మొన్నామధ్య బ్రహ్మాస్త్ర ప్రి-రిలీజ్ రద్దయ్యాక ప్రెస్‌మీట్ పెట్టారు కదా… అందులో జూనియర్ మాట్లాడుతూ ‘ఇంటెన్స్’ అనే పదాన్ని పదే పదే వాడాడు… సరే, ఆ సందర్భం, తను చెప్పాలనుకున్న ఉద్దేశం వేరు కావచ్చుగాక… కానీ అదేసమయంలో ఎక్కడో ‘సీతారామయ్యగారి మనమరాలు’ అనే సినిమా వస్తోంది ఎందులోనో… విగ్గు లేకుండా, మేకప్ లేకుండా, ఓ తాత పాత్రలో అక్కినేని ఎంత సమర్థంగా జీవించాడో కదా, ఒక్కటి… ఒక్కటి… కెరీర్‌లో ఇలాంటి పాత్రలు ఒక్కటైనా చేసి, మెప్పించకపోతే ఇక నటుడిగా ఎంత సంపాదిస్తేనేం..? అనిపించింది…
తెలుగు తెరకు స్టెప్పులు నేర్పింది, ఆధునిక ఫ్యాషన్లను నేర్పింది అక్కినేని… బోలెడు కమర్షియల్ సినిమాలు చేశాడు… కానీ ఒక సీతారామయ్య పాత్ర వచ్చినప్పుడు అందులోకూ దూరిపోయాడు… కన్నీళ్లు పెట్టించాడు… ఇదెందుకు గుర్తొచ్చిందీ అంటే… చిరంజీవి నటిస్తున్న గాడ్‌ఫాదర్ సినిమా రాబోతోంది కదా… అందులో ఒక పాట రిలీజ్ చేస్తారట, దానికీ ఓ టీజర్ కట్ చేసి వదిలారు… అది చూశాక ఓ మాట అనిపించింది… చిరంజీవి ఒక సీతారామయ్య వంటి పాత్రను ఎప్పుడైనా చేయగలడా..?
ఎందుకంటే… చిరంజీవి అంటే డాన్సులు, సారీ, స్టెప్పులు… ఇంకా వయస్సు ముదిరినా సరే, స్టెప్పులు పడాల్సిందే… కనీసం దేహంలో కదలికలతో డాన్సులు అనిపించేయాలి… ఫైట్లు చేసేయాలి… బ్రహ్మాండమైన డ్రెస్సులు, లుక్కులు ఎట్సెట్రా ఉండాల్సిందే… దేవుడి వేషం వేసినా, ఓ ఆదివాసీ వేషం వేసినా స్టెప్పులు పడాల్సిందే… హేమిటో… చిరంజీవి ఇంకా ఇవే భావనల్లో కొట్టుకుపోతున్నాడు… మొన్నమొన్నటి డిజాస్టర్ ఆచార్య కూడా అంతేకదా… ఐనా చిరంజీవి మారడు… గాడ్‌ఫాదర్ సినిమానే చూడండి… బోలెడు మంది డాన్సర్ల నడుమ, ఓ ఐటమ్ డీజే సాంగ్ తరహాలో… థార్ మార్, థక్కర్ మార్ అంటూ థమన్ ఏం కొట్టాడో, వాళ్లంతా ఏం స్టెప్పులు కొట్టారో గానీ… మధ్యలో చిరంజీవి ప్లస్ సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నాడు…
Ads
ఇద్దరు మెగా హీరోల కలయిక అని ప్రచారం షురూ… సో వాట్..? సల్మాన్ ఖాన్ అప్పియరెన్స్, వాల్యూ యాడిషన్ అవసరమా చిరంజీవి వంటి ఇమేజీ ఉన్న మెగాస్టార్‌కు..? ఆచార్య దెబ్బకు అదనపు మసాలాలు, ఆకర్షణలు వచ్చి చేరుతున్నాయా గాడ్ ఫాదర్ సినిమాలోకి..? అవే స్టెప్పులు, చూడబోతే మళ్లీ అవే ఫైట్లు… అసలు లూసిఫర్ సినిమాలోని ఇంటెన్సిటీ చిరంజీవికి అర్థమైందా అని డౌటొస్తుంది… తెలుగులోకి రీమేక్ అంటే చిరంజీవీకరించడమా..? చిరంజీవీకరణ అంటే కథకు భారీతనం అనే ఓ భ్రమతను అద్ది, ఇది లూసిఫరేనా అని మోహన్‌లాలే హాశ్చర్యపడేలా మార్చేయడమా..?
ఒరిజినల్ లూసిఫర్ సినిమాను 30 కోట్లతో తీస్తే 175 కోట్లు వసూలు చేసింది… పైగా అది తెలుగులో, హిందీలో కూడా విడుదలైంది… అమెజాన్‌లో మూడేళ్ల క్రితమే వచ్చేసింది… సో, ఈ గాడ్‌ఫాదర్‌కు పాన్‌ఇండియా సీన్ లేదు… ఐనా ఇంకా ఏం కావాలి తనకు..? ఇప్పటికీ ఎందుకు తనకు ఈ కోట్ల యావ..? మెగా క్యాంపులో బోలెడు మంది హీరోలున్నారు… ఈ స్టెప్పులు, ఈ ఫైట్లు గట్రా వాళ్లకు వదిలేసి, తనకు పేరొచ్చే ఒక్క పాత్ర… కనీసం ఒక్క పాత్ర… ఏ తెలుగు హీరో అవలక్షణాలూ లేని పాత్రను పోషించలేడా..? ఆ టేస్ట్ లేదా..?
ఎక్కడిదాకో ఎందుకు..? శివుడు, పార్వతిల ప్రణయాన్ని బాగా రాయబడి, ట్యూనీకరించబడిన లాహేలాహే పాటను కూడా దిక్కుమాలిన స్టెప్పులతో మురికి చేసిన తీరుపై ఒక్కసారి చిరంజీవికి ఆత్మ మథనం చేతకాదా..? ఇంకా ఆ ఇమేజీ బందిఖానాలో పడి దొర్లుతుంటే, కోట్ల యావలో కొట్టుకుపోతుంటే ‘‘మరిచిపోలేని పాత్ర’’ ఎక్కడి నుంచి వస్తుంది..? ఒక అభిలాష, ఒక శుభలేఖ నాటి చిరంజీవిని ఎప్పుడో మరిచిపోయింది ఓ తరం… కొత్తతరానికి వెటరన్ అవస్థల స్టెప్పులు అవసరం లేదు… వైర్ ఫైట్లు, గ్రాఫిక్ ఫైట్లు కూడా అక్కర్లేదు… వాళ్లకు ఓ ఇంటెన్స్ హీరో కావాలి…
వయస్సు మళ్లుతున్నా సరే బాలయ్య ఓ అఖండ పాత్ర వేయగలడు… కేజీఎఫ్‌లో యశ్‌ది జూనియర్ చెబుతున్న ఓ ఇంటెన్స్ పాత్ర… పుష్పలో బన్నీ అంతే… కథానాయకుడు కూడా కొత్తగా కనిపించాలి ఇప్పుడు… చివరకు ఆర్ఆర్ఆర్‌లో జూనియర్, రాంచరణ్ కూడా అంతే… సో, మళ్లీ అదే ప్రశ్న… ఒక మెగాస్టార్‌కు సల్మాన్‌ఖాన్ అవసరమా..? అంతేకాదు, రీమేక్ అంటే, చిరంజీవీకరించడం అంటే, ఒరిజినల్ మూవీ సోల్‌లోని ఇంటెన్సిటీని డైల్యూట్ చేయడం కాదు..!! ఐటమ్ సాంగ్స్, స్టెప్పులు, పిచ్చి ఫైట్లు, ఆ బ్రాండెడ్ పోకడల నుంచి బయటికి వచ్చి, కొత్త పాత్రల వెతుకులాటలో ఉన్నారు మోహన్‌లాల్, మమ్ముట్టి… ఐతేనేం… ఈరోజుకూ వాళ్లే కేరళ మెగాస్టార్స్… చిరు సార్, మీకు అర్థమవుతోందా..?!
Share this Article