో భద్రపరచాలి… అంతేగా…!!
Share this Article