పారడాక్స్… అంటే ఒక వాక్యంలో రెండు వేర్వేరు అర్థాలు పరస్పరం వ్యతిరేకించుకుంటాయి… నిన్న కుమారస్వామి వచ్చి కేసీయార్‌తో సుదీర్ఘంగా చర్చించాడు… కమాన్, జాతీయ పార్టీ పెట్టెయ్, దేశమంతా తెలంగాణ మోడల్ కోరుకుంటోంది, నేను సంపూర్ణంగా మద్దతునిస్తా, ప్రాంతీయ పార్టీల సమాఖ్యే ఇప్పుడు దేశానికి అవసరం అని కేసీయార్‌ను ప్రోత్సహించాడు… దేశ్‌కీనేతా కేసీయార్ అని నినదించినట్టే… మీడియా సహజంగానే ఫుల్ కవరేజీ ఇచ్చింది… ఐతే, ఇక్కడ చాలా విషయాలు, వాళ్ల మాటలు పారడాాక్స్…
కేసీయార్ అడుగులు అంత త్వరగా ఎవరికీ అర్థం కావు… బయటికి కనిపించేది ఒకరకంగా ఉంటుంది, తెర వెనుక అసలు ప్రణాళికలు మరోరకంగా ఉంటాయి… గత లోకసభ ఎన్నికల నుంచీ అంటూనే ఉన్నాడు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా, వెళ్తా అని… మధ్యలో సైలెన్స్… మధ్యలో అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది… పార్టీ పేరు, ముహూర్తం గట్రా పత్రికల్లో కనిపిస్తాయి… కానీ అడుగు కదలదు… ఇప్పుడు ఓ సీరియస్ ఎఫర్ట్ నడుస్తున్నట్టు ఉంది… అదీ మీడియాలో కనిపిస్తున్న వార్తలను బట్టి… దసరాను మీడియా తాజా ముహూర్తంగా డిసైడ్ చేసేసింది… ఇక్కడ కొన్ని సందేహాలు…
1) కేసీయార్ తనే జాతీయ పార్టీ పెట్టి, దేశవ్యాప్తంగా విస్తరించి, పోటీపడి, ఇతర జాతీయ పార్టీలకు దీటుగా సీట్లు సంపాదించే ప్రయత్నం చేయాలి… అదేకదా జాతీయ పార్టీ సంకల్పం… అలాంటప్పుడు కుమారస్వామి ఇచ్చే మద్దతు ఏముంటుంది..? తనే జాతీయ పార్టీ పెడుతూ మళ్లీ ప్రాంతీయ పార్టీల సమాఖ్య అని బలంగా నినదించడం ఏమిటి..? దానికి ఇప్పుడు టీఆర్ఎస్ సరిపోదా..? కొత్తగా జాతీయ పార్టీ దేనికి..?
Ads
2) కేసీయార్‌కు మద్దతు ఏ అంశంలో ఇస్తాడు కుమారస్వామి..? ప్రాంతీయ పార్టీల సమాఖ్యను నిర్మించడంలోనా..? జాతీయ పార్టీ నిర్మాణంలోనా..? ఆ రెండూ వేర్వేరు రాజకీయ లక్ష్యాలు, వేర్వేరు ఆచరణలు…
3) పోనీ, కేసీయార్ చెప్పే మోడల్ సూపర్ అనుకునే పక్షంలో… తనే ఈ దేశానికి దిక్కు అనుకునే పక్షంలో కేసీయార్ పెట్టబోయే జాతీయ పార్టీలో తమ జేడీఎస్ పార్టీని విలీనం చేస్తాడా..?
4) ఏ బెంగుళూరులోనో తెలుగువాళ్లు అధికంగా ఉన్నచోట కేసీయార్ జాతీయ పార్టీ పోటీకి నిలబడిందీ అనుకుందాం… ఇదే కుమారస్వామి ఏం చేయాలి..? తను పోటీ నుంచి విరమించుకోవాలా..? నా అడ్డాలోకి ఓ కొత్త పోటీదారుగా వచ్చే పక్షంలో నేనెందుకు సపోర్ట్ చేస్తాను..?
5) బీజేపీని తరిమికొట్టడానికి కాంగ్రెస్ పనికిరాదు అంటున్నాడు కేసీయార్… రైతు సంఘాలతో దేశవ్యాప్తంగా నేనే విస్తరిస్తాను అంటున్నాడు… మరి అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీల సమాఖ్య దేనికి..? అన్నిచోట్లా తనే బలపడుతూ, యాంటీ-మోడీ రాజకీయాలకు ఓ కొత్త దిశను చూపించాలి కదా…
6) ఆమధ్య బీహార్ వెళ్లి నితిశ్, తేజస్వితో చర్చలు జరిపాడు… రేప్పొద్దున కేసీయార్ పార్టీ బీహార్‌లో పోటీచేయాలని అనుకుంటే ఆ రెండు పార్టీలు ప్రత్యర్థి పార్టీలు అవుతాయా..? కూటమి పార్టీలు అవుతాయా..? మరో రాజకీయ శక్తి బీహార్‌లో కాలు పెట్టడానికి వాళ్లెందుకు సహకరిస్తారు..? ఒక స్టాలిన్, ఒక హేమంత్, ఒక ఠాక్రే తదితరులు యూపీయేను వీడి కేసీయార్ ఆలింగనం చేసుకునే అవకాశాలు ఉంటాయా అసలు..?
7) ఆల్రెడీ చౌతాలా వంటి వృద్ధ నేతలు కూడా ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ అయిపోయారు… మూడో కూటమి అంటున్నారు… కేసీయార్ జాతీయ పార్టీకి యూపీయే వద్దు, మరి మూడో కూటమిలో చేరతాడా..? మూడో కూటమిలో చేరడానికి టీఆర్ఎస్ సరిపోదా..? కొత్తగా జాతీయ పార్టీ దేనికి..?
8) ఇంతకీ తెలంగాణలో కొత్తగా వచ్చే జాతీయ పార్టీ పోటీ చేస్తుందా..? ఆ టీఆర్ఎస్ అలాగే ఉండి పోటీచేస్తుందా..? జాతీయ పార్టీ కేవలం ఇతర రాష్ట్రాల్లో పోటీకి మాత్రమేనా..? తెలంగాణలో గనుక కొత్త జాతీయ పార్టీ పేరు మీద పోటీచేసే ఆలోచనే ఉంటే, అది రెంటికీ చెడ్డట్టు అయ్యే ప్రమాదం లేదా..?
9) ఇదే కారు గుర్తును ఆ కొత్త జాతీయ పార్టీకి కేటాయించాలని ఏముంది..? కారు గుర్తు లేకపోతే అసలుకే మోసం… ఈ సంక్లిష్టత కనీసం టీఆర్ఎస్ ముఖ్యులకైనా అర్థం అవుతోందా..?
10) పలు రాష్ట్రాల్లో బలమైన మూలాలున్న లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలే చతికిలపడుతున్నయ్… ఇప్పటికిప్పుడు అర్జెంటుగా దేశవ్యాప్తంగా విస్తరించే సీన్ ఇప్పటివరకూ అసలు ఓ జెండా, నిర్దుష్ట ఎజెండా లేని కొత్త జాతీయ పార్టీలకు ఉంటుందా..? పైగా కేసీయార్ నమ్ముకునే రాకేష్ టికాయత్ వంటి విశ్వసనీయత లేని రైతు సంఘాల నేతలతో… ఇప్పుడు తను కూడా కేసీయార్‌తో కనిపించడం లేదు… మొన్న హైదరాబాద్ వచ్చి, కేసీయార్ ఆహా ఓహో అని కీర్తించిన సో కాల్డ్ రైతుసంఘాల పేర్లే కొత్త కొత్తగా ఉన్నయ్… ఉత్తరాదిలో బొచ్చెడు సంఘాలున్నయ్ అలాంటివి…
11) సో, అసలు తెలంగాణ మోడల్ అనే బ్రహ్మపదార్థం కేసీయార్ కొత్త పార్టీని దావానలంగా మారుస్తుందా..? అంతులేని సంక్లిష్టత, సందేహాలు, సందిగ్ధతల నడుమ అసలు కేసీయార్ ఆలోచనలు ఏమిటో తెలంగాణ ప్రజలకే స్పష్టత రావడం లేదు… మరిక ఆ కొత్త పార్టీ ప్రస్థానం ఎటువైపు..? పుట్టుక తథ్యమేనా..?!
Share this Article