బిగ్‌బాస్ షోలో ఏదో కెప్టెన్సీ టాస్క్… ఓ రింగులో నిలబడి ఒకరినొకరు తోసుకుంటున్నారు… చివరకు ఇద్దరు మిగిలారు… ఒకామె హఠాత్తుగా కడుపు పట్టుకుని కుప్పకూలిపోయింది… బాధతో ఆట నుంచి తనే విరమించుకుని, బయటికి నడిచింది… ఏమైంది..? ఎవరామె..? మీరు చాలా సైట్లలో ఆమె విషాదాన్ని గురించి పలుసార్లు చదివే ఉంటారు… కానీ ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది… ఆమె పేరు కీర్తి కేశవ్ భట్…
ఆమె చాలాసార్లు తన కథ చెప్పుకుంది… ఇంటర్వ్యూల్లో, బిగ్‌బాస్ ఎంట్రీ సమయంలో కూడా చెప్పుకుంది… ఓ గుడికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ జరిగి, తల్లిని, తండ్రిని, అన్నను, అన్న బిడ్డను, వదినల్ని కోల్పోయింది… తనొక్కతే బతికింది, దాదాపు నెలరోజులపాటు కోమా… అప్పటికే ఆమెకు నటన మీద ఆసక్తి… డాన్స్, యాక్టింగ్ నేర్చుకుంది… అందమైన, ఆనందమైన ఆ కుటుంబం కాస్తా ఒకేసారి కాలం కాటుకు ముక్కచెక్కలైంది… ఆమె తనకు తానే మోటివేట్ చేసుకుంది, నిలబడింది… ఇదంతా అందరికీ తెలిసిన కథే… కానీ..?
నిన్న రాత్రి బిగ్‌బాస్ కంటెస్టెంట్లు తమ జీవితాల్లో పిల్లలకు సంబంధించిన ఎమోషనల్ ఇష్యూస్ చెప్పుకున్నారు… టైమ్ సరిపోక ముగ్గురివో, నలుగురివో చూపించారు… కీర్తి తనకు తానే ఊరడించుకుంటూ తన జీవితంలోని విషాదాన్ని చెబుతుంటే… ఒకటీరెండు కొత్త విషయాలు ఆమె పట్ల మరింత సానుభూతిని కలిగించాయి… ఇప్పటిదాకా ఆమె చెప్పుకునే కథకు మించి విషాదం ఉంది ఆ జీవితంలో… అందరినీ కోల్పోయాక తన బంధుగణం నుంచి కూడా చేదు అనుభవాలు.., దైహికంగా, మానసికంగా కోలుకోవడానికి అవస్థలు, చివరకు ఒంటరిగా బయటికి వచ్చింది, నిలబడింది… తనలో బాగా నచ్చింది ఎక్కడంటే… ఐనా సరే, పిసరంత నిరాశావాదాన్ని తన సమీపంలోకి కూడా రానివ్వడం లేదు… గ్రేట్… అదీ చెప్పుకుందాం…
Ads
తన మామయ్య ఇంటి నుంచి పారిపోయి బెంగుళూరు చేరాక, తన దగ్గర మిగిలింది 7 రూపాయలు… సెంట్రల్ బస్‌స్టాండ్‌కు అర్ధరాత్రి చేరింది… ఆకలి… కుక్కలకు వేసే బ్రెడ్ తిని ఆకలి తీర్చుకుంది… పొద్దున ఓ స్నేహితురాలి దగ్గరకు వెళ్లి, మెడలో గొలుసు అమ్మేస్తే, కొన్న సేటు 500 ఇచ్చాడు… పేయింగ్ గెస్టు కదా, ఫ్రెండ్‌కు 200 ఇచ్చింది టెంపరరీగా… 100 రూపాయల్లో రెండు లెగ్గింగ్స్, కొని, అక్కడక్కడా ప్రయత్నిస్తే ఓచోట టెలికాలర్‌గా కొలువు దొరికింది… మెడికల్ ఫాలోఅప్స్, ఖర్చులతో అలా అలా నెట్టుకొచ్చింది… రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్ము కూడా ఈమధ్యే ఖర్చయిపోయింది… తను పెంచుకున్న ఓ బిడ్డ కోసం…
తన జీవితంలోకి నిరాశను రానివ్వకుండా ఉండేందుకు, తన విషాదం నుంచి తనను తాను డైవర్ట్ చేసుకునేందుకు ఓ అమ్మాయిని ఆమె దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే కదా… ‘‘తను అని పేరు పెట్టుకున్నాను… అన్నీ తనే అనుకున్నాను… కానీ గొంతు దగ్గర ఏదో బ్రీతింగ్ ప్రాబ్లం… సెట్ కావడం లేదు, ఐసీయూలో చేర్పించాను, నా డబ్బంతా ఖర్చయిపోయింది… బిగ్‌బాస్ హౌజుకు వచ్చేముందే తను నాకు లేకుండా పోయింది, నాదే తప్పు, తనను మేం పెంచుకుంటాం అని ఎవరడిగినా ఇవ్వలేదు, ఇచ్చినా బాగుండేదేమో… లాస్ట్ మూమెంట్‌లో కూడా పాప దగ్గర లేకుండా పోయాను… ఇక ఏడ్చే ఓపిక కూడా లేదు…’’ అన్నదామె…!
అంటే ఆ పెంచుకున్న అమ్మాయి కూడా లేదు ఇప్పుడు..! పాపకు సంబంధించిన చివరి క్రియలన్నీ జరిపి, బిగ్‌బాస్ క్వారంటైన్‌కు వచ్చింది… అందుకే తనకెవరూ ఉండరు, తనకెవరూ దక్కరు, ఎప్పుడూ ఇక ఒంటరినేనా అనే బాధ నిజానికి ఇంకా ఎక్కువ పీడించాలి ఆమెను… కానీ దాన్నుంచి కూడా బయటపడి, ఈరోజుకూ ఆప్టిమిస్టిక్‌గానే మాట్లాడుతోంది… డెస్టినీ ఇచ్చింది తీసుకోవాల్సిందే అంటోంది… రియల్లీ పాథటిక్…
ఇలాంటి బతుకు నాకెందుకు ఇచ్చావు అని దేవుడినేమీ తిట్టడం లేదు… ఏదైనా జరగనీ, స్వీకరించాలి, పాజిటివ్‌గా జీవితంలో ముందుకు వెళ్లాలి కదా అంటోంది… ఆమె మరో విషయమూ చెప్పింది… యాక్సిడెంట్ సమయంలోనే ఆమెకు పలు సర్జరీలు జరిగినప్పుడు గర్భసంచీ తీసేశారు… ‘‘నాకు ఆ చాన్స్ కూడా లేదు, దేవుడు అదీ తీసేశాడు… సో, బయటికి వెళ్లాక ఇంకో అమ్మాయిని దత్తత తీసుకుంటా… నాకు దూరమైన అందరి ప్రేమనూ తనకు ఇస్తా’’ అని షేర్ చేసుకుంది… ఇది విన్నాక మళ్లీ కలుక్కుమంది…
అందరి బతుకులూ ఒకలా ఉండవు… నిజమే, కానీ ఆ తీవ్ర విషాదం నుంచి కూడా తనను తాను బయట పడేసుకుని, ఒక ఆడపిల్ల తన కాళ్లపై తాను స్థిరంగా నిలబడి…, ఇంకా పచ్చిపచ్చిగానే ఉన్న గాయాలు, అనుభవాలను తలుచుకుని నవ్వుతూ… ‘‘ఏముంది..? మరో అమ్మాయిని మళ్లీ పెంచుకుంటాను, తన ద్వారా నా బతుకులో కాస్త ఆనందాన్ని నింపుకోలేనా’’ అని కన్నీళ్లు దాచుకుంటూ ఆమె అడిగిన ప్రశ్న… టైప్ చేస్తుంటేనే ఎక్కడో ఏదో మెలిపెట్టేసినట్టుగా ఉంది…! (ఓ ముసలి మూర్ఖ నాయకుడు వీళ్లపై వ్యభిచారులనే ముద్రలు వేస్తున్నాడు…)
Share this Article