మనకు అలవాటైన భాషలో… బాణీకి సరిపడా అందమైన పదాల పొదగడం ఎవరైనా చేయగలరు… యూట్యూబ్ పుణ్యమాని ఊరికిద్దరు పుట్టుకొచ్చారు… ఏక్‌సేఏక్… అవీ జానపదాలు, ఆధునికాలు, మిశ్రమాలు, కాలుష్యాలు, విషాలు, కషాయాలు… నానా రకాలు… కానీ అచ్చమైన తెలుగు పదాల అల్లిక ఓ రిథమ్‌లో వినిపిస్తూ అలరిస్తాయి, రక్తికడతాయి… ఎటొచ్చీ ఏదేని పరభాష గీతానికి అనువాదం రాయడమే అతి పెద్ద పరీక్ష, ఏ గీత రచయితకైనా…
ప్రత్యేకించి తమిళ గీతాలు మరీ ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం టైపు… అంత త్వరగా అస్సలు జీర్ణం కావు… వాటి అర్థం చెడకుండా, అల్లికలోని సొగసు చెడకుండా… సాధ్యమైతే అదనపు వాల్యూ ఆడ్ చేయడం ఓ పెద్ద టాస్క్… చంద్రముఖి సినిమాలో రారా, సరసకు రారా పాట గుర్తుంది కదా… భువనచంద్ర ఒరిజినల్ పాటకన్నా బాగా రాశాడు… సరళమైన పదాలతో, అదే అర్థానికి మరిన్ని నగిషీలు చెక్కాడు… అదే అపరిచితుడు సినిమాలో అదే భువనచంద్ర కొండాకాకీ గుండేదానా అని ఓ వికృతమైన, వికటమైన పాట రాశాడు… అంతా తెలుగు ప్రేక్షకుడి ఖర్మ…
నెల్లూరు నెరజాణ అని ఓ పాట మొదలవుతుంది… ఒకే ఒక్కడు సినిమాలో… ఆ జంటపదాలతో పాట సూపర్ హిట్టయిపోయింది… లోపల ఏముందో మనకు వినిపించి చావదు, ఐనా పర్లేదు… ట్యూన్ భలే ఉంటుంది… తెరపై మనీషా సరేసరి… సరే, ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ సినిమా వస్తోంది కదా… మణిరత్నం భారీ ఆశలే పెట్టుకున్నాడు… తన డ్రీమ్ ప్రాజెక్టు… నిజానికి మణిరత్నం తనకు కావల్సినట్టు తమిళ వెర్షన్ కోసం కాస్త లిటరరీ సెన్స్‌తో పాటలు రాయించుకుంటాడు… అంతే, ఇక వేరే భాషల్లో ఆ పాటలు ఎలా ట్రాన్స్లేటవుతున్నాయో పట్టించుకోడు…
Ads
తమిళ అగ్రదర్శకులందరి బాటా అదే… కనీసం ఈ పొన్నియిన్లోనైనా కాస్త వినబుల్ పాటలున్నాయా అని చెక్ చేస్తే… ఇప్పటికి రెండు లిరికల్ వీడియోలు విడుదలయ్యాయి… చాలా అసంతృప్తి కమ్మేసింది… ఫాఫం, అనంత శ్రీరాం ఎంతగా నిప్పుల మీద నడిచినా సరే, ఏం రాయాలో అర్థం గాక చివరకు చేతులెత్తేసి, ఓ సగటు యూట్యూబ్ చానెల్ పండుగ పాటకు రాసినట్టుగా ఏవో పదాలు గీకి పారేశాడు… అందులో ఒక పాట రాచ్ఛస మావయ్యో అని కనిపించింది…
తమిళంలో రాచ్చసన్… కానీ తెలుగులో రాక్షసుడే… అలాగే పలకాలి, అలాగే రాయాలి… (మరీ కొందరు ఇంగ్లిషులో రాట్ససన్ అని రాస్తారు)… శ్రేయో ఘోషల్‌ను మెచ్చుకోవచ్చు, స్పష్టంగా తెలుగులో రాక్షస మావయ్యా అనే పాడింది… ఆమె గొంతులో మాధుర్యం గురించి సపరేటుగా ఏం చెప్పుకోగలం..? నడుమ నడుమ శంకర్ మహదేవన్ గొంతు చేసుకున్నాడు, పర్లేదు, బాగానే ఉంది… రెహమాన్ దర్శకత్వం కదా, స్వరం అదుపులో ఉంచుకుని పాడినట్లు అనిపించింది… ఎటొచ్చీ… ఆ పాటేమిటో, దాని భావమేమిటో, ఆ పదాలకు అర్థాలేమిటో, ఏ పదాలు వాక్యాలుగా మారాయో, ఏవి మారలేదో, ఏవి శుష్కపదాలుగానే మిగిలియో ఓపట్టాన సమజ్ కాలేదు…
ఎస్, మణిరత్నం తెలుగు పాటలంటేనే ఆ శిక్షకు రెడీగా ఉండాలి కదా మనం… మోగించింది రెహమాన్ అయితేనేం.., రాసింది అనంత శ్రీరాముడు అయితేనేం… వాయించింది శివమణి అయితేనేం… పాట ఏ రీతిలోనూ లేదు… అసలు పాట స్టార్ట్ కావడమే ‘మత్తెక్కిటు వస్తున్నావా, పెద్దత్తకు భర్త, నిన్నొత్తి గిల్లి బుద్ది కొంచెం ఇస్తా’ అని… సగం జుత్తు ఊడిపోయాక అర్థమవుతుంది… మత్తు ఎక్కి ఇటు వస్తున్నావా, పెద్దత్తకు భర్తా, నిన్ను ఒత్తి, గిల్లి, బుద్ధి కొంచెం ఇస్తా… అని అర్థం…
ఒకవైపు శోభిత ధూళిపాళ్ల తనకు వరసైన మావయ్యను నిందాస్తుతితో స్మరిస్తోందా..? లేక పెద్దత్త మొగుడిని తిట్టిపోస్తుందా..? ఇక్కడ పెద్దత్త మొగుడు అనే పదమే ఎందుకు, అసలు ఆ పాట అర్థంలో ఆ పదం ఎందుకు వాడాడో, పెద్దత్త మొగుడినే మావయ్య అనాలేమో… ఇప్పుడు అనంత శ్రీరాంను అడిగినా జస్టిఫికేషన్ చెప్పలేడు… ఏదో ఫ్లోలో, ఏదో మూడ్‌లో, ఏదో ఒత్తిడిలో రాసిపారేసి ఉంటాడు… సగటు ప్రేక్షకుడికి ఆ పదం ఎలా ఎక్కిందో తనకెందుకు..? రాక్షస మావయ్య, రాత్రికే సూర్యుడట… వోకే… కానీ కత్తుల్ని కక్కడం ఏమిటో… గోవై ఉండటం ఏమిటో… ఆ మావయ్య తనకుతాను కంసుడిని అని చెప్పుకోవడం ఏమిటో… అండాండం, పిండాండం పదాలెక్కడి నుంచివచ్చాయో… ఆ ట్యూనే వినసొంపుగా లేదు, దానికి తోడు ఈనాడు తరహా క్షుద్రానువాద కష్టాలు… పాటలోకి ఇనుప గుగ్గిళ్లు…!! ఇక మరోపాట గురించి చెప్పి, పాఠకుల్ని భయపెట్టలేను…!!
Share this Article