కృష్ణంరాజు మరణం తరువాత చాలామంది తన సినిమాల్లోని మరుపురాని సన్నివేశాలు, పాటల గురించి చాలా రాశారు, గుర్తుచేసుకున్నారు… సహజమే… కానీ తన తన కెరీర్ మొత్తమ్మీద బలంగా గుర్తుండిపోయే పాట భక్తకన్నప్ప సినిమాలోని కిరాతార్జునీయం… నిజానికి అది పాట కాదు… వచనం… అదొక కథనధార… జలపాతం అన్నట్టుగా పదపాతం… వేటూరి కూడా వేల పాటలు రాశాడు… కానీ ఈ వచనగీతంలోని ప్రతి పదానికి ఎంత ప్రసవవేదన పడ్డాడో తెలియదు… లేక అలవోకగా పదాల్ని సొగసుగా అల్లగల దిట్ట కాబట్టి అలా అలా రాసుకుంటూ వెళ్లిపోయాడేమో తెలియదు…
వేటూరి విశ్వరూపం ఇది… ఒక్క మాట… ఈ ఘట్టాన్ని ఆలోచించి, సినిమా కథలో ఓచోట భాగం చేసి, భావధారకు దీటుగా దృశ్యీకరించిన బాపు కూడా ప్రశంసార్హుడే… ఇప్పుడంటే మనం థమన్ గారి థార్ మార్, థక్కర్ మార్ యుగంలో ఉన్నాం గానీ… అప్పట్లో సరళమైన బాణీలో స్పష్టంగా ఆ పదాల్ని బాలు గొంతుతో, అదే ఉద్వేగభరితంగా వినిపించిన తీరూ అబ్బురం… నిజానికి ఆ సినిమాలో ప్రతి పాటా అపురూపమే… ప్రత్యేకించి ఎన్నీయల్లో ఎన్నీయల్లో పాట చిత్రీకరణ కన్నులకింపు… ఈ కిరాతార్జునీయం కథకొస్తే…
తెలిసిన కథే… కానీ కొత్తగా చెప్పిన తీరే చెవులకింపుగా ఉంటుంది… అర్జునుడు పాశుపతాస్త్రం కోసం అడవుల్లోకెళ్లి శివుడి కరుణ కోసం ఘోర తపస్సు చేస్తాడు… ఆ భక్తసులభుడు ఎందుకో అర్జునుడిని పరీక్షించాలని అనుకుంటాడు… మూకాసురుడు అనే రాక్షసుడిని వరాహరూపంలో పంపిస్తాడు… అర్జునుడు బాణం వేస్తాడు, అప్పటికే అక్కడికి ఎరుక రూపంలో వచ్చిన శివుడు కూడా బాణం వేస్తాడు… నేను చంపానంటే నేను చంపానంటూ పంచాయితీ… చివరకు అర్జునుడిని ఆశీర్వదిస్తారు శివపార్వతులు… అదీ కథ…
Ads
శివుడు కైలాసంలో తాండవమాడుతూంటే ఒక్కసారి ఆ కైలాసగిరి కంపించిందట. అకాలప్రళయ జ్వాల కనిపించిందట. అప్పుడేమయ్యింది..? వేటూరి పదాల పొందిక గమనించండి… ‘‘జగములేలినవాని సగము నివ్వెరబోయె, సగము మిగిలినవాని మొగము నగవైపోయె…’’ జగాల్ని ఏలే దేవుడి సగం, అంటే అర్థాంగి, అంటే పార్వతి నివ్వెరపోయిందట… సగము మిగిలినవాడు ఎవరు… శివుడే… మొగమంతా నగవైపోయిందట… అంటే విషయం అర్థమై నవ్వేశాడన్నమాట… ఇలాంటివి బోలెడు…
తనికెళ్ల భరణో, ఇంకెవరో చెప్పినట్టు… శివుడే ఒక యతి… తన చుట్టూరా గణాలు, తనే ఓ లయకారుడు… అందుకే తనను కీర్తించే ప్రతి పదమూ ఛందోబద్ధమే… పైగా పాట నడక బహుబాగా తెలిసిన వేటూరి కలం… ఇంకేముంది..? వచనంలోనూ ఇలాంటి పదాలే లయను అవే సమకూర్చుకుని, వాటంతటవే అందంగా అమిరాయేమో…! శివుడు మారువేషంలో భూమ్మీదకు రావాలి… మరేం చేయాలి..? ‘‘నెలవంక తలపాగ నెమలియీకగ మారె…’’ నెలవంక నెమలీకగా మారిపోయిందట… ‘‘తలపైని గంగమ్మ తలపులోనికి పారె’’… ఆమెతో ప్రస్తుతానికి పనిలేదు మరి… ‘‘నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె…’’ ఓ బొట్టుగా మారిపోయింది మూడో నేత్రం… ‘‘బూదిపూతకు మారు పులితోలు వలువాయె..’’. విభూతి పూసుకుని తిరిగేవాడు… అలా కుదరదు కదా… ఓ పులితోలు వలువగా మారింది…
‘‘ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మారగా’’ (ఎఱుక అంటే జ్ఞానం. సర్వజ్ఞుడైన శివుడు ఎరుకలవానిగా మారాడు అని…!) ‘‘తల్లిపార్వతి మారె తాను ఎఱుకతగా…’’ తప్పదు కదా… ‘‘ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము, కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు…’’ సరళమైన తెలుగులో ఇంతకన్నా బాగా ఎవరు చేయగలరు ఓ కావ్యరచనను..? ‘‘తకిటతక తకతకిట చటిత పదయుగళా… వికట గంగాఝరిత మకుటతట నిగళా’’ (వికటమైన గంగ దూకిన జట అనే సంకెల గలవాడు అని..)
అర్జునుడు నిస్సహాయుడైనప్పుడు కూడా వేటూరి కలం కదం తొక్కుతుంది… ‘‘చిత్రమేమొ గురిపెట్టిన బాణమ్ములు మాయమాయె, విధి విలాసమేమో పెట్టిన గుఱి వట్టిదాయె… అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె, సవ్యసాచి కుడియెడమై సంధించుట మఱచిపోయె!’’ రెండు చేతులతో బాణాలు సంధించగల సవ్యసాచి కుడి ఎడమైపోయి అసలు సంధించుటే మరిచిపోయాడట… ఆహా… మధురమైన తెలుగును ఆస్వాదించటానికి ఇలాంటి పాటలు కొన్ని ఎప్పుడైనా సావధానంగా వినాలి… అదొక తృప్తి… !!
Share this Article