‘‘ఈమె నవ్వు బీమా చేయబడింది’’… సింపుల్, బినాకా టూత్‌పేస్ట్ వాడితే బీమా చేసినట్టేనట… ఫ్లోరైడ్ ఆధారిత టూత్‌పేస్ట్ దంతక్షయానికి విరుగుడు అని చెబుతోంది ఈ వాణిజ్య ప్రకటన… నిజంగానే అప్పట్లో ఈ టూత్‌పేస్ట్ తన వాణిజ్య ప్రకటనలాగే చాలా ఫేమస్… యాడ్ కూడా చాలా క్రియేటివ్‌గా ఉంది… తమ టూత్‌పేస్ట్ ప్రయోజనం ఏమిటో రెండుమూడు పదాల్లో జనానికి చెప్పేలా….! వాళ్ల యాడ్స్ భలే ఉండేవి అప్పట్లో…
కొన్నిసార్లు సోషల్ మీడియాలో ఒరిజినల్ పోస్టులకన్నా… కామెంట్లలో వచ్చే వివరాలే మనకు కొత్త కొత్తగా పాత కథల్ని గుర్తుచేస్తాయి… ఈ కథ కూడా అలా కనిపించిందే… ముందుగా ఈ బినాకా గురించి… 1950లో పుట్టిన కంపెనీ… నంబర్ వన్ రేంజుకు ఎదిగింది 1970 నాటికి… అప్పట్లో బినాకా గీత్‌మాల రేడియోలో ఫుల్ ఫేమస్ ప్రోగ్రామ్… డాబర్ వాళ్లు తరువాత దీన్ని టేకోవర్ చేశారు… ఫ్లోరైడ్ ఆధారిత టూత్‌పేస్టులు నిజానికి మంచివి కావని నిషేధించింది ప్రభుత్వం… అన్ని బ్రాండ్లూ మార్కెట్ నుంచి ఉపసంహరించారు తరువాత కాలంలో… అప్పట్లో బినాకాతోపాటు కోల్గేట్, ఫోర్‌హాన్స్ బ్రాండ్లు దొరికేవి…
మరి ఈ మోడల్..? అదే చెప్పాలనుకుంటున్నది… ఈ మోడల్ పేరు నీర్జా భానోత్… అందంగా కనిపిస్తున్న ఈ నవ్వు అర్థంతరంగా రాలిపోయింది… కానీ అనేక మంది ప్రాణాలను కాపాడి, ధైర్యంగా తూటాలకు ఎదురుగా నిలబడి… స్ఫూర్తిదాయకంగా వ్యవహరించింది… అదీ ఆమె కథ… భారత ప్రభుత్వం అశోకచక్ర అవార్డును ఇచ్చింది ఆమె మరణానంతరం… పలు అవార్డులు, పోస్టల్ స్టాంపు… మరొక్కరోజు గడిస్తే చాలు, 24వ పడిలోకి ప్రవేశిస్తుందనగా, ఉగ్రవాదం ఆమెను బలితీసుకుంది…
Ads
1986… సెప్టెంబరు 5… తెల్లవారుజాము… ముంబై నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయల్దేరిన ఓ విమానం పాకిస్థాన్‌లోని కరాచీలో ఆగింది… ఇండియన్స్ మాత్రమే కాదు, అందులో అమెరికన్లు, జర్మన్లు, పలు దేశాలకు చెందిన 360 మంది ప్రయాణికులు ఉన్నారు… అందులో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసేది నీర్జా భానోత్… చండీగఢ్‌లో పుట్టిన ఆమె తండ్రి ఓ ప్రముఖ జర్నలిస్టు… 21 ఏళ్లకే గల్ఫ్‌లో పనిచేసే ఓ వ్యక్తితో పెళ్లయింది… కానీ కొన్నాళ్లకే వదిలేసి వచ్చింది… మొదట మోడల్‌గా పనిచేస్తూ, తరువాత ఈ కొలువు వెతుక్కుంది…
కరాచీ ఎయిర్‌పోర్టులో విమానం దిగిన కాసేపటికే ఉగ్రవాదులు విమానాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు… ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ల డ్రెస్సులు వేసుకుని విమానంలోకి జొరబడ్డారని తరువాత తెలిసింది… ఒకడు ఎంట్రన్స్‌లోనే ఉన్న నీర్జా జుత్తుపట్టుకుని, తుపాకీ గురిపెట్టి, నిలబడ్డాడు… వెంటనే నీర్జాకు ప్రమాదం అర్థమై, ఇంటర్‌కామ్‌లో హైజాక్ కోడ్ వినిపించి, కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లను అలర్ట్ చేసింది… దీంతో పైలట్, కోపైలట్, ఫ్లయిట్ ఇంజనీర్ హైజాకర్లు కాక్‌పిట్‌లోకి రాకముందే తప్పించుకున్నారు…
వాళ్లు పాలస్తీనా ఉగ్రవాదులు… వాళ్లకు కావల్సింది అమెరికన్ల ప్రాణాలు… అందుకే అందరి పాస్‌పోర్టులు కలెక్ట్ చేయాలని ఆర్డర్ వేశాడు ఒకడు నీర్జాను… ఎందుకలా అడిగాడో నీర్జాకు అర్థమైంది… అమెరికన్ల పాస్‌పోర్టులను ఓ సీటు కింద దాచిపెట్టింది… ఎవరి జాతీయత ఏమిటో తెలియకుండా ఉండటానికి…! 41 మంది అమెరికన్లున్నారు విమానంలో… ఒక్కొక్కరి జాతీయతే ప్రశ్నిస్తూ కాల్చడం స్టార్ట్ చేశారు ఉగ్రవాదులు… 17 గంటలు గడిచాయి… ఈలోపు తమ స్టాఫ్‌లో ఒకరిద్దరి సాయంతో ఎమర్జెన్సీ డోర్ తీసి, ప్రయాణికులను పారిపొమ్మని చెప్పింది…
తను వెంటనే బయటికి దూకి పారిపోలేదు… పిల్లల్ని బయటికి చేరవేస్తోంది… ఉగ్రవాదులు రెచ్చిపోయి ఆమెపైకి, పారిపోతున్న ప్రయాణికులపైకి కాల్పులు జరిపారు… 20 మంది మరణించారు… ఆమెకు కూడా తూటాలు తగిలాయి… ఈలోపు పోలీసులకు ఉగ్రవాదులు దొరికిపోయారు… ఆమె అక్కడే ప్రాణాలు వదిలింది… కానీ దాదాపు 340 మంది ప్రయాణికుల్ని కాపాడగలిగింది… తన బతుకును చరితార్థం చేసుకుంది ఆమె… ఆ బినాకా నవ్వు అలా కర్తవ్యనిర్వహణలో రాలిపోయింది..!! (2016లో ఆమె కథను సోనమ్ కపూర్ కథానాయికగా ఆమె పేరుతోనే సినిమా తీశారు…)
Share this Article